పేదల కోసం పోరుబాట | YSRCP Will Fight on AP issues | Sakshi
Sakshi News home page

పేదల కోసం పోరుబాట

Dec 19 2017 7:26 AM | Updated on May 29 2018 2:42 PM

YSRCP Will Fight on AP issues - Sakshi

సాక్షి, కడప : ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పోరుబాట పడుతున్నారు. చిన్నదైనా, పెద్దదైనా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ వస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నెలకొన్న అనేక సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యమిస్తున్నా ప్రభుత్వంలో చలనం   లేదు. జెడ్పీ సమావేశ మందిరం సాక్షిగా అనేకమార్లు సమస్యలపై అధికారులను నిలదీశారు....ప్రజా వేదికలపై సమస్యలు పరిష్కరించాలని శంఖారావం పూరించారు. చంద్రబాబు సర్కార్‌ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వివిధ సంఘాలతో కలిసి అనేక పర్యాయాలు పోరుబాట పట్టారు.ప్రజలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఇంకోమారు ఉద్యమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే  రాచమల్లు ప్రసాద్‌రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. అనుక్షణం ప్రజల కోసం పరితపిస్తూనే ఉన్నారు.ఒకవైపు పోలీసు నిర్బంధాలను ఎదుర్కొంటూ....మరోవైపు అధికార పార్టీ ఆగడాలను అడ్డుకుంటూ   ప్రజల వైపు నిలుస్తున్నారు.  

ప్రొద్దుటూరు కేంద్రంగా పోరుబాట
 ప్రొద్దుటూరు కేంద్రంగా రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పోరుబాట పడుతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కార్యకర్తలు, నాయకులను కలుపుకుని ముందుకు పోతూనే  ప్రజా ఉద్యమం సాగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో పట్టణంలో తీవ్రంగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలతో కలిసి జల దీక్ష చేపట్టారు.  ఆగస్టులో జనవాసాల మధ్య మద్యం షాపులు ఎత్తి వేయని నేప«ధ్యంలో ప్రజా సంఘాలతో కలిసి దీక్షకు కూర్చొన్నారు. ఇటీవల చేనేత కార్మికులకు సంబంధించిన పింఛన్లు మంజూరు చేసినా టీడీపీ ప్రొద్దుటూరు నాయకుడు అడ్డుకుంటున్న వైనాన్ని వివరిస్తూ వెంటనే అర్హులకు పింఛన్లు అందించాలని మూడు రోజులపాటు మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేశారు.ప్రభుత్వం దిగివచ్చేలా చేశారు. ఇలా ప్రతినిత్యం ప్రజల బాటలోనే నడుస్తున్నారు.

నేటి నుంచి 36 గంటల దీక్షకు శ్రీకారం
 ప్రొద్దుటూరు మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో మంగళవారం నుంచి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి 36 గంటల నిరవధిక నిరాహార దీక్షకు సిద్దమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న మొదటి రకం గృహాలకు సంబం«ధించి రూ. 3.25 లక్షలు రుణం కాగా, సబ్సిడీ కింద కేంద్రం రూ. 1.50 లక్షలు.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలు కలుపుకుని మొత్తం రూ. 6.25 లక్షలు మంజూరు చేస్తున్నారు. అయి తే ఆ సొమ్మును 30 ఏళ్లలోపు చెల్లించేలా ఒప్పందం రాసుకుంటున్నారు. అయితే 30 ఏళ్లకు దాదాపు లెక్కలు వేస్తే రూ. 18 లక్షలు అవుతోంది. అంటే ప్రతినెల కంతు కింద రూ. 3500– 4000 వరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి కాకుండా దివంగత సీఎం వైఎస్సార్‌ తరహాలోనే ప్రజలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి అందించాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే దీక్షకు దిగుతున్నారు. ప్రొద్దుటూరులో మంగళవారం ఉదయం 10 గంటలకు దీక్షకు కూర్చొని బుధవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో విరమించనున్నారు. ఎమ్మెల్యే దీక్ష చేయనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement