
సాక్షి, ప్రకాశం: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం వేటపాలెం శివారు నుంచి వైఎస్ జగన్ 108వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి అంబేద్కర్ నగర్, దేశాయిపేట, జండ్రపేటకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం మధ్యాహ‍్నం 02.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. రామకృష్ణాపురం మీదుగా చీరాల వరకు పాదయాత్ర కొనసాగుతుంది. చీరాల పట్టణంలో క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగం సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఇప్పటి వరకు వైఎస్ జగన్ 1,449.5 కిలోమీటర్లు నడిచారు. ప్రజల సమస్యలు వింటూ.. వారికి నేనున్నా అనే భరోస్తా ఇస్తూ రాజన్న బిడ్డ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు.