అయిదు నిమిషాల్లోనే బ్యాటరీ చార్జింగ్‌

First instantly-charging electric 3-wheeler unveiled - Sakshi

ఆటోను అభివృద్ధి చేసిన అదరిన్‌ ఇంజనీరింగ్‌

అక్టోబరు నుంచి భారత్‌లోకి...

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత ఆటో మొబైల్‌ రంగంలో ఇప్పుడు ‘ఎలక్ట్రిక్‌’ హాట్‌ టాపిక్‌గా మారింది. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో ఉన్న కంపెనీలు అధిక సామర్థ్యమున్న బ్యాటరీల తయారీపై ఫోకస్‌ చేశాయి. ఈవీ టెక్నాలజీలో ఉన్న సింగపూర్‌ సంస్థ షాడో గ్రూప్‌ అనుబంధ కంపెనీ అయిన బెంగళూరుకు చెందిన అదరిన్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీస్‌ ఓ అడుగు ముందుకేసి అల్ట్రా కెపాసిటర్‌ బ్యాటరీని అభివృద్ధి చేసింది. అయిదు నిమిషాల్లోనే చార్జింగ్‌ పూర్తి అవడం దీని ప్రత్యేకత. ఎరిక్‌ పేరుతో రూపొందించిన త్రిచక్ర వాహనానికై ఈ బ్యాటరీని తయారు చేశారు. బ్యాటరీని ఒకసారి చార్జింగ్‌ చేస్తే వాహనం 70 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిచ్‌ ఈ టెక్నాలజీని ధ్రువీకరించింది. అంతేకాదు 10 ఏళ్లపాటు మన్నుతుందని స్పష్టం చేసిందని షాడో గ్రూప్‌ కో–సీఈవో సౌరభ్‌ మార్కండేయ సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధికి వెల్లడించారు. డీజిల్‌ వాహనంతో పోలిస్తే ఖర్చు 25–30 శాతం తగ్గుతుందని చెప్పారు.

గంటకు 50 కిలోమీటర్ల వేగం..
ఎరిక్‌ బ్రాండ్‌లో ప్యాసింజర్‌ వేరియంట్‌తోపాటు కార్గో రకం కూడా రూపొందించారు. ప్యాసింజర్‌ వాహనం గంటకు 50 కిలోమీటర్లు, కార్గో మోడల్‌ 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కార్గోలో 550 కిలోల సరుకు రవాణా చేయవచ్చు. రెండు రకాల బ్యాటరీలను అందుబాటులోకి తెచ్చామని సౌరభ్‌ మార్కండేయ తెలిపారు. ‘అల్ట్రా కెపాసిటర్‌ బ్యాటరీ జీవిత కాలం 10 ఏళ్లు. ధర రూ.4 లక్షలు. లిథియం అయాన్‌ బ్యాటరీ జీవిత కాలం రెండున్నరేళ్లు. చార్జింగ్‌కు 8 గంటలు పడుతుంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 80–100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ధర రూ. లక్ష ఉంది. అల్ట్రా కెపాసిటర్‌ అభివృద్ధికి రెండేళ్లు పట్టింది. ఈ మోడల్‌ వాహనాలు ఇండోనేషియాకు ఎగుమతి చేయనున్నాం. భారత్‌లో క్యాబ్‌ అగ్రిగేటర్లు, లాజిస్టిక్స్‌ కంపెనీలతో మాట్లాడుతున్నాం. 2019 అక్టోబరు నుంచి మార్కెట్లో వాహనం అందుబాటులో ఉంటుంది’ అని చెప్పారు. పుణేలో ఉన్న ప్లాంటు కోసం షాడో గ్రూప్‌ రూ.70 కోట్లు వెచ్చిస్తోంది.
సౌరభ్‌ మార్కండేయ
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top