వెలుగులోకి నీరవ్‌, చౌక్సిల సీక్రెట్‌ అకౌంట్లు

I-T Dept Probes 50 Secret Bank Accounts Of Nirav and Mehul outside India - Sakshi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు చెక్కేసిన నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సిలకు చెందిన సీక్రెట్‌ బ్యాంకు అకౌంట్లను ఆదాయపు పన్ను శాఖ పట్టేసింది. భారత్‌కు వెలుపల వీరిద్దరికీ సుమారు 50 సీక్రెట్‌ బ్యాంకు అకౌంట్లు ఉన్నట్టు గుర్తించింది. ఈ బ్యాంకు అకౌంట్లు లండన్‌, హాంకాంగ్‌, యూఏఈ, మోరోక్కోతో పాటు పలు పన్ను ఎగవేత దేశాల్లో ఉన్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఐటీ డిపార్ట్‌మెంట్‌ సీనియర్‌ అధికారి ఇండియాటుడే.ఇన్‌కి ధృవీకరించారు. ప్రస్తుతం ఈ బ్యాంకు అకౌంట్లు విచారణలో ఉన్నట్టు తెలిపారు. మొత్తం 50 సీక్రెట్‌ బ్యాంకు అకౌంట్లలో 40 బ్యాంకు అకౌంట్లు నీరవ్‌ మోదీకి చెందినవి కాగ, 8 నుంచి 10 బ్యాంకు అకౌంట్లు మెహుల్‌ చౌక్సి పేరుతో తెరిచి ఉన్నట్టు పేర్కొన్నారు. 

ఈ బ్యాంకు అకౌంట్ల వివరాలను నీరవ్‌ కానీ, చౌక్సి కానీ ఇద్దరూ ఏజెన్సీకి వెల్లడించలేదు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులలో కూడా వీటిని ఫైల్‌ చేయలేదు. ప్రస్తుతం లెక్కల్లో చూపని వీరి బ్యాంకు అకౌంట్లను, కంపెనీల్లో పెట్టుబడులను, ఇతర షేర్‌ హోల్డింగ్స్‌ను, విదేశీ ఆస్తులను విచారిస్తున్నారు. ఈ 50 సీక్రెట్‌ బ్యాంకు అకౌంట్లలో ఎంత మొత్తంలో దాచి ఉంచారన్నది కూడా తెలియరాలేదు. ఈ ఇద్దరికి వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాధారాల కోరుతూ ఆయా దేశాలకు ఐటీ డిపార్ట్‌మెంట్‌ లెటర్‌ రోగటరీ కూడా జారీచేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించడం కోసం వెయ్యికి పైగా బ్యాంకు అకౌంట్లను మోదీ, చౌక్సిలు క్రియేట్‌ చేసినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ అకౌంట్లను షెల్‌ కంపెనీల పేరుతో తెరిచినట్టు తెలిపాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top