అంబానీ సంపదపై కరోనా పడగ

covid-19: Mukesh Ambani is net worth drops 28percent - Sakshi

రెండు నెలల్లో 28 శాతం ఆవిరి

48 బిలియన్‌ డాలర్లకు చేరిక

ముంబై: దేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సంపద, కరోనా వైరస్‌ కారణంగా స్టాక్‌ మార్కెట్ల పతనంతో గణనీయంగా పడిపోయింది. కేవలం రెండు నెలల వ్యవధిలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 35 శాతం పడిపోగా, ముకేశ్‌ అంబానీ సంపద విలువ కూడా 28 శాతం తగ్గి మార్చి 31 నాటికి 48 బిలియన్‌ డాలర్లకు దిగొచ్చింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ముకేశ్‌ నికర విలువ 19 బిలియన్‌ డాలర్లు తగ్గినట్టు హరూన్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ పేర్కొంది.

ఫలితంగా అంతర్జాతీయంగా కుబేరుల జాబితాలో ముకేశ్‌ అంబానీ 8 స్థానాలు దిగజారి 17వ స్థానానికి వచ్చినట్టు హరూన్‌ తాజాగా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఇదే కాలంలో (ఫిబ్రవరి–మార్చి) అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ నికర విలువ సైతం 37 శాతం (6 బిలియన్‌ డాలర్లు) తగ్గింది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ శివ్‌నాడార్‌ సంపద 26 శాతం (5 బిలియన్‌ డాలర్లు), కోటక్‌ మహీంద్రా బ్యాంకు చీఫ్‌ ఉదయ్‌ కోటక్‌ సంపద 28 శాతం (4 బిలియన్‌ డాలర్లు) తగ్గినట్టు హరూన్‌ నివేదిక తెలియజేస్తోంది.

స్టాక్‌ మార్కెట్ల పతనంతోపాటు, రూపాయి విలువ క్షీణించడం భారత పారిశ్రామిక వేత్తల సంపదపై ప్రభావం చూపించినట్టు హరూన్‌ పేర్కొంది. ఓయో రూమ్స్‌ ప్లాట్‌ఫామ్‌ అధిపతి రితేష్‌ అగర్వాల్‌ బిలియనీర్‌ స్థానాన్ని కోల్పోయినట్టు తెలిపింది. ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్‌ జెఫ్‌ బెజోస్‌ స్థానం చెక్కు చెదరలేదు. 131 బిలియన్‌ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నారు. కాకపోతే, గడిచిన రెండు నెలల్లో బెజోస్‌ సంపద కేవలం 9 శాతమే తగ్గింది. బిల్‌గేట్స్‌ 91 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. (బ్యాంక్‌లపై కరోనా పిడుగు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top