ఏటీఎఫ్, వంట గ్యాస్‌ ధరలకు రెక్కలు

ATF And Cooking Gas Prices Hikes - Sakshi

ఏటీఎఫ్‌ ధరలు 2.6 శాతం పెంపు

సబ్సిడీలేని గ్యాస్‌ సిలిండర్‌పై రూ.19 పెంపు

న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరలతోపాటు, వంటగ్యాస్‌కు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు రేట్లను సవరించాయి. ఫలితంగా ఢిల్లీలో ఏటీఎఫ్‌ కిలో లీటర్‌ ధర రూ.1,637 పెరిగి రూ.64,324 అయింది. నెల వ్యవధిలో ఏటీఎఫ్‌ ధరలను పెంచడం రెండోసారి. డిసెంబర్‌ 1న కూడా కిలోలీటర్‌పై రూ.14 వరకు పెరిగింది. తాజా సవరణతో ఏటీఎఫ్‌ ధరలు 2019 జూన్‌ తర్వాత గరిష్ట స్థాయికి చేరాయి. తీవ్ర పోటీ వాతావరణం, టికెట్‌ చార్జీల పెంపు విషయంలో పరిమితులతో నష్టాలను చవిచూస్తున్న ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు ఇంధన ధరల పెరుగుదల ప్రతికూలం కానుంది.

రూ.714కు ఎల్‌పీజీ సిలిండర్‌  
సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.695 నుంచి రూ.714కు ఆయిల్‌ సంస్థలు పెంచేశాయి. గత సెప్టెంబర్‌ నుంచి వరుసగా నాన్‌ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర పెరుగుతూనే ఉండడం గమనార్హం. గడిచిన ఐదు నెలల్లో సబ్సిడీ లేని ఒక్కో సిలిండర్‌ ధర నికరంగా రూ.139.50 పెరిగింది. ఒక ఏడాదిలో ఒక వినియోగదారుడు 12 సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లకు అర్హులు. ఆ తర్వాత కొనుగోలు చేసే సిలిండర్లకు మార్కెట్‌ ధరను చెల్లించాల్సి ఉంటుంది. గడిచిన నెలలో అంతర్జాతీయ రేట్ల సగటు ఆధారంగా మరుసటి నెల మొదటి తారీఖున ఏటీఎఫ్, ఎల్‌పీజీ ధరలను పెంచడం జరుగుతోంది. ఇక ప్రజా పంపిణీ ద్వారా సరఫరా చేసే లీటర్‌ కిరోసిన్‌ ధర 26 పైసలు పెరిగి ముంబైలో రూ.35.58కు చేరింది. కిరోసిన్‌పై సబ్సిడీ పూర్తిగా తొలగిపోయే వరకు ప్రతీ నెలా 26 పైసల పెంపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top