‘ఓటుకు కోట్లు’పై... బాబు మొహం చాటేశారు

‘ఓటుకు కోట్లు’పై...  బాబు మొహం చాటేశారు - Sakshi


సమాధానం చెప్పే ధైర్యం లేకే సభను వాయిదా వేసుకున్నారు

బాబు రాజీనామా చేయాల్సినంత తీవ్రమైన అంశం అది

సభలో చర్చకు అనుమతించకపోవడం అన్యాయం

నిబంధనల ప్రకారం అడిగినా ప్రయోజనం లేకపోయింది

రూ.వెయ్యి కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏమైంది?

15 నెలలైనా ఒక్క ఉద్యోగమూ లేదు, ఒక్కరికీ నిరుద్యోగభృతి ఇవ్వలేదు

హోదాతో ఉద్యోగాలొస్తాయన్న కనీస ధ్యాస లేదు

పోలవరంపై రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదని కేంద్రమే చెప్పింది

పట్టిసీమకు వ్యతిరేకమని గతంలోనే చెప్పాం

{పభుత్వ తీరుపై ధ్వజమెత్తిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్


 

హైదరాబాద్: తాను అడ్డంగా దొరికిపోయిన ఓటుకుకోట్లు కుంభకోణంలో సమాధానం చెప్పుకునే దమ్మూ, ధైర్యం లేకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభను వాయిదా వేసుకుని వెళ్లిపోయారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఓటుకుకోట్లు కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ కోసం తాము నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చినా అనుమతించలేదని ఆయన అన్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు అర్ధాంతరంగా వాయిదాపడిన తరువాత శుక్రవారం మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభ సమావేశాలు జరిగిన తీరును ఆయన వివరిస్తూ... అధికారపక్షం వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి పేరును ఏసీబీ చార్జిషీటులో పొందుపరిస్తే ఆ వ్యవహారాన్ని అసెంబ్లీలో చర్చించవద్దంటే ఎలా? అని జగన్ విస్మయం వ్యక్తం చేశారు.‘‘ఒక ఎమ్మెల్యేను ప్రలోభపెడుతూ ఒక ముఖ్యమంత్రి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం బహుశా దేశంలో ఇదే ప్రథమం. నామినేటెడ్ ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ నివేదికలో ధ్రువీకరించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక టీడీపీ ఎమ్మెల్యే లంచం డబ్బు తీసుకుని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సిద్ధపడి పట్టుపడ్డారు. ఇంత గట్టి సాక్షాధారాలతో పట్టుపడితే, ముఖ్యమంత్రిపైనా నేరుగా ఆరోపణలు వస్తే అసెంబ్లీలో చర్చకు అనుమతించరా! ఇంత తీవ్రమైన అంశాన్ని అసెంబ్లీలో చర్చించకపోవడం కూడా బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారేమో!దొంగను పట్టుకోవడం తప్పు అన్నట్లుగా ఉంది

 ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించకూడదనే దుర్బుద్ధితోనే శాసనసభ సమావేశాలను ఐదురోజులకు పరిమితం చేశారు. కనీసం పదిహేను రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని మేము కోరినా ప్రయోజనం లేకపోయింది. అధికారం ఉంది కదా అని, స్పీకర్ స్థానం కూడా వాళ్లదే కనుక చర్చకు అవకాశం ఇవ్వకుండా వ్యవస్థలను మేనేజ్ చేయడం నిజంగా ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. ఈ వ్యవహారం నిజంగా ఎలా ఉందంటే... దొంగతనం చేస్తూ పట్టుబడ్డ ఒక దొంగ ఆ దొంగతనం చేయడం తప్పు కాదు, తనను పట్టుకోవడమే తప్పు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఏపీలో అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని వెదజల్లుతూ పట్టుబడిన పరిస్థితి ఇది. ఎమ్మెల్యేలను కొనడానికి సన్నద్ధమై ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఐదు నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకూ ఆశ చూపిన ఉదంతం ఇది, మొత్తం మీద రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల కుంభకోణం ఇది.పట్టిసీమ నుంచి ఇసుక మాఫియా వరకూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే పర్సెంటేజీలు తీసుకుని సంపాదించిన డబ్బు ఇది. మట్టి దగ్గరి నుంచి బొగ్గు దాకా ప్రతి అం శంలోనూ కమీషన్లు తీసుకుంటున్న పరిస్థితి. జీవో నెంబర్ 22 నుంచి, డిస్టిల్లరీలను విస్తరింప జేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం నుంచి లంచాలు తీసుకున్నారు. ఎంపిక చేసిన పారిశ్రామికవేత్తలకే ప్రోత్సాహకాలు ఇచ్చి కమీషన్లు తీసుకున్నారు. కృష్ణపట్నం విద్యుత్ ఉత్పాదనా కేంద్రంలో ఒక మెగావాట్ విద్యుత్‌కు ఉత్పాదనా వ్యయం రూ.8 కోట్లకు పెరి గింది, పైగా అది సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించింది కూడా కాదు. సూప ర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే విద్యుత్ కేంద్రంలో కూడా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పాదనా వ్యయం రూ.5.5 కోట్లకు మించదు కానీ కృష్ణపట్నంలో మాత్రం రూ.8 కోట్లకు పెరిగింది. రాయలసీమ థర్మల్ విద్యు త్ కేంద్రంలో కూడా అంతే. అక్కడ రూ.4 కోట్లతో జరగాల్సిన ఒక మెగావాట్ ఉత్పత్తి వ్యయం రూ.6 కోట్లకు పెరిగింది. దీన్ని బట్టి ఎక్కడ చూసినా లంచాలే అనేది స్పష్టం అవుతుంది. ఇలా సంపాదించిన డబ్బును విచ్చలవి డిగా వెదజల్లుతూ దొరికిపోతే, చంద్రబాబు పేరును ఏసీబీ చార్జిషీట్‌లో 22 సార్లు పొందుపరిస్తే, ఫోరెన్సిక్ నివేదికలో కూడా ఆ టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతేనని నిర్ధారిస్తే అసెంబ్లీలో చర్చకు అనుమతించక పోవడం ఏమిటి? సభలో మేం ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు చంద్రబాబు అసెంబ్లీలోని తన చాంబర్‌లో ఉండి కూడా బయటకు రాకుండా కూర్చున్నారు. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి చొరవ తీసుకుని చర్చించి, ఆ చర్చలో తన వాదన ఏమిటో చెప్పి ఉండాల్సింది, కానీ ఆయన ఆ బాధ్యత నుంచి తప్పించుకున్నారు. చంద్రబాబు రాజీనామా చేసి ఉండాలి...

 వాస్తవానికి ఈ వ్యవహారంలో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఉండాలి. వాయిదా తీర్మానం రూపంలో, 344 నిబంధన కింద మేము నోటీసులు ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. మేము పద్ధతి ప్రకారం చర్చకు రాలేదని తెలుగుదేశం వారు ఆరోపించగలరు. కానీ మేము నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చామనడానికి ఈ ప్రతులే(స్పీకర్‌కు ఇచ్చిన నోటీసులు చూపిస్తూ) సాక్ష్యం. తనను ఫలానా ఉద్యోగి లంచం అడుగుతున్నారని ఒక రైతు గానీ, సాధారణ వ్యక్తిగానీ ఏసీబీ అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తే, ఆ రైతుకు ఏసీ బీ అధికారులు కొంత డబ్బును ఇచ్చి ఆ నోట్ల పై ఫింగర్‌ప్రింట్ అసెస్‌మెంట్ పౌడర్‌ను చల్లి లంచం అడిగిన ఉద్యోగికి ఇవ్వజూపాల్సిందిగా చెప్పి వల పన్నుతారు. ఆ రైతు ఆ డబ్బును లంచం అడిగిన ఉద్యోగికి ఇస్తూ ఉండగా పట్టుకుం టారు. నోట్ల మీద ఉన్న ఫింగర్ ప్రింట్ పౌడర్ ఆ ఉద్యోగి చే తికి అంటుకున్నపుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేస్తారు. కేసు పెట్టి ఉద్యోగం నుంచి తొలగిస్తారు. మరి ఇక్కడేమైంది? నేరుగా ఆడియో, వీడియో టేపులతో సహా నల్లధనం ఇస్తూ దొరికిపోయినా అసెం బ్లీలో చర్చ కూడా జరగలేదు. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి ఆడియో రికార్డుల్లో ఉన్న గొంతు తనది కాదని చెప్పుకునే ధైర్యం చేయలేదు. ఫోరెన్సిక్ నివేదిక కూడా ఆ గొంతు ఆయనదేనని ధ్రువీకరించిన నేపథ్యంలో సీఎం అసెంబ్లీకి రాకుండా దాక్కున్నారంటే నిజంగా ఏ నైతిక హక్కుతో ఇవాళ ఆ స్థానంలో కూర్చున్నారో తన మనస్సాక్షినే అడగాలి.

 

హెరిటేజ్ ఫ్రెష్‌కు నష్టాలొస్తాయనే ధరల స్థిరీకరణ చేయడం లేదు..

 

నిత్యావసరాల ధరలు మండిపోతున్నా తమ సొంత సంస్థ హెరిటేజ్ ఫ్రెష్‌కు నష్టాలొస్తాయనే ముఖ్యమంత్రి చంద్రబాబు ధరల స్థిరీకరణ చేయడం లేదని వైఎస్ జగన్ ఆరోపించారు. నిత్యావసర ధరల పెరుగుదలపై వాయి దా తీర్మానం ఇచ్చినా చర్చకు పిలవలేదని జగన్ మండిపడ్డారు. ‘‘కందిపప్పు జనవరిలో రూ.80 ఉంటే ఇవాళ రూ.150, చింతపండు రూ.80 నుంచి రూ.130, ఉల్లి రూ.20 నుంచి రూ.70, ఎండుమిర్చి రూ.80 నుంచి రూ.125లకు ధరలు పెరిగాయి. ఈ ధరలన్నిటినీ హెరిటేజ్ ఫ్రెష్‌లో తీసుకొచ్చాం. ధరల స్థిరీకరణకు రూ.వెయ్యి కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానన్నారు. కానీ, హెరిటేజ్ ఫ్రెష్‌కు నష్టాలొస్తాయనే ధరల స్థిరీకకరణ చేయడంలేదు. నిత్యావసరాల పెరుగుదలపై చర్చకు వాయిదా తీర్మానం గురువారం ఇచ్చాం. శుక్రవారం 344కింద ఓటుకు కోట్లుపై నోటీసిచ్చాం. నిత్యావసరాల ధరల పెరుగుదలపై చర్చకు గురువారం పిలిచి ఉండొచ్చు. కానీ పిలవలేదు. చంద్రబాబు ఓటుకు కోట్లు చర్చలో ఎక్కడ ఇరుక్కుంటాడోనని 344 కింద నిత్యావసరాల ధరల పెరుగుదలపై చర్చకు పెడతామంటారు. ఓటుకు కోట్లు చర్చ అడగొద్దంటారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపైనా చర్చించరు’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.

 

కనీసం ఒక్క ప్యూన్ ఉద్యోగమైనా ఇచ్చారా?


‘‘రాష్ట్రం విడిపోయేటప్పుడు.. రాష్ట్రంలో 1,42,828 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. ఇప్పటికి 15 నెలలవుతోంది. ఒక్క ప్యూన్ ఉద్యోగం ఇవ్వలేదు. డీఎస్సీ పరీక్షలు పెట్టారు. ఇంకా ఫలితాలు ప్రకటించరు. ఉద్యోగాలూ ఇవ్వరు. ఏపీపీఎస్సీ పరీక్షలైతే నిర్వహించనే లేదు. ఫీల్ట్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారు. సంఘమిత్రలు ఇంతకు ముందు ప్రభుత్వం నుంచి రూ.2 వేలు, గ్రూపుల నుంచి మరో రూ.2 వేలు తీసుకునే వాళ్లు. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వడం మానేసింది. అంగన్‌వాడీల జీతాలపై అసెంబ్లీ జరిగినప్పుడల్లా గట్టిగా నిలదీస్తున్నాం. అదిగో ఇదిగో పెంచుతామంటున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులకు వయోపరిమితి పెంచి, రిక్రూట్‌మెంట్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఆ ఊసేలేదు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న వాళ్ల పరిస్థితి అంతే. నిర్ణీత సమయాల్లో ఉద్యోగ నియామకాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ తర్వాత పట్టించుకోరు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇప్పుడు మాట మార్చారు. పరిశీలిస్తామన్నామే తప్ప పర్మినెంట్ చేస్తామని చెప్పలేదని ఇప్పుడు అంటున్నారు. ఇంటింటికీ ఉద్యోగం, ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికీ నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తామని ఎన్నికలప్పుడు టీవీల్లో ఊదరగొట్టారు. వీటి కోసం రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లు ఎదురు చూస్తున్నాయి.. ఉద్యోగమన్నా ఇవ్వు.. రూ.2 వేలు నిరుద్యోగ భృతినైనా ఇవ్వమని. కానీ, ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు’’ అని  జగన్‌పేర్కొన్నారు.

 

చాలా అగచాట్లు పడి ప్రత్యేక హోదాపై చర్చను జరిపించాం


‘‘ప్రభుత్వం సహకరించకపోయినా ప్రత్యేక హోదాపై చర్చ జరగడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని సభలో గట్టిగా పోరాడాం. శాసనసభ్యులకు, మంత్రులకు ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలియదు. దాని వల్ల కలిగే ప్రయోజనాలూ తెలియవు. వారికి అర్థం కావాలని, వాళ్ల మనసు మారాలని చర్చ జరిపించాం. చంద్రబాబు ప్రత్యేక హోదాను అడ్డుకుంటారు. కన్ఫ్యూజింగ్(గందరగోళం)గా మాట్లాడతారు. అదేమన్నా సంజీవినా అంటారు. ప్రత్యేక హోదా వస్తేనే పారిశ్రామిక రాయితీలు, ఎక్సైజ్ డ్యూటీ, ఇన్‌కమ్ ట్యాక్స్‌లో వంద శాతం మినహాయింపు లాంటివి వస్తాయి. అప్పుడే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. అప్పుడే ఉద్యోగాల వస్తాయన్న కనీస ధ్యాస లేదు. తటస్థంగా ఉండి అసెంబ్లీ నడపాల్సిన స్పీకర్, న్యూట్రాలిటీ(తటస్థం) తప్పడం ఆయన చేసిన తప్పు. అసెంబ్లీని భ్రష్టు పట్టించడం చంద్రబాబు చేసిన తప్పు. ప్రతి రోజూ ఓ ముఖ్యమైన, ప్రాధాన్యం ఉన్న అంశాన్ని చర్చకు తీసుకువస్తున్నాం’’ అని వైఎస్ జగన్ అన్నారు.

 

 

19 లేదా 20 నుంచి జగన్ దీక్ష!

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తాను చేయబోయే నిరవధిక నిరాహారదీక్షను ఈ నెల 19 లేదా 20వ తేదీ నుంచే ప్రారంభించే అవకాశం ఉందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఈ తేదీని తమ పార్టీ నేతలు త్వరలో ధ్రువీకరిస్తారని తెలిపారు. 17న వినాయకచవితి ఉన్నందువల్ల పార్టీ నేతల సూచన మేరకు తొలుత ప్రకటించిన తేదీ వాయిదా వేసుకున్నట్లు విలేకరులడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన శుక్రవారం చెప్పారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top