నాలుగో వంతు మోసపోతున్నారు!!

Indians face 25% higher risks to financial fraud: Report - Sakshi

డిజిటల్‌ ఖాతాదారుల్లో 24 శాతం బాధితులే

భారత్‌లో పెరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలు

ఎక్స్‌పీరియన్‌ నివేదికలో వెల్లడి

ముంబై: డిజిటల్‌ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. అయితే ఇదే స్థాయిలో ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాల్లో మోసపోతున్న భారతీయుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతున్నట్లు అంతర్జాతీయ ఆర్థిక సమాచార సంస్థ, ఎక్స్‌పీరియన్‌ తాజా నివేదిక వెల్లడించింది.

ఆస్ట్రేలియా, చైనా, హాంకాంగ్, భారత్, ఇండోనేషియా, జపాన్, న్యూజిలాండ్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం– ఈ మొత్తం పది ఆసియా పసిఫిక్‌దేశాల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా మరో అంతర్జాతీయ సంస్థ, ఐడీసీతో కలసి ఈ నివేదికను రూపొందించింది. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలకు గురవుతున్నారంటున్న ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు....

ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిపే భారతీయుల్లో 24% ప్రత్యక్షంగా ఆర్థిక మోసాలకు బలవుతున్నారు.  
 టెలికం రంగంలో ఆన్‌లైన్‌ మోసాలు అత్యధికంగా 57%గా ఉన్నాయి.  తర్వాతి స్థానాల్లో బ్యాంక్‌లు (54%), రిటైల్‌ సంస్థ (46%) నిలిచాయి.  
 ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిపే భారతీయుల్లో సగం మంది బ్యాంక్‌లతో తమ వివరాలను చెప్పడానికి ఎలాంటి సంకోచం వ్యక్తం చేయడం లేదు. వినియోగదారులు తమ వివరాలను వెల్లడించడానికి ఎక్కువగా ఇష్టపడని రంగంగా బ్రాండెడ్‌ రిటైల్‌ రంగం నిలిచింది. 30 శాతం మంది మాత్రమే తమ డేటాను వెల్లడిస్తున్నారు.  
    65 శాతం మంది మొబైల్‌ ఫోన్‌ ద్వారా చెల్లింపులు జరపడానికే మొగ్గు చూపుతున్నారు.  
   వివిధ సేవలను పొందడానికి గాను 51% మంది తమ వ్యక్తిగత వివరాలను సైతం వెల్లడిస్తున్నారు.  
   ఎలక్ట్రానిక్స్, ట్రావెల్‌ మార్కెటింగ్‌ సంస్థలు వినియోగదారుల డేటాను సేకరిస్తున్నాయి. ఈ రంగాల్లో ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరుగుతున్నాయి. అయితే ఈ రంగాల్లో కూడా మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.  
    ఆసియా–పసిఫిక్‌ దేశాల్లో అధికంగా డిజిటల్‌ లావాదేవీలను నిర్వహిస్తున్న దేశాల్లో ఒకటిగా  భారత్‌ నిలిచింది. సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 90 శాతం మంది డిజిటల్‌ సర్వీసులను వినియోగిస్తున్నామని తెలిపారు.  
 ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిపేటప్పుడు తప్పుడు వివరాలు ఇస్తున్న వారి పరంగా చూసినప్పుడు భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top