
కేంద్ర సహకార శాఖ కార్యదర్శి భుటానీ
కోఆపరేటివ్ బ్యాంకులు ఇకపై ఆధార్ ఆధారిత చెల్లింపుల సేవలను అందించొచ్చని కేంద్ర సహకార శాఖ కార్యదర్శి ఆశిష్ కుమార్ భుటానీ తెలిపారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సవరించిన కార్యాచరణ కింద ఇది సాధ్యపడుతుందన్నారు. నూతన కార్యాచరణపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
తాజా చర్యతో సహకార బ్యాంకులు మరింత సమర్థవంతంగా, స్వయం సమృద్ధిగల ఆర్థిక సంస్థలుగా మారగలవని అభిప్రాయపడ్డారు. దీంతో సమ్మిళిత వృద్ధిపై ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, చిన్న పట్టణాలకు ఆర్థిక సేవలు మరింత చేరువ అవుతాయని చెప్పారు. ఆధార్ ధ్రువీకృత ఎకోసిస్టమ్‌కు కోపరేటివ్ బ్యాంక్‌లు ఇప్పటి వరకు దూరంగా ఉండగా, కొత్త కార్యాచరణ దీనికి పరిష్కారం చూపించినట్టు తెలిపారు.
సహకార శాఖ, నాబార్డ్, ఎన్‌పీసీఐ, కోపరేటివ్ బ్యాంకులతో సంప్రదింపుల అనంతరం యూఐడీఏఐ సులభతర వ్యవస్థను అభివృద్ధి చేయడం గమనార్హం. దీంతో యూఐడీఏఐ కింద 34 రాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్‌లు (ఎస్‌టీసీబీలు) ఆధార్ ధ్రువీకరణ కోసం నమోదు కావొచ్చు. దీంతో ఆయా రాష్ట్ర కోపరేటివ్ బ్యాంకుల పరిధిలోని 351 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు సైతం ఆధార్ కేవైసీ ధ్రువీకరణలను చేపట్టడానికి వీలు పడుతుంది.
ఇదీ చదవండి: మారుతీ కార్ల ధరలు తగ్గాయ్!