
సాక్షి,ముంబై: దేశీ కరెన్సీ రూపాయి మరింత పాతాళానికి పడిపోయింది. ఆరంభంలో రికార్డు కనిష్టాలనుంచి స్వల్పంగా కోలుకున్నా రికార్డు పతనంనుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. ఆరంభం లాభాలన్నీ ఆవిరై పోయాయి. 16పైసలు క్షీణించి 71.73 వద్ద మరోసారి రికార్డు పతనాన్ని నమోదు చేసింది. తద్వారా డాలరు మారకంలో 72స్థాయికి చేరువలో ఉంది. ప్రారంభ లాభాలను ఏమాత్రం నిలబెట్టుకోలేని రూపాయి ఎనలిస్టులు భయపడినట్టుగానే మరింత దిగజారి రికార్డు నష్టాల్లో కొనసాగుతోంది.
కాగా రోజుకో కొత్త కనిష్టాన్ని తాకుతున్న రూపాయి బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త కోలుకుంది. వరుసగా అయిదురోజుల రికార్డు పతనం.ముఖ్యంగా మంగళవారం నాటి చరిత్రాత్మక కనిష్టం నుంచి పుంజుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో18 పైసలు(0.25 శాతం) బలపడి71.40 వద్ద మొదలైంది. రూపాయి కొద్దిగా కోలుకున్నా చివరికి 37 పైసలు(0.5 శాతం) పతనమై రికార్డు కనిష్టం 71.58 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.