బైక్‌ చాల్లే... క్యాబ్‌ ఎందుకు?!

Bike Sharing Market to surpass USD 10 Billion by 2025 - Sakshi

10 బిలియన్‌ డాలర్లకు చేరిన పరిశ్రమ

క్యాబ్‌లతో పోలిస్తే 40 శాతం ధర తక్కువ

సిటీలో వేగంగా వెళ్లాలంటే ఇదే బెటర్‌

బైక్‌ డ్రైవర్లుగా మహిళలూ నమోదు

మెట్రో రైల్‌తో హైదరాబాద్‌లో 40 శాతం వృద్ధి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బోడ బోడ, హబల్‌ హబల్, ఓజెక్, ఒకాడా... ఇక్కడైతే రాపిడో!!. పేర్లు వేరైనా.. ప్రాంతాలు వేరైనా వ్యాపార మంత్రం ఒక్కటే. అదే బైక్‌ షేరింగ్‌! ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం, కాంబోడియా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందిన బైక్‌ షేరింగ్‌ ఇక్కడా దూసుకుపోతోంది. ఇపుడు బైక్‌ షేరింగ్‌ పరిశ్రమ సరికొత్త ఉపాధి, ఆదాయ మార్గాలను సృష్టిస్తోంది. ప్రస్తుతం దేశంలో బైక్‌ షేరింగ్‌ మార్కెట్‌ 10 బిలియన్‌ డాలర్లకు చేరిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

దేశంలో తొలిసారిగా ద్విచక్ర వాహనాలకు పబ్లిక్‌ సర్వీస్‌ ట్యాక్సీగా అనుమతినిచ్చింది గోవా రాష్ట్రమే. ఆ తర్వాత హరియాణా, మిజోరాం, వెస్ట్‌ బెంగాల్‌ ఈ కోవలోకి వచ్చాయి. తెలంగాణ, రాజస్తాన్, యూపీల్లోనూ కమర్షియల్‌ బైక్‌ ట్యాక్సీలకు అనుమతులున్నాయి. ప్రస్తుతం ఉబర్‌ మోటో, రాపిడో, ఓలా బైక్‌ ట్యాక్సీ, డ్రైవజీ, మోబిసీ, బైక్సీ, బౌన్స్, బాక్సీ, రెన్‌ట్రిప్, వోగో, టాజో, రోడ్‌పండా, ఆన్‌బైక్స్, పీఎస్‌బ్రదర్స్, రాయల్‌ బ్రదర్స్, వీల్‌స్ట్రీట్‌ వంటివి ఈ రంగంలో ఉన్నాయి.

ఎలా పనిచేస్తాయంటే...?
బైక్‌ యజమాని తన పేరు, చిరునామా, డ్రైవింగ్‌ లైసెన్సు, బీమా వంటి వివరాలను కంపెనీకి సమర్పించాలి. వాటిని సమీక్షించి.. బైక్‌ను తన షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్‌ చేస్తుంది. మనకు కావాల్సినపుడు బుకింగ్‌ను తీసుకోవచ్చు. బైక్‌ షేరింగ్‌లో డ్రైవర్‌ను కెప్టెన్‌గా పిలుస్తున్నారు. కస్టమర్‌ బైక్‌ను బుక్‌ చేయగానే.. డ్రైవర్‌ ఎవరు? అతని ప్రొఫైల్‌? ఎంత సమయంలో వస్తుంది? చార్జీ?  వంటి వివరాలన్నీ వస్తాయి. కెప్టెన్‌ తలకు హెల్మెట్‌ పెట్టుకొని.. కస్టమర్‌కు కూడా ఒక హెల్మెట్‌ను తెస్తాడు. కస్టమర్‌ను గమ్య స్థానంలో డ్రాప్‌ చేయగానే అప్పటికప్పుడే కెప్టెన్‌ బ్యాంక్‌ ఖాతాలో నగదు జమవుతుంది. రియల్‌ టైమ్‌ రైడ్‌ బుకింగ్, ఆన్‌లైన్‌ పేమెంట్స్, బైక్‌ ట్రాకింగ్, ఎస్‌ఓఎస్‌ అలర్ట్‌ వంటివి బైక్‌ షేరింగ్‌లో ఉంటాయి. మహిళల కోసం ఎస్‌ఓఎస్‌ బటన్‌ ఉంటుంది. ఈ ఎస్‌ఓఎస్‌ బటన్‌ కంపెనీ కంట్రోల్‌తో అనుసంధానమై ట్రాకింగ్‌ చేస్తుంటుంది.

ఎందుకింత డిమాండ్‌?
ఓలా, ఉబర్‌ క్యాబ్‌ సంస్థలు ప్రోత్సాహకాలను రద్దు చేయడంతో చాలా మంది డ్రైవర్లు అన్‌లిస్ట్‌ అవుతున్నారు. దీంతో వీకెండ్స్‌లో, రద్దీ సమయంలో క్యాబ్స్‌ దొరకటం లేదు. ఇది బైక్‌ షేరింగ్‌ కంపెనీలకు కలిసొస్తుందని ర్యాపిడో కో–ఫౌండర్‌ అరవింద్‌ సంకా ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’తో చెప్పారు. నగరాల్లో క్యాబ్‌తో పోల్చితే బైక్‌పై త్వరగా గమ్యానికి చేరుకోవటం, ధర 40–60% తక్కువగా ఉండటంతో డిమాండ్‌ పెరిగిందని పేర్కొన్నారు.  

ఎలక్ట్రిక్‌ బైక్‌లతో ఎంట్రీ..
ఇరుకైన రహదారులు, ట్రాఫిక్‌ జామ్స్, రద్దీ రోడ్లు, ప్రజా రవాణా పూర్తి స్థాయిలో లేకపోవటం వంటి దీర్ఘకాలిక సమస్యలకు బైక్‌ షేరింగ్‌ కంపెనీలు పరిష్కారం చూపిస్తున్నాయి. యువత, ఉద్యోగులు, ఐటీ నిపుణులు బైక్‌ షేరింగ్‌ను వినియోగిస్తున్నారు. యూనివర్సిటీలతో, పెద్ద కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందం చేసుకొని కూడా షేరింగ్‌ సేవలను అందిస్తున్నాయి. పెట్రోల్‌ ధరలు పెరగటం కూడా బైక్‌ షేరింగ్‌ పరిశ్రమ వృద్ధికి కారణమని చెప్పొచ్చు. ర్యాపిడో, మొబిసీ, వోగో, జైప్‌ వంటి స్టార్టప్స్‌ ఎలక్ట్రిక్‌ బైక్స్‌ను వినియోగిస్తున్నాయి.

సవాళ్లూ ఉన్నాయ్‌..
ప్రస్తుతం బైక్‌ షేరింగ్‌ కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. దీంతో చాలా కంపెనీలు సేవలను నిలిపేస్తుండగా కొన్ని వ్యాపార విధానాల్ని మార్చుకుంటున్నాయి. డాట్, టువీల్జ్, రిడ్జీ, హెడ్‌లైట్, హెబోబ్, జిగో వంటివి బెంగళూరులో సేవలను నిలిపేశాయి. ఎంట్యాక్సీ, బైక్సీ, యాయా వంటివి పబ్లిక్‌ షేరింగ్‌ నుంచి డెలివరీ దిశగా వ్యాపారాన్ని మార్చుకున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బైక్‌ షేరింగ్‌కు ప్రత్యేక చట్టాలు లేవు. కమర్షియల్‌ బైక్‌ ట్యాక్సీకి లైసెన్స్‌ లేకపోవటం, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవటంతో చాలా స్టార్టప్స్‌ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాలు బైక్‌ షేరింగ్‌ను నిషేధం విధించాయి. రహదారుల పరిస్థితులు, మహిళల భద్రత, ప్రమాదాల రేట్లు ఎక్కువగా ఉండటం వంటివి నిషేధానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో 40 శాతం వృద్ధి..
హైదరాబాద్‌లో ఓలా, ఉబర్, రాపిడో, వోగో, బౌన్స్‌ వంటి కంపెనీలు సేవలందిస్తున్నాయి. గత ఏడాది కాలంగా నగరంలో బైక్‌ షేరింగ్‌కు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. ఏడాదిలో 30–40 శాతం పెరిగినట్లు ర్యాపిడో ప్రతినిధి చెప్పారు. బిజీ వేళల్లో క్యాబ్స్‌ దొరకకపోవటం, ధర ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే, మెట్రో రెండో కారణమని చెప్పారు. మెట్రో నుంచి వచ్చి 3–4 కి.మీ. వెళ్లేందుకు బైక్‌ వాడుతున్నారని చెప్పారాయన. లక్ష మంది డ్రైవర్లతో రోజుకు లక్ష రైడ్స్‌ జరుపుతున్న రాపిడోకు... హైదరాబాద్‌లో 15వేల మంది డ్రైవర్లు, 20వేల రైడ్స్‌ ఉన్నట్లు సమాచారం.

బైక్‌ షేరింగ్‌లో మహిళలూ యాక్టివే..
గడిచిన ఏడాదిగా బైక్‌ షేరింగ్‌ డ్రైవర్స్‌గా మహిళలు కూడా నమోదవుతున్నారు.   ర్యాపిడోలో 25% మహిళా కెప్టెన్లు ఉన్నారు. బైక్‌ షేరింగ్‌లో డ్రైవర్‌ అనే చిన్నచూపు ఉండదు. మన బైక్‌ను ఇతరులకు షేర్‌ చేస్తూ హెల్ప్‌ అవుతున్నామనే భావన ఉంటుందని ర్యాపిడో తొలి మహిళ రైడర్‌ గాయత్రి ఆకుండి తెలిపారు. మహిళా కెప్టెన్‌కు మహిళా కస్టమర్‌నే ఇస్తారు. రైడర్‌ నంబరు, ఫొటో ఏమీ కనిపించదు. ‘‘నేను ఫుల్‌ టైం డ్రైవర్‌ని కాదు. ఉదయం 7–10 గంటల వరకు రైడ్స్‌ తీసుకుంటా. తర్వాత యాప్‌ ఆఫ్‌ చేసి వర్క్‌లోకి వెళ్లిపోతా. నెలకు 150–200 రైడ్స్‌ తీసుకుంటా. నెలకు రూ.2,400–3,000 అదనపు ఆదా యం వస్తుంది. హ్యామ్‌స్టెక్‌లో ఫ్యాషన్‌ టెక్నాలజీలో పీజీ డిప్లొమా చేశా. 2 సినిమాలకు డిజైనర్‌గా పనిచేస్తున్నాను’’ అని గాయత్రి చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top