ఆధార్‌ ప్రింట్‌ చేసినట్టు కాదు..!

Hero, Bajaj, TVS Strongly Object Niti Aayog Move for All Electric Two wheelers - Sakshi

‘ఎలక్ట్రిక్‌’కు మారడంపై టీవీఎస్, బజాజ్‌ ఆటో విమర్శలు

పూర్తి సప్లయ్‌ చెయిన్‌ను ఏర్పాటు చేయాలని సూచన

నీతి ఆయోగ్‌ ప్రతిపాదన పట్ల అభ్యంతరం

న్యూఢిల్లీ: త్రిచక్ర వాహనాలను 2023 నుంచి, ద్విచక్ర వాహనాలను 2025 నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్‌ రూపంలోనే అనుమతించాలన్న నీతి ఆయోగ్‌ ప్రతిపాదనపై అగ్రశ్రేణి ఆటో కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. ఇదేమీ ఆధార్‌ కార్డును ప్రింట్‌ చేసింత ఈజీ కాదని టీవీఎస్, బజాజ్‌ ఆటో వ్యాఖ్యానించాయి. ఈ ప్రతిపాదనల వెనక తగినంత అధ్యయనం, సంప్రదింపులు లేవని పేర్కొన్నాయి. ‘‘ఇది ఆధార్‌ కార్డు కాదు. సాఫ్ట్‌వేర్, ప్రింట్‌ కార్డులు కాదు. మొత్తం సరఫరా చెయిన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రస్తుత వ్యవస్థ నుంచి దానికి మళ్లాల్సి ఉంటుంది’’ అని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. తమ ప్రతిపాదనలపై రెండు వారాల్లో ఆటో మొబైల్‌ పరిశ్రమ స్పందించాలని నీతి ఆయోగ్‌ కోరిన నేపథ్యంలో వేణు శ్రీనివాసన్‌ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.  

నాలుగు నెలల సమయం కోరాం...
‘‘ఓ ప్రణాళికతో ముందుకు రావడానికి మాకు నాలుగు నెలల సమయం పడుతుందని తెలియజేశాం. ప్రణాళిక ఓ నగరంతో (అత్యధిక ద్విచక్ర వాహనాలు కలిగిన నగరం) మొదలవుతుంది. ఆ తర్వాత బదిలీ అన్నది కొంత కాలానికి జరుగుతుంది’’ అని వేణు శ్రీనివాసన్‌ తెలిపారు. 2 కోట్ల వాహనాలు, 15 బిలియన్‌ డాలర్ల అమ్మకాలు, 10 లక్షల మంది ఉపాధితో కూడిన ఈ రంగంలో ఒకేసారి పూర్తిగా మార్పు అన్నది సాధ్యం కాదని చెప్పారాయన. థర్మల్‌ (బొగ్గు ఆధారిత) విద్యుత్‌తో నడిచే బ్యాటరీలకు మళ్లడం కాలుష్యాన్ని తగ్గించదని స్పష్టంచేశారు.

కాలుష్యంలో వాహనాల పాత్ర 20 శాతం అయితే, ఇందులో ద్విచక్ర వాహనాల నుంచి వెలువడే కాలుష్యం 20 శాతమేనని, అంటే కేవలం 4 శాతం కాలుష్యం గురించి ఇదంతా చేస్తున్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా డీల్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కాగా పూర్తిగా 100 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు మళ్లడం అన్నది అవసరం లేదని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ చెప్పారు. కార్లు తదితర వాహనాలను వదిలేసి, కేవలం ద్వి, త్రిచక్ర వాహనాలనే లక్ష్యం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.  

తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం: హీరో మోటోకార్ప్‌
150సీసీ సామర్థ్యం వరకు, ఇంటర్నల్‌ కంబస్టన్‌ ఇంజిన్లతో కూడిన ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించాలన్న నీతి ఆయోగ్‌ విధానంతో తలెత్తబోయే పరిణామాలపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు అగ్రగామి టూవీలర్‌ కంపెనీ హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. ఈ విధానంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. 150సీసీ సామర్థ్యంలోపు ముఖ్యంగా 100సీసీ, 110సీసీ, 125సీసీ విభాగంలో విక్రయమయ్యే అత్యధిక వాహనాలు ఈ కంపెనీవే.

భాగస్వాములు అందరి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని కంపెనీ సూచించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల అమలును బలవంతంగా రుద్దడానికి బదులు, మార్కెట్‌ పరిస్థితులు, కస్టమర్ల వైపు నుంచి ఆమోదం వంటి అంశాలతో ఎలక్ట్రిక్‌ వాహనాలకు మళ్లడం అనేది ఆధారపడి ఉండాలని సూచించింది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రంగంపై ప్రతిపాదిత నిషేధం తీవ్ర ప్రభావం చూపుతుందని హీరో మోటోకార్ప్‌ ఆందోళన వ్యక్తం చేసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top