 
													సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయ మరోసారి  రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. సోమవారం మల్లీ పతనదిశగా పయనించిన రూపాయి ఇంట్రాడేలో 72.25  స్థాయికి పతనమైంది.  డాలరుతో మారకంలో శుక్రవారం  కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ , అప్పటి ముగింపు 71.66 తో పోలిస్తే ప్రారంభంలోనే 32 పైసలు క్షీణించి ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 71.98 వద్ద ట్రేడ్ అయింది. తరువాత 72.08 కు పడిపోయింది.  మునుపటి ముగింపుతో పోలిస్తే 42 పైసలు నష్టపోయింది.
 
అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకుల నుండి బలమైనడాలర్ డిమాండ్ కారణంగా భారత రూపాయి, ఇతర ఆసియా కరెన్సీలతో పాటు  దేశీయంగా  ఒత్తిడి పెరిగింది. దీంతో  2019  ఆర్థిక సంవత్సరంలో  72.25 వద్ద  రికార్డు కనిష్టానికి పడిపోయింది. కాగా   అక్టోబర్ 5,  2018 న  రూ .74.07  వద్ద ఆల్ టైమ్ పతనం నమోదైంది. 
మరోవైపు చమురు ధరలు  కూడీ క్షీణించాయి. అమెరికా ముడి చమురు కొత్త సుంకాలకు లోబడి ఉంటుందని చైనా ప్రకటించిన రెండు వారాల వ్యవధిలో అమెరికా ముడిచమురు కనిష్టానికి పడిపోయింది. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్  బ్రెంట్ ముడి ఫ్యూచర్స్  బ్యారెల్‌కు 0.91 శాతం తగ్గి 58.80 డాలర్లకు చేరుకుంది. దేశీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు చేపడుతుండటం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు నిపుణులు  తెలిపారు. ఆగస్ట్ నెలలో ఇప్పటివరకూ(1-23 మధ్య) ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో ఏకంగా రూ. 12,105 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా,   ఆగస్ట్‌లో రూపాయి 4.5 శాతం తిరోగమించింది. ఇది ఇలా వుంటే   పుత్తడి, వెండి ధరలు  ఆల్ టైం గరిష్టానికి చేరాయి. 
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
