
పంజాబ్ నేషనల్ బ్యాంకు (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న భారీ కుంభకోణం నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. అన్ని బ్యాంకులు వెంటనే స్టేటస్ రిపోర్టును అందించాలని ఆదేశించింది. సత్యం కంప్యూటర్స్ రూ.9వేల కోట్ల స్కాం అనంతరం, పీఎన్‌బీలో చోటుచేసుకున్న ఈ కుంభకోణమే అతిపెద్దది. దాదాపు రూ.11,346 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు బ్యాంకు గుర్తించింది.
పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలు తప్పించుకోవడానికి వీలులేదని, ఇదే సమయంలో నిజాయితీ రుణగ్రహీత వేధించబడవద్దని ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని బ్యాంకులకు సీరియస్ ఆదేశాలు జారీచేసింది. వెంటనే స్టేటస్ రిపోర్టును తమకు అందించాలని తెలిపింది. పీఎన్‌బీలో చోటుచేసుకున్న ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ విచారణను ముమ్మరం చేశాయి. కొంతమంది అకౌంట్ హోల్డర్స్ ప్రయోజనార్థం పీఎన్‌బీ ముంబై బ్రాంచులో ఈ మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఈ మోసపూరిత లావాదేవీల నగదు విదేశాలకు తరలి వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో విదేశీ బ్యాంకు బ్రాంచులపై కూడా విచారణ చేపడుతున్నారు. ప్రముఖ జువెల్లరీ, బిలీనియర్ నిరీవ్ మోదీకి, ఈ స్కాంకు సంబంధం ఉన్నట్టు బ్యాంకు ఆరోపిస్తోంది. అంతేకాక మరో నాలుగు బడా జువెల్లరీ సంస్థలపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు నీరవ్‌మోదీ, మెహల్‌చౌక్సి బ్యాంకు అకౌంట్లు మోసపూరితమైనవిగా తేలింది.