తెలుగు రాష్ట్రాల్లోకి ‘హోమ్‌’ టీవీలు 

home tv launched to two telugu states - Sakshi

32–65 అంగుళాల  శ్రేణిలో 12 మోడళ్లు 

టీవీల ధరలు రూ.10,990–64,990

విస్తరణకు రూ.25 కోట్ల వ్యయం  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎల్‌ఈడీ టీవీల విపణిలోకి ఇటీవల ప్రవేశించిన కొత్త బ్రాండ్‌ ‘హోమ్‌’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది. కంపెనీ 12 రకాల మోడళ్లను రూ.10,990–64,990 ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. 365 రోజులపాటు రీప్లేస్‌మెంట్‌ వారంటీ ఉంది. 4కే హెచ్‌డీ స్మార్ట్‌ టీవీలు రూ.29,990 నుంచి, 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ టీవీల శ్రేణి రూ.34,990 నుంచి అందుబాటులో ఉంది. మొబైల్స్‌ రిటైల్‌ దుకాణాల్లో ఈ టీవీలు లభిస్తాయి. హ్యాండ్‌సెట్స్‌ పంపిణీ, విక్రయం, ఏవియేషన్‌ తదితర వ్యాపారాల్లో ఉన్న గుజరాత్‌కు చెందిన రూ.2,500 కోట్ల పూజారా గ్రూప్‌ హోమ్‌ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తోంది. శామ్‌సంగ్‌ ప్యానెళ్లను దిగుమతి చేసుకుని నోయిడాలోని ప్లాంటులో టీవీల అసెంబ్లింగ్‌ చేపడుతున్నామని హోమ్‌ ఇండియా ఎండీ రాహిల్‌ పూజారా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. మొబైల్‌ కంటే చవకగా టీవీలు అన్న నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు.
 
హైదరాబాద్‌లో యూనిట్‌.. 
భాగ్యనగరిలో అసెంబ్లింగ్‌ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో హోమ్‌ పంపిణీదారు సీవోఎస్‌ఆర్‌ వెంచర్స్‌ సీఈవో రమేశ్‌ బాబు చెప్పారు. ఏడాదిలో ఇది కార్యరూపంలోకి వస్తుందన్నారు. నోయిడా ప్లాంటు సామర్థ్యం నెలకు 50,000 యూనిట్లు. మరో 50,000 యూనిట్ల సామర్థ్యాన్ని దీనికి జోడిస్తున్నారు. విస్తరణకు రూ.25 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కంపెనీ డైరెక్టర్‌ అహ్మద్‌ జియా తెలిపారు. వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల తయారీలోకి సైతం హోమ్‌ ప్రవేశిస్తోంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top