ఇంకా ఒడిదుడుకుల్లోనే..! | Global influence on Indian stock market weakens | Sakshi
Sakshi News home page

ఇంకా ఒడిదుడుకుల్లోనే..!

Nov 16 2015 12:41 AM | Updated on Sep 3 2017 12:32 PM

ఇంకా ఒడిదుడుకుల్లోనే..!

ఇంకా ఒడిదుడుకుల్లోనే..!

దేశీ స్టాక్ మార్కెట్ మరికొద్ది రోజులు పతనబాటలోనే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

సెంటిమెంట్‌పై పారిస్ ప్రభావం
* టోకు ద్రవ్యోల్బణంపై దృష్టి
* తిరోగమనం కొనసాగొచ్చు!
* ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణులు...
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ మరికొద్ది రోజులు పతనబాటలోనే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.  పారిస్‌లో చోటుచేసుకున్న భయానక ఉగ్రవాద దాడుల ప్రభావం సోమవారం తొలుత మార్కెట్‌పై పడవచ్చని భావిస్తున్నారు.

అటు తర్వాత ఇదేరోజున వెలువడే అక్టోబర్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణం గణాంకాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు వారు అభిప్రాయపడ్డారు.‘కార్పొరేట్ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు దాదాపు ముగిశాయి. దీంతో ఇక దేశీ మార్కెట్లు.. విదేశీ పరిణామాలనే నిశితంగా గమనిస్తుంటాయి. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు వాదనలు బలపడుతున్న నేపథ్యంలో మన మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయి.

ప్రస్తుత తిరోగమన ధోరణి కొనసాగవచ్చు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు వాస్తవ రూపంలోకి వస్తేనే మార్కెట్లకు జోష్ లభిస్తుంది. బుల్స్ మార్కెట్లోకి తిరిగి ప్రవేశించాలంటే సంస్కరణల అమలు చాలా కీలకంగా నిలుస్తుంది’ అని సామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ పేర్కొన్నారు.

బిహార్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ఘోరంగా ఓడిపోవడంతో గత వారం కూడా మార్కెట్లు పడిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల కోసం వేచిచూసే ధోరణిని అవలంబించిన విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఫీఐలు).. ఇక ఆర్థిక సంస్కరణల అమలుపై దృష్టిసారించనున్నారని.. మరికొంతకాలం దూరంగానే ఉండొచ్చని జిమీత్ అభిప్రాయపడ్డారు.
 
దాడుల ప్రభావం తాత్కాలికమే...
పారిస్‌లో ఉగ్రవాద దాడుల ప్రభావం మార్కెట్లపై తాత్కాలికంగానే వుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2001లో అమెరికాలోనూ, 2004, 2005 సంవత్సరాల్లో యూరప్‌లోనూ ఉగ్రవాదుల దాడులు జరిగిన సందర్భంలో వాటి ప్రభావం ఒకటి, రెండు రోజులే వుందని, అటుతర్వాత మార్కెట్లు వేగంగా కోలుకున్నాయని వారు గుర్తుచేస్తున్నారు. తదుపరి రోజుల్లో ఆర్థికాంశాల ఆధారంగానే మార్కెట్ కదులుతుందని వారన్నారు.
 
ఫెడ్ సంకేతాలతో ఆందోళన...
వచ్చే నెలలో జరగనున్న పాలసీ సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ దశాబ్దకాలం తర్వాత వడ్డీరేట్లను పెంచేందుకు సిద్ధమవుతోందన్న వాదనలు జోరందుకుంటున్నాయి. గతవారంలో ఫెడ్ చైర్‌పర్సన్ జానెట్ ఎలెన్ కూడా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో రేట్ల పెంపు ఉండొచ్చన్న సంకేతాలిచ్చారు.

దేశీ మార్కెట్ సెంటిమెంట్‌ను రేట్ల పెంపు తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క, గ్లోబల్ మార్కెట్ల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గులతో పాటు టోకు ధరల ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా ఈ వారం మన మార్కెట్ గమనాన్ని నిర్ధేశించనున్నాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు.

వడ్డీరేట్లపై ఫెడ్ నిర్ణయం భారత్ స్టాక్ మార్కెట్‌కు కీలకమైన ట్రిగ్గర్‌గా నిలుస్తుందన్నారు. గతవారం వెలువడిన గణాంకాల్లో పారిశ్రామికోత్పత్తి సూచీ నాలుగు నెలల కనిష్టానికి(3.6 శాతం) పడిపోగా.. రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం పైకి ఎగబాకిన సంగతి తెలిసిందే. ఇటీవలి మార్కెట్ పతనంతో చాలా ఇండెక్స్ దిగ్గజాలు భారీగా అమ్మకాల ఒత్తిడి(ఓవర్‌సోల్డ్)కి గురయ్యాయని.. అయితే, తక్షణం మళ్లీ పుంజుకునే దాఖలాలేవీ కనబడటం లేదని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ వ్యాఖ్యానించారు.
 
గతవారం మార్కెట్...
బిహార్ ఎన్నికల ఫలితాలు, పారిశ్రామికోత్పత్తి పడిపోవడం ఇతరత్రా ప్రభావాలతో దేశీ మార్కెట్లు వరుసగా మూడో వారంలోనూ నష్టాల్లోనే ముగిశాయి. గతవారంలో సెన్సెక్స్ కీలకమైన 26 వేల పాయింట్ల స్థాయిని కోల్పోయింది. 654 పాయింట్లు క్షీణించి 25,611 వద్ద స్థిరపడింది. ఇక  నిఫ్టీ 192 పాయింట్లు నష్టపోయి 7,762 వద్ద ముగిసింది.
 
రెండు వారాల్లో 2,800 కోట్లు వెనక్కి...
కార్పొరేట్ల రెండో త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం, అమెరికాలో వడ్డీరేట్ల పెంపు భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) పెట్టుబడులను వెనక్కితీసుకుంటున్నారు. గడచిన రెండు వారాల్లో(ఈ నెల 2-13 వరకూ) దేశీ మార్కెట్ల నుంచి రూ.2,819 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2,505 కోట్లను, డెట్ మార్కెట్(బాండ్లు) నుంచి రూ.313 కోట్లను వెనక్కి తీసుకున్నారు. అక్టోబర్ నెలలో రూ.22,350 కోట్ల మొత్తాన్ని ఎఫ్‌పీఐలు నికరంగా పెట్టుబడిపెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement