భారత్‌లోకి చైనా పెట్టుబడుల వెల్లువ

Chinese Investors Enters India Online Travel Market - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లోని ఆన్‌లైన్‌ ట్రావెల్, హోటల్‌ వ్యాపార రంగాల్లోకి చైనా నుంచి పెట్టుబడులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. భారత్‌కు చెందిన అతిపెద్ద ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ ‘మేక్‌ మై ట్రిప్‌’లో 42.5 శాతం వాటాను చైనాకు చెందిన ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ ‘సీట్రిప్‌’ ఇటీవల కొనుగోలు చేసింది. దీంతో ‘మేక్‌ మై ట్రిప్‌’లో దాదాపు సగం వాటా సీట్రిప్‌ కైవసం అయింది. 2016లోనే మేక్‌ మై ట్రిప్‌లో 18 కోట్ల డాలర్ల పెట్టుబడులను పెట్టి కొంత వాటాను కొనేసింది. 2017లో దక్షిణాఫ్రికాకు చెందిన కాస్పర్స్‌ కంపెనీకి మేక్‌ మై ట్రిప్‌ విక్రయించిన వాటాను ఇప్పుడు సీట్రిప్‌ కొనుగోలు చేసింది. 2020కి ఆన్‌లైన్‌ ట్రావెల్‌ వ్యాపారం 3.3 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో ఈ డీల్‌ కుదిరింది.

భారత్‌లోనే అతిపెద్ద బడ్జెట్‌ హోటళ్ల చైన్‌ను కలిగిన ‘ఓయో’, దాని ప్రత్యర్థి ‘ట్రీబో’లోకి ఇప్పటికే చైనా పెట్టుబడుదారులు ప్రవేశించారు. గురుగావ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘హాపీ ఈజీ గో’ లాంటి చిన్న ట్రావెల్‌ కంపెనీలోకి కూడా చైనా పెట్టుబడులు వస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతోంది. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అవడం వల్ల, సమీప భవిష్యత్‌లో చైనా తర్వాత, అంతటి బలమైన ఆర్థిక వ్యవస్థ తయారవుతుందన్న అంచనాలతో ముందస్తుగానే చైనా పెట్టుబడులు వచ్చి పడుతున్నాయని ‘సెక్యూర్లీషేర్‌’ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ‘స్ట్రాటజీ, పాలసీ అండ్‌ కార్పొరేట్‌ డెవలప్‌మెంట్‌’ విభాగం అధిపతి విద్యా శంకర్‌ సత్యమూర్తి తెలిపారు.

‘మేక్‌ మై ట్రిప్‌’ ట్రావెల్‌ సంస్థ 2000 సంవత్సరంలో ఏర్పడింది. అది అప్పుడు కేవలం అమెరికా, భారత్‌ మధ్య పర్యటలపైనే దృష్టిని కేంద్రీకరించింది. మెల్లమెల్లగా మధ్య తరగతికి చెందిన భారతీయులు ఇతర విదేశీ పర్యటనలపై ఆసక్తి చూపిస్తుండడంతో వాటిపైనా దృష్టిని కేంద్రీకరించింది. దేశంలో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఇదొకటి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top