‘స్పందనకు వినతులు సంఖ్య బాగా పెరుగుతోంది’

YS Jagan Review Meeting Over Spandana Programme - Sakshi

సాక్షి, అమరావతి : ప్రజా సమస్యలపై స్పందిస్తున్నందుకే ‘స్పందన’ కార్యక్రమానికి వచ్చే వినతుల సంఖ్య బాగా పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్పందన కార్యక్రమంపై సమీక్షలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.  స్పందన కార్యక్రమానికి ఆదరణ పెరగడంపై ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారంలో నాణ్యతపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్‌ జగన్‌ వివరంగా మాట్లాడారు. క్రమం తప్పకుండా కాల్‌ సెంటర్ల ద్వారా ప్రజలకు ఫోన్‌ చేసి వారి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే వినతులపై కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మార్వోలు, ఎస్‌ఐలు బాగా స్పందిస్తున్నారా? లేదా? అనేది తెలుసుకుంటామని, సర్వేలు కూడా చేయిస్తామన్నారు. అలాగే వినతులు పరిష్కారంపై అసంతృప్తిగా ఉన్నవారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలన్నారు. 

స్పందనకు వస్తున్న వినతుల్లో 90 శాతం పరిష్కారం అవుతున్నాయని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. అసంతృప్తి స్థాయి సగటు 9.5 శాతం కన్నా తక్కువగా ఉందని తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌.. భవిష్యత్తులో ఇది 1 శాతం కన్నా తక్కువగా ఉండాలని సూచించారు. కలెక్టర్‌ నుంచి దిగువస్థాయి అధికారి వరకు ఆ లక్ష్యాన్ని సాధించేందుకు పనిచేయాలని ఆదేశించారు. అలాగే తిరస్కరించిన వినతుల సగటు 7.6 శాతం ఉందని.. వీటి మీద కూడా అధికారులు దృష్టి పెట్టాలని చెప్పారు.

ఇసుక కొరత ఎక్కువగా ఉన్నట్టు ఫీడ్‌ బ్యాక్‌ వస్తోందని తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌.. నిర్మాణాత్మకంగా ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో ఇసుక లూటీ జరిగిందని చెప్పిన సీఎం.. లూటీ లేకుండా ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న 65 రీచ్‌ల నుంచి సరిపడ ఇసుకను మనం సరఫరా చేయలేమని.. కనీసం 200 రీచ్‌ల ద్వారా ఇసుకను సరఫరా చేయాలన్నారు. సెప్టెంబర్‌ 5లోగా ప్రతి రీచ్‌లో వేబ్రిడ్జిలు, వీడియో కెమెరాలు ఉంచడానికి ఏపీ ఎండీసీ సన్నద్దమవుతోందని తెలిపారు. ప్రతి రీచ్‌లో డంప్‌ యార్డ్‌ పెట్టాలన్నారు. అయితే వరదల కారణంగా ఇసుక రీచ్‌లు మూతపడ్డాయని ఈ సందర్భంగా కలెక్టర్లు సీఎం వైఎస్‌ జగన్‌కు తెలిపారు. వరదలు తగ్గగానే మరింత ఇసుక అందుబాటులో వస్తుందని వారు సీఎంకు వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top