బైబ్యాక్‌లో ఇన్ఫీ ప్రమోటర్లు రూ.2 వేల కోట్ల షేర్ల విక్రయం!

బైబ్యాక్‌లో ఇన్ఫీ ప్రమోటర్లు రూ.2 వేల కోట్ల షేర్ల విక్రయం!


న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌లో ప్రమోటర్లు జోరుగానే పాల్గొంటున్నారు. ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి, నందన్‌ నీలేకనితో పాటు ఇతర సహ–వ్యవస్థాపకులు తమవద్దనున్న వాటాల్లో 1.77 కోట్ల షేర్లను బైబ్యాక్‌లో విక్రయించేందుకు ముందుకొచ్చారు. వీటి విలువ దాదాపు రూ.2,038 కోట్లుగా అంచనా. ఒక్కో షేరుకి రూ.1,150 చొప్పున మొత్తం రూ.13,000 కోట్ల విలువైన బైబ్యాక్‌ ఆఫర్‌ను(దాదాపు 11.3 కోట్ల షేర్లు) ఇన్ఫోసిస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కంపెనీ చరిత్రలో ఇది తొలి బైబ్యాక్‌ కావడం గమనార్హం.



 ప్రమోటర్లతో ముఖ్యంగా నారాయణమూర్తితో విభేదాల కారణంగా కంపెనీ సీఈఓ పదవికి విశాల్‌ సిక్కా అర్ధంతరంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆతర్వాత జరిగిన పరిణామాల్లో చైర్మన్‌ ఆర్‌.శేషసాయి మరికొందరు బోర్డు సభ్యులు కూడా వైదొలిగారు. సంస్థాగత ఇన్వెస్టర్ల ఒత్తిడితో ఇన్ఫీ సహ–వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని చైర్మన్‌ పగ్గాలను అందుకున్నారు. ఇక ఇప్పుడు కొత్త సీఈఓ–ఎండీ నియామకంపై కంపెనీ బోర్డు తీవ్రంగా దృష్టిసారిస్తోంది. సిక్కా రాజీనామా ఉదంతంతో ఇన్ఫీ షేరు ధర దాదాపు 15 శాతం మేర కుప్పకూలిన విషయం విదితమే. నీలేకని రీఎంట్రీతో కొద్దిగా కోలుకొని ప్రస్తుతం రూ.920 వద్ద కదలాడుతోంది.



నీలేకని, మూర్తివే ఎక్కువ...

ఇన్ఫీ సహ–వ్యవస్థాపకులు వారి కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం ప్రమోటర్ల గ్రూప్‌నకు ఈ ఏడాది జూన్‌ చివరినాటికి కంపెనీలో 12.75 శాతం(29.28 కోట్ల షేర్లు) వాటాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రమోటర్లు ఆఫర్‌చేస్తున్న మొత్తం షేర్లను(1.77 కోట్ల షేర్లు) బైబ్యాక్‌లో కంపెనీ ఆమోదిస్తే... వారికి లాభాల పంటపండినట్లే. బైబ్యాక్‌లో విక్రయం కోసం ప్రమోటర్లకు సంబంధించి నీలేకని, మూర్తి ఆఫర్‌ చేసిన షేర్లే ఎక్కువగా ఉన్నాయి. నీలేకని(కుటుంబం) 58 లక్షల షేర్లను, మూర్తి(భార్య సుధ, ఇద్దరు పిల్లలతో కలిపి) 54 లక్షల షేర్లను విక్రయానికి ఉంచుతున్నారు. ఇక ఎస్‌.గోపాలకృష్ణన్‌ కుటుంబం 22 లక్షల షేర్లను, కె.దినేష్‌ 29 లక్షల షేర్లను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫీ ప్రమోటర్లలో వ్యక్తితంగా అత్యధిక వాటా(2.14 శాతం) గోపాలకృష్ణన్‌ భార్య సుధా గోపాలకృష్ణన్‌కే ఉండటం విశేషం. కాగా, మరో ప్రమోటర్‌ ఎస్‌డీ శిబులాల్‌ బైబ్యాక్‌లో పాల్గొనడం లేదు. ఆయన భార్య, కుమారుడు మాత్రం 14 లక్షల షేర్లను విక్రయానికి పెడుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top