గణాంకాలపై మార్కెట్ల ఫోకస్ | Get the stock market experts views and advice | Sakshi
Sakshi News home page

గణాంకాలపై మార్కెట్ల ఫోకస్

Aug 11 2025 1:10 AM | Updated on Aug 11 2025 1:10 AM

Get the stock market experts views and advice

క్యూ1 ఫలితాలకూ ప్రాధాన్యం 

కీలకంకానున్న ఎఫ్‌పీఐల ధోరణి 

టారిఫ్‌ అంశాలపైనా ఇన్వెస్టర్ల దృష్టి 

ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులే

ప్రధానంగా ఆర్థిక గణాంకాలు, వాహన విక్రయాలు, యూఎస్‌ టారిఫ్‌లు ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు దిక్సూచి కానున్నాయి. అంతేకాకుండా ఇటీవల నిరవధికంగా అమ్మకాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) ధోరణి సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనుంది. మరోపక్క ముగింపు దశకు చేరుకున్న క్యూ1 ఫలితాల సీజన్‌కూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం(15న) సెలవుకావడంతో ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. అయితే ద్రవ్యోల్బణ గణాంకాలు, ఏప్రిల్‌–జూన్‌(క్యూ1) ఫలితాలు, యూఎస్‌తో వాణిజ్య సంబంధాలు, ఎఫ్‌పీఐల అమ్మకాలు ఈ వారం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపే వీలున్నట్లు స్టాక్‌ విశ్లేషకులు చెబుతున్నారు. జూలై నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(12న) విడుదలకానున్నాయి.

 జూన్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం వరుసగా 8వ నెలలోనూ దిగివస్తూ 2.1 శాతానికి పరిమితమైంది. 2019 జనవరి తదుపరి ఇది కనిష్టంకాగా.. 2025 మే నెలలో 2.8 శాతంగా నమోదైంది. ఇక జూలై నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) వెల్లడికానున్నాయి. జూన్‌లో డబ్ల్యూపీఐ అనూహ్యంగా 0.13 శాతం క్షీణించింది. దిగివచ్చింది. మే నెలలో 0.39 శాతం పెరుగుదల నమోదుకాగా.. 2023 అక్టోబర్‌ తర్వాత తొలిసారి వెనకడుగు వేసింది.  

క్యూ1 జాబితా 
ఈ వారం మరికొన్ని దిగ్గజాలు ప్రస్తుత ఏడాది(2025– 26) తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. జాబితాలో పీఎస్‌యూ దిగ్గజాలు ఓఎన్‌జీసీ, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌), ఇండియన్‌ ఆయిల్‌(ఐవోసీ)తోపాటు.. ఎస్‌జేవీఎన్, ఐఆర్‌సీటీసీ, ఆస్ట్రల్‌ పాలీ, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, పీఐ ఇండస్ట్రీస్, సంవర్ధన మదర్సన్, ముత్తూట్‌ ఫైనాన్స్, జూబిలెంట్‌ ఫుడ్, అశోక్‌ లేలాండ్, పతంజలి ఫుడ్స్‌ తదితరాలు చేరాయి. ఇవికాకుండా జూలైలో ప్రయాణికుల వాహన అమ్మకాల వివరాలను సియామ్‌ 15న విడుదల చేయనుంది. 2025 జూన్‌లో మొత్తం ప్రయాణికుల వాహన అమ్మకాలు 6 శాతం క్షీణించి 2,75,766 యూనిట్లకు పరిమితంకావడం గమనార్హం!  

విదేశీ అంశాలు 
భారత్‌ దిగుమతులపై టారిఫ్‌లను 50 శాతానికి పెంచుతున్నట్లు యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించడంతో ఎగుమతి సంబంధ రంగాలపై ప్రతికూల ప్రభావం కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఫార్మాపైనా వడ్డింపులు తప్పవన్న ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో ఔషధ రంగంతోపాటు.. లెదర్, కెమికల్స్, ఫుట్‌వేర్, ఆక్వా, ఐటీ, టెక్స్‌టైల్స్‌ ప్రభావితంకానున్నట్లు పేర్కొన్నారు.

 కాగా.. జూలై నెలకు చైనా, యూఎస్‌ ద్రవ్యోల్బణం తదితర గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. ఈ అంశాలన్నీ మార్కెట్లో సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా, స్వస్తికా ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా తెలియజేశారు. టారిఫ్‌లపై స్పష్టత వచ్చేవరకూ మార్కెట్లు కన్సాలిడేట్‌ కావచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. 

గత వారమిలా.. 
గతవారం(4–8) దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఆరో వారంలోనూ నష్టాలతోనే ముగిశాయి. బీఎస్‌ఈ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 742 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 79,858 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 202 పాయింట్లు(0.8 శాతం) నీరసించి 24,363 వద్ద ముగిసింది. ఈ బాటలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.3 శాతం, స్మాల్‌ క్యాప్‌ 1.9 శాతం చొప్పున బలహీనపడ్డాయి.

ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు
కొద్ది రోజులుగా పెట్టుబడులు వెనక్కి 
ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు చేపడుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ దాదాపు రూ. 18,000 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. ఇక గత నెల(జూలై)లోనూ నికరంగా అమ్మకాలకే కట్టుబడ్డారు. దీంతో జూలైలో రూ. 17,741 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు మూడు నెలల్లో(ఏప్రిల్‌ నుంచి జూన్‌) నికర కొనుగోలుదారులుగా నిలిచారు. వెరసి రూ. 38,673 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. 

కాగా.. ఈ కేలండర్‌ ఏడాది(2025)లో ఇప్పటివరకూ నికరంగా చూస్తే ఎఫ్‌పీఐలు రూ. 1.13 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! యూఎస్‌ టారిఫ్‌ ప్రకటనలు, క్యూ1 ఫలితాల నిరుత్సాహం తదితర అంశాల కారణంగా ఎఫ్‌పీఐలు ఇటీవల తిరిగి అమ్మకాల బాటలో సాగుతున్నట్లు ఏంజెల్‌ వన్‌ సీనియర్‌ ఫండమెంటల్‌ విశ్లేషకులు వకార్‌జావేద్‌ ఖాన్, మారి్నంగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.  

సాంకేతికంగా.. 
ఎఫ్‌పీఐల అమ్మకాలు, యూఎస్‌ టారిఫ్‌ల వడ్డింపు నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు క్షీణపథంలో కదులుతున్నాయి. ఇదే బాటలో ఈవారం సైతం మరింత నీరసించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. సాంకేతికంగా చూస్తే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వెనకడుగు వేస్తే తొలుత 24,200 పాయింట్ల వద్ద, తదుపరి 24,000 వద్ద మద్దతు లభించవచ్చని అంచనా వేశారు. ఒకవేళ బలపడితే 24,500 పాయింట్లవద్ద, 24,600 వద్ద రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు.
 
– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement