కలహం వద్దు.. కలిసే ఉందాం | YS Jaganmohan Reddy's call to the Garagaparru People's | Sakshi
Sakshi News home page

కలహం వద్దు.. కలిసే ఉందాం

Jul 1 2017 12:52 AM | Updated on Jul 25 2018 4:42 PM

కలహం వద్దు.. కలిసే ఉందాం - Sakshi

కలహం వద్దు.. కలిసే ఉందాం

‘‘అంతా కలిసి ఉందాం. దశాబ్దాలుగా కలిసి ఉన్న గ్రామస్థులు కేవలం ఒకరిద్ద రు చేసిన తప్పులకు కులపరంగా విడిపోవడం బాధాకరం.

గరగపర్రు గ్రామ ప్రజలకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు 
- కుల రాజకీయాలను పక్కనపెడదాం 
ఊరంటే అందరూ ఉండాలి.. అంతా కలసి ఉండాలి 
సమస్య పరిష్కారానికి ఆళ్ల నాని నేతృత్వంలో కమిటీ  
గ్రామంలో ఇరువర్గాల ప్రజలతో ప్రతిపక్ష నేత భేటీ 
దళితులతో కలసి వైఎస్‌ జగన్‌ సహపంక్తి భోజనం 
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘అంతా కలిసి ఉందాం. దశాబ్దా లుగా కలిసి ఉన్న గ్రామస్థులు కేవలం ఒకరిద్ద రు చేసిన తప్పులకు కులపరంగా విడిపోవడం బాధాకరం. కుల రాజకీయాలను పక్కన పెడదాం. అందరూ ఇక్కడే పుట్టారు... ఇక్కడే పెరిగారు... ఇక్కడే మరణిస్తారు. ఒకరి మొహం మరొకరు చూసుకోవాల్సిన గ్రామం లో విభేదాలు వద్దు. ఇరువర్గాలు సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలి. ఒకవేళ ఎవరివైపైనా తప్పు జరిగితే, దాన్ని ఒప్పుకుంటే వారి ఔన్నత్యం పెరుగుతుందే తప్ప తగ్గదు. ఒక అడుగు మనం ముందుకు వేస్తే, వారు కూడా మరో అడుగు ముందుకు వేస్తారు. అందరూ కలిసిమెలిసి ఉండాలి’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గరగపర్రు ప్రజలను కోరారు.

అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు వివాదంతో దళితులను సాంఘిక బహిష్కరణకు గురి చేసిన గరగపర్రు గ్రామాన్ని శుక్ర వారం ఆయన సందర్శించారు. ఇరు వర్గాల ప్రజలను కలిశారు. సమస్య పరిష్కారం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు వర్గాల ప్రజలతో మాట్లాడి, సమస్యను పరిష్కరించేందుకు వైఎస్సార్‌సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని నేతృత్వంలో పార్టీ నేతలు మేరుగ నాగార్జున, కొయ్యే మోషెన్‌రాజు, పాతపాటి సర్రాజు, కారుమూరి నాగే శ్వరరావు, ముదునూరు ప్రసాదరాజు, గ్రంథి శ్రీనివాస్‌లతో ఒక కమిటీని వైఎస్‌ జగన్‌ నియమించారు. 
 
తప్పులు జరిగితే సరిదిద్దుకుందాం...
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండ లం గరగపర్రులో అక్రమ అరెస్టులను నిరసిస్తూ రిలే దీక్షలు చేస్తున్న దళితేతరుల శిబిరాన్ని జగన్‌ సందర్శించారు. తమకు న్యాయం కావాలంటూ దీక్షా శిబిరంలో నినా దాలు చేస్తున్న వారితో మాట్లాడారు. ‘‘ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చా. నేను అవతలి వారితో కూడా మాట్లాడుతా.. సమాజంలో అందరూ కలిసి ఉండాలన్నదే నా భావన. దాని కోసమే ఈ ప్రయత్నం. ప్రతి కులంలోనూ మంచి చెడూ ఉంటాయి. రెడ్లు, కమ్మ, కాపు, దళిత.. ఇలా అన్ని కులాల్లో మంచివారు ఉంటారు.. చెడ్డవారూ ఉంటారు. ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులం మొత్తానికి అపాదించడం సరికాదు. ఇది అన్ని వర్గాలకూ వర్తిస్తుంది. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే దాన్ని సరిదిద్దుకుందాం.

దాని వల్ల మన ఔన్నత్యం పెరుగుతుందే తప్ప తగ్గదు’’ అని జగన్‌ సూచించారు. స్థానిక సర్పంచ్‌ ఎలిజబెత్‌తోపాటు గ్రామానికి చెందిన పలువురు తమ అభిప్రాయాలను ఆయనతో పంచుకున్నారు. ‘‘గతంలో చెరువుకట్టపై అన్ని విగ్రహాలు, గుళ్లు ఉండేవి. వినాయకుడి విగ్రహం పెట్టే సమయంలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో అన్నింటినీ తొలగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏప్రిల్‌ 23న అర్ధరాత్రి సమయంలో అక్కడ దళితులు అంబేడ్కర్‌ విగ్రహాన్ని పెడితే అ«ధికా రులు తొలగించారు. దాంతో మాకు సంబం ధం లేదు. అంబేడ్కర్‌ అంటే మాకు కూడా ఎంతో గౌరవం ఉంది’’ అని దళితేతరులు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ... కోర్టు తీర్పు ఉంటే కోర్టే చూసు కుంటుంది. అక్కడ అంబేడ్కర్‌ విగ్రహం పెట్టడానికి మీకు అభ్యంతరం లేదు కదా! అని అడిగారు.

తమకు అభ్యంతరం లేదని గ్రామ స్థులు బదులిచ్చారు. ‘‘మనలో ఒకరో ఇద్దరో తప్పు చేసి ఉండొచ్చు... అలా జరిగి ఉండ కూడదని మనం కూడా ఒప్పుకోవాలి.. తప్పు లను సరిదిద్దుకోవాలి. ఎప్పటిలాగే మన మంతా కలిసిమెలిసి ఉందాం’’ అని కోరారు. దీనికి దళితేతరులు అంగీకరించారు. తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని మహిళలు విజ్ఞప్తి చేశారు. ఇరువైపులా తప్పులు జరిగాయని, తమ వారినే అరెస్టు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు జరిగిందన్న ఉద్దేశంతోనే తహసీల్దార్, స్థానిక ఎస్‌ఐలపై వేటు వేయనున్నట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ప్రకటించిందని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. ఒకరిద్దరు చేసిన తప్పును అందరికీ ఆపాదించవద్దని, అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉందామని సూచించారు. 
 
గతాన్ని మరచిపోయి ముందుకు వెళ్దాం..
ఊరంటే అందరూ ఉండాలి.. అంతా కలిసి ఉండాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన రెడ్డి ఉద్ఘాటించారు. గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను ఆయన పరామర్శించారు. సంఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమను అన్యాయంగా సాంఘిక బహిష్కరణ చేశారని, పనుల నుంచి తొలగించారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం పెట్టడమే మేము చేసిన పొరపాటా? అని ప్రశ్నించారు. గ్రామంలో 50 ఏళ్లుగా ఇతర కులాలతో బంధువుల్లా మెలిగామని, రెండు నెలలుగా వివాదం జరుగుతుంటే ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, స్థానిక నేతలు, అధికారులు ఎవరూ తమను పట్టించుకో లేదని వాపోయారు. స్థానిక ఎంపీటీసీ భర్త వెంకటరత్నం రెండు నెలలుగా గ్రామంలో దళి తులు పడుతున్న బాధలను వివరించారు. తాము తెలుగుదేశం పార్టీ తరపున గెలిచినా వారిపైనే పోరాటం చేయాల్సిన పరిస్థితిని గ్రామంలోని కొందరు నేతలు తీసుకొచ్చారని చెప్పారు. తాను 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నానని, ఇప్పుడు తనను పని నుంచి తీసేశారని ఒక వృద్ధురాలు తెలిపారు.

వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ... తాను ఇక్కడికి వచ్చే ముందు దళితేతరులతో మాట్లాడానని, సమా చార లోపం వల్ల వివాదం పెరిగిందని చెబు తున్నారని, వారు కూడా కలిసి ఉండేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని వివరించారు. ‘‘రాజీ చేసుకోవడానికి, ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి అంగీకారంగానే ఉన్నాం. ఎందుకంటే మనం ఒకే గ్రామంలో ఉన్నాం. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే బతుకుతున్నాం.. ఇక్కడే మరణిస్తాం. అయితే, చట్ట ప్రకారం జరగాల్సిన న్యాయం జరగాలి. అందరూ చెడ్డవారు కాదు. గ్రామంలో వివాదంపై ప్రభుత్వమే విచారణ చేసింది. తహసీల్దార్, ఎస్‌ఐని సస్పెండ్‌ చేశారు. ఇవన్నీ చేశారంటే ఆధా రాలు ఉండబట్టే చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. చట్టాన్ని తన పని తాను చేసుకుపో నివ్వండి. అన్ని కులాలు మంచివే. కొంత మంది చెడ్డవారు ఉన్నారు.

వారిపై మాత్రమే కోపం గానీ వారి కులాలపై కాదు. అందరం కలసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నా మంటూ ఒక సందేశాన్ని ఈ వేదిక నుంచి పంపిద్దాం. తప్పు చేసిన వారికి మాత్రమే శిక్ష పడేలా చేయండి. మిగలిన వారిపై ఎలాంటి కోపం లేదు. గ్రామంలో మళ్లీ మంచి జరగాలి కాబట్టి అందరూ గతాన్ని మరిచిపోయి కలసి కట్టుగా అడుగు ముందుకు వేయాలి. సమస్య పరిష్కారానికి ఆళ్ల నాని ఆధ్వర్యంలో ఒక కమి టీని వేస్తున్నాం’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ప్రక టించారు. అనంతరం ‘‘అన్నా! మీరు మా దళితవాడకు వచ్చారు. ఇక్కడే భోజనం చేసి వెళ్లాలి’’ అని మహిళలు చేసిన విజ్ఞప్తి మేరకు జగన్‌ అక్కడ ఉన్న చర్చికి వెళ్లి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement