విజయ సంకల్పం

YS Jagan Pilan Memories in Srikakulam - Sakshi

వైఎస్సార్‌ కుటుంబ  ప్రస్థానంలో ఇచ్ఛాపురానికి ప్రత్యేక గుర్తింపు

తండ్రి, తనయ, కుమారుల పాదయాత్రల ముగింపు ఇక్కడే

సందర్శనీయ స్థలాలుగా పైలాన్లు

స్ఫూర్తిదాయంగా నిలుస్తున్న విజయస్థూపం

శ్రీకాకుళం, కంచిలి/ఇచ్ఛాపురం రూరల్‌ :వైఎస్సార్‌ కుటుంబానికి.. రాష్ట్రంలో శివారు నియోజకవర్గమైన ఇచ్ఛాపురానికి విడదీయరాని బంధం ఏర్పడింది. ఆ కుటుంబం ప్రజాహితమైన ఏ కార్యక్రమానికి సమర
శంఖారావం పూరించాలన్నా ఇచ్ఛాపురమే వేదికవుతోంది. దివంగత మహానేత వైఎస్‌.రాజశేఖరరెడ్డి నుంచి కుమార్తె షర్మిలమ్మ, తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరకు వీరందరి పాదయాత్రల ముగింపు ఘట్టం ఇచ్ఛాపురంలోనే జరిగింది. ఇక్కడ పాదయాత్రలు ముగించిన తర్వాత నుంచే ఆ దశ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. ఈ ముగ్గురి పాదయాత్ర విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..        

ప్రజాసంకల్పయాత్ర
పల్లె సీమలు, పట్టణాలు, నగరాల మీదుగా సాగిన సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్రకు సాక్షిగా నిలిచింది ‘విజయ స్థూపం’(పైలాన్‌). వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2017 నవంబర్‌ 6న ఇడుపులపాయలోని      దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృతివనం నుంచి ప్రారంభించిన పాదయాత్ర ఎన్నో అవాంతరాలను అధిగమించి 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగించారు. ప్రజా సంకల్పయాత్రకు గుర్తుగా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద ఆయన ప్రారంభించిన ‘విజయ స్థూపం’ నేడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయానికి చిహ్నంగా నిలుస్తోంది. 

ప్రత్యేక ఆకర్షణగా విజయ స్థూపం...
ఒడిశా రాష్ట్రం సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి సుమారు 30 కిలోమీటర్ల ముందర శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి ధనరాజులమ్మ ఆలయ పరిసరాల్లో ‘విజయ స్థూపం’ (పైలాన్‌) నిర్మించారు. తూర్పు వైపు 16వ నంబర్‌ జాతీయ రహదారి, పడమర వైపు హౌరా–చెన్నై రైల్వే లైను ఉండటంతో అటు వాహనాల్లో ప్రయాణించే వారికి, ఇటు రైలులో ప్రయాణించే వారి దృష్టిని ఈ కట్టడం ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. రాత్రి సమయంలో మిరిమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతుల్లో పైలాన్‌ ప్రత్యేకంగా దర్శనమిస్తోంది.

చిరస్మరణీయంగా చిహ్నాలు...
సుమారు అర ఎకరా స్థలంలో 98 అడుగుల ఎత్తులో నిర్మించిన విజయ స్తూపం ప్రత్యేక ఆకర్షణగా, చిరస్మరణీయ చిహ్నాలతో కమనీయంగా రూపుదిద్దుకుంది. నాలుగు వైపులా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలతో పాటు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫొటోలు పాలరాతిపై లామినేషన్‌ చేసి అలంకరించారు. పాదయాత్ర సందర్భంగా తీసిన ఫొటోలు, అనునిత్యం జనంతో మమేకమై వారి వెతలు వింటూ భరోసా ఇస్తున్న దృశ్యాలను పైలాన్‌ చుట్టూ నిర్మించిన రక్షణ గోడకు అమర్చారు.

13 జిల్లాలకు గుర్తుగా 13 మెట్లు..
విజయ స్తూపం చుట్టూ చిన్నపాటి లాన్‌ను ఏర్పాటు చేశారు. ఈ లాన్‌ నుంచి పైలాన్‌ బేస్‌కు చేరుకునేందుకు 13 మెట్లు ఏర్పాటు చేశారు. 13 జిల్లాల్లో పాదయాత్ర చేసినందుకు గానూ ఒక్కో జిల్లాకు ఒక్కో మెట్టు చిహ్నంగా ఏర్పాటు చేశారు. పైభాగంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పతాకంలోని మూడు రంగులతో కూడిన ఒక టోంబ్‌ను అమర్చారు.  అగ్ర భాగంలో పార్టీ పతాకాన్ని ఏర్పాటు చేసి దానిపైన ఫ్యాన్‌ గుర్తు అమర్చారు.  ప్రస్తుతం ఈ విజయస్తూపం పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు, అమ్మవారిని దర్శించుకునే భక్తులతో నిత్యం కిటకిటలాడుతోంది. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ వాణిజ్యవిభాగం కన్వీనర్‌ తాడి ఆదిరెడ్డి పర్యవేక్షణలో విద్యుత్‌ కాంతులతో విజయ స్తూపం దర్శనీయ స్థలంగా మారింది. విలువలు, విశ్వసనీయత, భరోసా, పట్టుదలను వారసత్వంగా పుణికి పుచ్చుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయానికి చిహ్నంగా ‘విజయ స్తూపం’ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందనడంలో అతిశయోక్తిలేదు.

ప్రజా ప్రస్థానం...
రాజకీయ నాయకులకే కాదు ప్రజలకు సేవ చేసేందుకు తపన ఉండాలనుకునే వారికి, ప్రజల కష్ట నష్టాలను కళ్లారా చూడటానికి ఏం చేయాలో తెలియక మీమాంసలో ఉన్న వారికి 2003లో ‘ప్రజా ప్రస్థానం’ పేరిట వైఎస్‌ఆర్‌ చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తిగా, ప్రేరణగా నిలుస్తోంది. 2003 ఏప్రిల్‌ 9న రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. 2003 జూన్‌ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించారు. సుమారు 64 రోజుల పాటు 1470 కిలో మీటర్ల పాటు  పాదయాత్ర చేశారు. పాదయాత్ర మధ్యలో అనారోగ్యానికి గురైనప్పటికీ వెనుకడుగు వేయకుండా అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్ర కొనసాగించారు. వైఎస్సార్‌ పాదయాత్ర ముగింపు రోజు ఇచ్ఛాపురం సురంగి రాజా వారి మైదానంలో పార్టీ అగ్రనాయకులతో నిర్వహించిన బహిరంగ సభలో సమర శంఖారావాన్ని పూరించారు. ఆ రోజు సిక్కోలు ప్రజలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు వైఎస్సార్‌కు నీరాజనాలు పట్టారు. ముగింపు రోజునే ప్రజాప్రస్థాన పైలాన్‌ను, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2004 ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఆయన ముఖ్యమత్రి హోదాలో 2004 మార్చి 5న నగర బాట కార్యక్రమంలో భాగంగా ఇచ్ఛాపురంలో పర్యటించి టూరిజం పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడ నిర్మించిన ప్రజాప్రస్థాన విజయ వాటికగా నామకరణం చేశారు. అనంతరం టూరిజం పార్కును వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008 అక్టోబర్‌ 26న ప్రారంభించారు. టూరిజం పార్కు వద్ద ఉన్న పైలాన్‌ ఇప్పటికీ పార్టీలకతీతంగా స్ఫూర్తిని రగిలిస్తునే ఉంది.

మరో ప్రజా ప్రస్థానం..
మహానేత తనయ వైఎస్‌ షర్మిలమ్మ పాదయాత్రను 2012 అక్టోబర్‌ 18న ఇడుపులపాయలో ప్రారంభించి 2013 ఆగస్టు 4న ఇచ్ఛాపురంలో ముగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కష్టాలకు గురిచేస్తున్నదుకు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పేరిట పాదయాత్రను చేపట్టారు. ఇచ్ఛాపురం పాదయాత్ర ముగింపు సభకు తల్లి వైఎస్‌ విజయమ్మ కూడా హాజరయ్యారు. ప్రభుత్వం తీరును దుమ్మెత్తిపోశారు. 116 నియోజకవర్గాలు, 14 జిల్లాల్లో 230 రోజుల పాటు 3112 కిలో మీటర్లు షర్మిలమ్మ నిర్వహించిన పాదయాత్రకు గుర్తుగా ఇచ్ఛాపురం ప్రజా ప్రస్థానం ఎదురుగా ‘మరో ప్రజా ప్రస్థానం’ పేరిట నిర్మించిన స్థూపం మరో మైలు రాయిగా మిగిలిపోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top