రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకులు వారి వినియోగదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను అందించడానికి ఆర్‌బీఐ అంగీకరించింది.
ముంబై: రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకులు వారి వినియోగదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను అందించడానికి ఆర్‌బీఐ అంగీకరించింది. ఇప్పటి వరకు పట్టణ సహకార బ్యాంకులకు మాత్రమే కొన్ని షరతులతో వాటి వినియోగదారులకు ఇంటర్నెట్ బ్యాం కింగ్‌ను అందించే వెసులుబాటు ఉంది. పట్టణ సహకార బ్యాంకులకు రూపొందించిన నిబంధనలను సవరించి ఇకపై అన్ని సహకార బ్యాంకులను ఒకే రకమైన నిబంధనలను జారీ చేశామని ఆర్‌బీఐ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం.. అన్ని సహకార బ్యాంకులు కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్‌ను అమలు చేయాలి. వారి కస్టమర్లకు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను అందించడానికి వీలుగా బ్యాంకులు ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 6కు మారాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను అందించే క్రమంలో వన్ టైమ్ పాస్‌వర్డ్ వంటి పద్ధతులను పాటించాలి.
అన్ని సహకార బ్యాంకులు వారి వినియోగదారులకు ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి సేవలు మినహా బ్యాలెన్స్ విచారణ, అకౌంట్ స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్, చెక్‌బుక్ సప్లై అభ్యర్థన వంటి నాన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సేవలను అందించొచ్చు. దీనికి ఆర్‌బీఐ అనుమతి అవసరం లేదు. సహకార బ్యాంకులు ఒకవేళ ట్రాన్సాక్షన్‌తో కూడిన సేవలను పొందాలని భావిస్తే.. దానికి ఆర్ బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆర్‌బీఐ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 10 శాతం కన్నా తక్కువగా ఉండకూడదు, నెట్‌వర్త్ రూ.50 కోట్లకు పైగా ఉండాలి వంటి పలు షరతులను విధించింది.