సాగరమంతా సంబరమే!

YS Jagan Watched Navy Celebrations in Visakha - Sakshi

ఉత్కంఠ భరితంగా సాగిన నౌకాదళ వేడుకలు 

విన్యాసాలను వీక్షించిన సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఆర్‌కే బీచ్‌ వేదికగా.. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నేవీ డే వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. విశిష్ట, ముఖ్య అతిథిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఆయనకు తూర్పు నౌకాదళాధిపతి, వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ సతీసమేతంగా స్వాగతం పలికారు. తొలుత నేవీ చిల్డ్రన్‌ స్కూల్‌ విద్యార్థుల నేవీ బ్యాండ్‌ ప్రదర్శనతో నావికాదళ వేడుకలకు శ్రీకారం చుట్టారు. మెరైన్‌ కమెండోలు 84 ఎంఎం రాకెట్‌ వాటర్‌ బాంబు పేల్చి సీఎంకు స్వాగతం పలికారు. తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్‌ యుద్ధ విమానాల బృందం చేసిన విన్యాసాలు గగుర్పొడిచాయి.

గంటకు 70 కిలోమీటర్ల వేగంతో సముద్రంలో పయనిస్తూ ఐఎస్‌వీ తరహా నౌకలు సుదూరం నుంచి ఎదురెదురుగా దూసుకువచ్చే సన్నివేశం అబ్బురపరచింది. ఆరువేల అడుగుల ఎత్తులో పయనిస్తున్న ఎయిర్‌ క్రాఫ్ట్‌ల నుంచి పారా జంపింగ్‌ చేసిన స్కై డైవర్లు గాల్లో విన్యాసాలు చేస్తూ ప్యారాచూట్ల సహాయంతో వేదిక ప్రాంగణంలో చాకచక్యంగా వాలారు. అనంతరం స్కై డైవర్ల బృంద సారధి లెఫ్టినెంట్‌ రాథోడ్‌ విశిష్ట అతిథి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి స్మృతి చిహ్నాన్ని అందించారు.  రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించడం, మిగ్‌ విమానాలు పల్టీలు కొడుతూ దూసుకుపోవడం, మార్కోస్‌ను సీకింగ్‌ హెలికాప్టర్ల ద్వారా మరో చోటకు తరలించడం వంటి సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అద్భుతమైన రీతిలో విన్యాసాలు ప్రదర్శించారంటూ నౌకాదళ బృందాన్ని సీఎం ప్రశంసించారు.  
బుధవారం విశాఖ సాగర తీరంలో ఒళ్లు గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలు చేస్తున్న నేవీ సిబ్బంది. (ఇన్‌సెట్‌లో) తూర్పు నౌకాదళాధిపతి, వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌ జైన్‌తో కలిసి విన్యాసాలను వీక్షిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

తేనీటి విందులో సీఎం జగన్‌ 
విన్యాసాలు ముగిసిన అనంతరం నేవీ హౌస్‌లో ఎట్‌ హోం పేరుతో నిర్వహించిన తేనీటి విందులో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. భారత నౌకాదళం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ సాగించిన వీరోచిత చరిత్రపై ప్రదర్శించిన షార్ట్‌ ఫిల్మ్‌ను తిలకించారు. సీఎం వెంట మంత్రులు అవంతి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, సీఎం ప్రోగ్రామ్స్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top