జన'విజేత'

YS Jagan Mohan Reddy Memories in West Godavari - Sakshi

తొలిఅడుగు ఇక్కడే ఓదార్పుయాత్రకు శ్రీకారం

రైతు దీక్ష నుంచి బీసీ సదస్సు వరకూ

కష్టాలు రానీ.. కన్నీళ్లు రానీ.. వెనుకడుగే లేదు

పశ్చిమ గడ్డపై పోరాటయోధుడి ప్రస్థానమిదీ..

రాజన్న మరణం తట్టుకోలేక గుండె పగిలిన కుటుంబాలను ఓదార్చేందుకుఢిల్లీ పెద్దలను ధిక్కరించినా.. రైతు రుణమాఫీ మోసాలపై దీక్షబూనినా.. తుందుర్రు ఆక్వా ఉద్యమానికి నేనున్నానంటూ బాసటగా నిలిచినా..గరగపర్రు దళితులకు అండగా గర్జించినా.. దగాపడ్డ బీసీలకు వెన్నుదన్నుగా నిలిచినా.. జనం కోసం ఎందాకైనా దూసుకుపోవడంలో ఆయనకు ఆయనే సాటి. పోరుబాటలో ఆయన తీరు ప్రత్యేకం. జిల్లాపై ఆయన చూపిన ఔదార్యం అసమానం. నవరత్నాలే ఆయుధంగా జనపథం పట్టిన ప్రజా సంకల్పయాత్ర ఓ సువర్ణాధ్యాయం. ఇది జిల్లా వాసులకు ఓ భరోసా.. మొత్తం ఆంధ్ర ఇక కులాసా. ఐదేళ్ల రక్కసి పాలనను పారదోలి నవ్యాంధ్ర సారథిగా పట్టాభిషిక్తుడవుతున్న వేళ జిల్లాలో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగక చేసిన పోరాట గమనం స్మరణీయం

సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: పోరాటాల పురిటిగడ్డ పశ్చిమాన పోరాట యోధుడిగా ఆయన ఉదయించారు. కుట్రలు, కుతంత్రాలు, కుటిల రాజకీయాలు, వేధింపులు, దాడులు చేస్తూ తోడేళ్ళలా అంతా ఒక్కటై దండెత్తి వచ్చినా.. భయపడలేదు. నదురూబెదురు లేక ముందుకు సాగారు. పార్టీ శ్రేణుల్లో పోరాట స్ఫూర్తిని రగిలిస్తూ.. చీకటి బతుకుల్లో వెలుగులు విరజిమ్మే మండే సూరీడులా.. ప్రజా సమస్యలపై ఉక్కుపిడికిలి బిగించారు. ఉద్యమబాట పట్టారు. ఎండా.. వానా.. ధుమ్మూధూళి, రక్కసి మూకల కర్కశ దాడులను లెక్కచేయక గుండెల నిండా ధైర్యాన్ని నింపుకుని.. దేవుడిపై అచెంచల విశ్వాసంతో ప్రజలపై ఆపార నమ్మకంతో ముందడుగేశారు. చివరికి చీకటితెరలు చీల్చుకొచ్చిన వెలుగుల దివిటీలా ఘన విజయం సాధించి ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అదిగో అక్కడ అమరావతిలో ప్రజల సాక్షిగా ‘జగన్‌ అనే నేనూ..అంటూ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనే ‘‘యెడుగూరి సందింటి జగన్‌ మోహన్‌రెడ్డి ’’

ఓదార్పు యాత్రకు ఏలూరులోనే నాందీ
దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతితో రాష్ట్రంలో వందలాది గుండెలు పగిలాయి. తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. ప్రజల కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటకొచ్చారు. గుండెలు పగిలిన ప్రతి కుటుంబాన్నీ స్వయంగా కలుస్తానని నల్లకాల్వ సాక్షిగా  ప్రకటించారు. ఏప్రిల్‌ 2010లో రాష్ట్రవ్యాప్తంగా ఓదార్పు యాత్రకు ఏలూరు నుంచే వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళనాని ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ నుంచి వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్రను ప్రారంభించారు. జిల్లాలో 44 కుటుంబా లను ఓదార్చి వారికి తోడ్పాటును అందించారు. ఈ యాత్ర రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది. ఈ యాత్రను కాంగ్రెస్‌ అధిష్ఠానం, విపక్షాలు ఎంత అడ్డుకున్నా.. వైఎస్‌ జగన్‌ వెనుకడుగు వేయలేదు. మొక్కవోని ధైర్యంతో ముందడుగేశారు. ప్రజల పక్షాన పోరుబావుటా ఎగురేశారు.

పోలవరానికి హరిత యాత్ర
పోలవరం సాధనకోసం వైఎస్‌ జగన్‌ హరిత యాత్ర చేపట్టారు. 2011లో రావులపాలెం నుంచి పోలవరం వరకూ కాలినడకన యత్ర చేశారు. నాలుగురోజుల పాటు 80కిలోమీటర్ల దూరం మేర ఈ యాత్ర సాగింది. అనంతరం 2012లో వైఎస్‌ జగన్‌ బస్సుయాత్ర చేపట్టారు.  

విద్యుత్‌ పోరాటానికి వేదిక మొగల్తూరు
విద్యుత్‌ చార్జీల పెంపుపై కాంగ్రెస్‌ సర్కారుకు వ్యతిరేకంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమించారు.  2004 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ విద్యుత్‌ చార్జీలను పెంచలేదు. కానీ ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా విద్యుత్‌ ఛార్జీలు పెంచటంతో వైఎస్‌ జగన్‌ వెంటనే స్పందించారు. ప్రస్తుత నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో  2012 జూన్‌ 10న మొగల్తూరు సబ్‌స్టేషన్‌ వద్ద వైఎస్‌ జగన్‌ ఒకరోజు నిరశన దీక్ష చేశారు.  ఆ సమయంలోనే ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతోపాటు వైఎస్‌ జగన్‌ తీరంలో పర్యటించి స్వయంగా ఉప్పుమడుల్లోకి దిగి ఉప్పు రైతుల దీనస్థితిని తెలుసుకున్నారు. వారి సమస్యలపై గళమెత్తారు. 

తణుకులో రెండు రోజుల రైతు దీక్ష  
ఆ తర్వాత 2014 ఎన్నికల్లో స్వల్పతేడాతో అధికారానికి దూరమైన వైఎస్సార్‌సీపీ టీడీపీ సర్కారు నయవంచన పాలనపై సమరశంఖం పూరించింది. చంద్రబాబు పాలనలో దగాపడ్డ రైతుల పక్షాన ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గళమెత్తారు. తణుకు పట్టణంలో 2015 జనవరి 31న రెండురోజులపాటు రైతు దీక్ష చేపట్టారు. స్వాతంత్య్రోద్యమం నుంచి ఎన్నో ప్రజా ఉద్యమాలకు కేంద్రమైన తణుకు నుంచే జన నేత జగన్‌ టీడీపీ ప్రభుత్వంపై ఎడతెగని పోరాటాలకు శ్రీకారం చుట్టారు.  తణుకులో జాతీయరహదారి పక్కన  బెల్లం మార్కెట్‌ సమీపంలో రెండురోజులు దీక్ష చేశారు.

దేవరపల్లిలో పొగాకు రైతు కోసం..
పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక పోరుబాట పట్టిన పొగాకు రైతులకూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాసటగా నిలిచారు. వారిపక్షాన సమరభేరి మోగించారు. పొగాకు రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు 2015 జూలై 4న దేవరపల్లి పొగాకు కేంద్రాన్ని సందర్శించారు.  వారి కష్టాలు విని నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు. వేలాదిమంది రైతుల గుండెల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు పోరాటం చేశారు. పొగాకు ధర రూ.175 నుంచి రూ.130కు పడిపోయిందని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రైతన్నలకు అండగా ఉంటామంటూ వారికి భరోసా కల్పించారు.  2016లోనూ జంగారెడ్డిగూడెంలోని పొగాకు కేంద్రాలను సందర్శించి రైతులకు బాసటగా నిలిచారు.     ఏలూరులో హోదాపై యువభేరి
రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ యువత, విద్యార్థులను చైతన్యవంతులను చేసేందుకు యువభేరీలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆళ్ళనాని ఆ«ధ్వర్యంలో 2016 సెప్టెంబర్‌ 22న  ఏలూరులోని శ్రీకన్వెన్షన్‌ హాలులో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాలు, నేతలు, విద్యార్థి సంఘాలతో యువభేరీ నిర్వహించారు. భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు హాజరై తమ ప్రత్యేక హోదా సాధనకు మీతో కలిసి పోరాటం చేస్తామంటూ జగన్‌కు చెప్పారు. 

గరగపర్రు దళితులకు అండగా
పాలకోడేరు మండలం గరగపర్రులో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఇరు వర్గాల మధ్య త్రీవస్థాయిలో వివాదం నెలకొంది. దళితులను ఇతర వర్గాలు వెలివేశాయని, సామాజికంగానూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, గొడవలు జరుగుతున్నాయనే విషయాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో 2017 జూన్‌ 30న గరగపర్రులో పర్యటించి దళితులను పరామర్శించారు. రెండు వర్గాలతో మాట్లాడి అక్కడి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేశారు. వైషమ్యాలను వదిలి రెండు వర్గాలు కలిసిమెలిసి ఉండాలని కోరారు.

జిల్లా ప్రజలకు ఏ కష్టం  వచ్చినా..
జిల్లా ప్రజలకు ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు వచ్చారు. రాజులా పాలిస్తే.. ప్రజలు మళ్లీ ఆదరించడానికి కూడా రెడీగా ఉంటారని వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన చాటింది. ఇదే బాటలో రాజన్న రాజ్యం అందించేందుకు ముందుకు వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి రాజశేఖరరెడ్డి కన్నా జనక్షేమం కోసం రెండు అడుగులు ముందుకు వేయడం ఖాయమని అందరూ అభిప్రాయ పడుతున్నారు.

ఏలూరులో బీసీ మహాగర్జన సభ
ఏలూరు శివారు వట్లూరు ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ అధినేత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ గర్జనతోపాటు, ఎన్నికల సమరశంఖారావాన్ని పూరించారు. ఏలూరులో బీసీ గర్జన మహాసభ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. సుమారు మూడు లక్షలమంది బీసీలు, పార్టీ శ్రేణులు సభకు హాజ రయ్యారని అంచనా. మండుటెండలోనూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాన్ని వినేందుకు జనం ఓపిగ్గా వేచి ఉన్నారు.  ఉక్కపోతను సైతం లెక్కచేయకుండా తమ అభిమాన నేతకు జేజేలు పలికారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. దీనిపై బీసీల్లో హర్షం వ్యక్తమైంది. దివంగత మహానేత వైఎస్సార్‌ పేదల సంక్షేమానికి ఒక అడుగు ముందుకు వేస్తే..తాను రెండు అడుగులు వేస్తానని చెప్పే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీల పట్ల బీసీ వర్గాలు విశ్వాసాన్ని వ్యక్తం చేశాయనేది ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top