ఇకపై ఐటీ కంపెనీల డివిడెండ్లలో కోత.!

Dividend payout by IT firms likely to dip further in FY21 - Sakshi

నగదు నిల్వలకే ప్రాధాన్యత

ఇతర కంపెనీలతో టీసీఎస్‌ అధిక డివిడెండ్‌ చెల్లింపు

కార్పోరేట్‌ వ్యవస్థలో మిగతా రంగాలతో పోలిస్తే ఐటీ రంగంలో డివిడెండ్‌ చెల్లింపులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐటీ కంపెనీల డివిడెండ్‌ చెల్లింపుల్లో భారీ కోత ఉండవచ్చని మార్కెట్‌ పండితులు అంచనా వేస్తున్నారు. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అదనపు వ్యయాలు పెరగడం, నికర లాభం తగ్గడంతో నగదు ప్రవాహం క్షీణించడం, భవిష్యత్తు అవసరాలకు కంపెనీలు నగదు నిల్వలను అట్టిపెట్టికోవడం లాంటి చర్యలతో మునుపటిలా డివిడెండ్‌ చెల్లింపులు ఉండకపోవచ్చని వారు చెబుతున్నారు.  

‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ చెల్లింపు పాలసీని మార్పు చేయవలసి ఉంటుంది. ప్రతికూల వృద్ధిని అధిగమించే ప్రక్రియలో భాగంగా కంపెనీలు నగదు నిల్వలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది.’’ అని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ, బోర్డు సభ్యుడు బాలకృష్ణన్‌ తెలిపారు.

అధిక నగదును కలిగిన పరిశ్రమలో ఐటీ అగ్రస్థానంలో ఉంటుంది. ఐటీ సంస్థలు మిగులు నగదును తమ షేర్‌ హోల్డర్లకు మధ్యంతర, వార్షిక డివిడెండ్ల రూపంలో చెల్లిస్తుంటాయి. రెగ్యూలర్‌గా డివిడెండ్‌ చెల్లింపులతో పాటు షేరు ధర ఆకర్షణీయ విలువల వద్ద ట్రేడ్‌ అవుతుండటంతో స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెసర్లు ధీర్ఘకాలిక దృష్టా‍్య ఈ రంగ షేర్ల కొనుగోళ్లకు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు.

గత ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ మందగించడంతో ఒక్క టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మినహా ఐటీ కంపెనీలు డివిడెండ్ చెల్లింపులో కోత పెట్టాయి. టీసీఎస్‌ ఆర్థిక సంవత్సరం 2019-20లో తన షేర్‌హోల్డర్లకు రూ.31,895 కోట్ల నిధులను డివిడెండ్‌ రూపంలో చెల్లించింది. ఈ మొత్తం విలువ కంపెనీ ఫ్రీ క్యాష్‌ ఫ్లోలో 108.9శాతంగా ఉంది. అలాగే ఎఫ్‌వై 19, ఎఫ్‌వై 18లో డివిడెండ్‌ చెల్లింపు నిష్పత్తి వరుసగా 110.2శాతం, 106శాతంగా ఉంది.

"టీసీఎస్ మినహా, ఆర్థిక సంవత్సరం 2019, 2020లో అ‍గ్రశ్రేణి ఐటీ కంపెనీలు బైబ్యాక్‌లతో సహా తమ చెల్లింపుల నిష్పత్తిని తగ్గించాయి. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా చెల్లింపు నిష్పత్తి భారీగా తగ్గేందుకు అవకాశం ఉంది. ఐటీ కంపెనీలు వ్యయాలను భరించేందుకు నగదు పరిరక్షణ చర్యలకు పూనుకోవచ్చు.’’ అని షేర్‌ఖాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ హెడ్‌ రీసెర్చ్‌ సంజీవ్‌ హోతా తెలిపారు. 

‘‘ సాధ్యమైనంత వరకు ఐటీ కంపెనీలు మూలధన కేటాయింపు పాలసీను మార్చుకోవు. అయితే వారి సంప్రదాయ విధానాలకు కోవిడ్‌-19 గండికొట్టింది. ఇదే సందర్భంలో వ్యవస్థలో నెలకొన్న సంక్షోభంతో విలీన అవకాశాలను కల్పిస్తున్నాయి. కాబట్టి సాధ్యనమైంత వరకు ఐటీ కంపెనీలు నగదు నిల్వలకే మొగ్గు చూపాయి.’’ ప్రముఖ ఐటీ అవుట్‌సోర్సింగ్‌ అడ్వైజర్‌ పరీఖ్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top