కో–ఆపరేటివ్‌లకూ యస్‌ బ్యాంక్‌ కష్టాలు 

Cancellation Of 54 Urban Cooperative Banks CTS By RBI - Sakshi

54 పట్టణ సహకార బ్యాంక్‌ల సీటీఎస్‌లు రద్దు

రూ.200 కోట్ల మేర నిలిచిపోయిన చెక్‌ లావాదేవీలు

తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కో–ఆప్‌ బ్యాంక్‌లపై ప్రభావం 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: యస్‌ బ్యాంక్‌ ఆర్థిక సంక్షోభం ప్రభావం దేశంలోని పట్టణ సహకార బ్యాంక్‌ల మీద పడింది. యస్‌ బ్యాంక్‌ మారటోరియం నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకున్న అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్స్‌ (యూసీ బీ) చెక్‌ ట్రన్‌కేషన్‌ సిస్టమ్‌ (సీటీఎస్‌)లను  ఆర్‌బీఐ రద్దు చేసింది. దేశవ్యాప్తంగా సీటీఎస్‌ల లావాదేవీల కోసం 54 యూసీబీలు యస్‌ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొమ్మిది బ్యాంక్‌లున్నాయి. చెక్‌ డిపాజిట్స్, విత్‌డ్రా సేవలు నిలిచిపోవటంతో కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ సీటీఎస్‌ క్లియరెన్స్‌లు జరగవని ఆర్‌బీఐ తెలిపింది.

లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న అర్బన్, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ల ఏర్పాటుకు ఆర్‌బీఐ అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. స్థానిక కమ్యూనిటీలు, వర్కింగ్‌ గ్రూప్‌లకు, చిన్న తరహా వ్యాపారస్తులకు, వ్యవసాయ రుణాలను అందించడమే కో–ఆప్‌ బ్యాంక్‌ల ప్రధాన లక్ష్యం. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి దేశంలో 1,544 అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌లు, 11,115 బ్రాంచీలున్నాయి. డిపాజిట్లు రూ.4,84,315 కోట్లుగా, అడ్వాన్స్‌లు రూ.3,03,017 కోట్లుగా ఉన్నాయి.

54 యూసీబీల సీటీఎస్‌ల రద్దు.. 
దేశవ్యాప్తంగా 54 కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌లకు యస్‌ బ్యాంక్‌ స్పాన్సర్‌ బ్యాంక్‌గా ఉంది. వీటి సీటీఎస్‌ క్లియరెన్స్‌లను రద్దు చేస్తూ గత శుక్రవారం ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఒక్క చెక్‌ క్లియరెన్స్‌ కోసం స్పాన్సర్‌ బ్యాంక్‌కు ఒప్పంద యూసీబీ బ్యాంక్‌లు 50 పైసల నుంచి రూపాయి వరకు చార్జీల రూపంలో చెల్లిస్తుంటాయి.  వారం రోజులు గా  54 పట్టణ సహకార బ్యాంక్‌లలో సీటీఎస్‌ క్లియరెన్స్‌ జరగడం లేదని.. వీటి విలువ రూ.200 కోట్లుంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఇతర బ్యాంక్‌లతో ఒప్పందాలు.. 
కస్టమర్ల ఆందోళన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది యస్‌ బ్యాంక్‌ ఒప్పందం కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌లు సీటీఎస్‌ క్లియరెన్స్‌ కోసం హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీబీఐ, యాక్సిస్‌ వంటి ఇతర బ్యాంక్‌లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. గత ఐదు రోజులుగా పోచంపల్లి కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌లో సీటీఎస్‌ క్లియరెన్స్‌లు జరగడం లేదని ఆ బ్యాంక్‌ సీఈఓ సీతా శ్రీనివాస్‌ తెలిపారు. కస్టమర్లకు ఆందోళన వద్దని, కొద్ది రోజుల పాటు చెక్‌ విత్‌డ్రా, డిపాజిట్‌ వంటి లావాదేవీలను వాయిదా వేసుకోవాలని కస్టమర్లకు సూచిస్తున్నామని చెప్పారు. అత్యవసరమైతే నెఫ్ట్, ఆర్టీజీఎస్‌ సేవలను వినియోగించుకోవాలని కస్టమర్లకు మెసేజ్, వాట్సాప్, ఈ–మెయిల్స్‌ ద్వారా సందేశాలను పంపిస్తున్నామన్నారు. పోచంపల్లి కో–ఆపరేటివ్‌ అర్బ న్‌ బ్యాంక్‌కు  పోచంపల్లి, చౌటుప్పల్, దేవరకొండ, నల్లగొండ, హాలియా, చందూర్, సూర్యా పేట 7 బ్రాంచీల్లో 50 వేల మంది కస్టమర్లు, రూ.60 కోట్ల అడ్వాన్స్‌లు, రూ.100 కోట్ల డిపాజిట్లున్నాయి. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌లో రోజుకు రూ.10 లక్షల వరకు చెక్‌ లావాదేవీలు జరుగుతుంటాయని బ్యాంక్‌ ఎండీ చెన్న వెంకటేశం తెలిపారు. సీటీఎస్‌ క్లియరెన్స్‌కు హెచ్‌డీఎఫ్‌సీతో చర్చలు జరుపుతున్నామన్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులివే... 
సీటీఎస్‌ క్లియరెన్స్‌ల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి యస్‌ బ్యాంక్‌తో తొమ్మిది అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌లు ఒప్పందం చేసుకున్నాయి. తెలంగాణ నుంచి పోచంపల్లి, సెవెన్‌ హిల్స్‌ కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్స్, వరంగల్‌ అర్బన్, భద్రాద్రి, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, ది సంగమిత్ర కో–ఆప్‌ అర్బన్‌ బ్యాంక్‌లున్నాయి. ది తిరుపతి కో–ఆపరేటివ్‌ బ్యాం క్, ది గుంటూరు కో–ఆపరేటివ్‌ బ్యాంక్, ది హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌ స్టాఫ్‌ కో–ఆప్‌ బ్యాంక్‌లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి. ‘‘ఏపీలో 47 యూసీబీలు, 230 బ్రాంచీలున్నాయి. వీటి డిపాజిట్లు రూ.9,040 కోట్లు, అడ్వాన్స్‌లు రూ.6,230 కోట్లు. తెలంగాణలో 51 యూసీబీలు, 211 బ్రాంచీలున్నాయి. డిపాజిట్లు రూ.7,517 కోట్లు, అడ్వాన్స్‌లు రూ.5,592 కోట్లు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top