మహిళ సజీవదహనం | Woman burned alive in Tirumalapalem | Sakshi
Sakshi News home page

మహిళ సజీవదహనం

Feb 27 2014 12:23 AM | Updated on Sep 2 2017 4:07 AM

ఇంట్లో వంట చేస్తూ కాసేపు మంచంపై విశ్రమించిన మహిళను ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. రక్షించండంటూ ఆమె కేకలు పెడుతున్నా

 తిరుమలంపాలెం(ద్వారకాతిరుమల), న్యూస్‌లైన్ : ఇంట్లో వంట చేస్తూ కాసేపు మంచంపై విశ్రమించిన మహిళను ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. రక్షించండంటూ ఆమె కేకలు పెడుతున్నా.. మంటలు చుట్టూ వ్యాపించడంతో ఇంట్లోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించక ఆమె సజీవ దహనమైంది. ఈ ఘటన బుధవారం ఉదయం ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుమలంపాలెంకు చెందిన మేకల మంగమ్మ(45) భర్త ఏడేళ్ల క్రితమే చనిపోవడంతో తల్లితో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. 20 ఏళ్ల క్రితం ఆమెకు గ్రామానికి చెందిన ఈరుళ్లుతో వివాహం కాగా ఏడాదికే విడాకులు పొందారు.
 
 అనంతరం ఏలూరు సమీపంలోని మాదేపల్లికి చెందిన కాశితో ఆమెకు పెళ్లైంది. వీరికి పిల్లలు లేరు. ఏడేళ్ల క్రితం కాశి మృతిచెందగా తిరిగి ఆమె తిరుమలంపాలెంలోని పుట్టిం టికి చేరుకుంది. ఏడాది క్రితం తండ్రి రుద్రబోయిన రెడ్డియ్య అనారోగ్యంతో మృతిచెందడంతో తల్లి గంగమ్మతో కలిసి ఉంటోంది. బుధవారం ఉద యం 6.30 గంటల సమయంలో తల్లిని గ్రామంలోనే ఉంటున్న మృతురాలి సోదరి నెరుసు ఉల్లూరు ఇంటికి పంపి గురువారం బలివే వెళదామని చెప్పి రమ్మంది. తల్లి వెళ్లగానే 7 గంటల సమయంలో మంగమ్మ వంట చేస్తూ.. మంచంపై కాసేపు విశ్రమించింది. కొద్ది నిమిషాల్లోనే మంటలు తాటాకింటికి చుట్టూ వ్యాపించడంతో బయటకు రాలేని పరిస్థితిలో ఆమె సజీవ దహనమైంది. ఎస్సై కర్రి సతీష్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పొయ్యిలో నిప్పురవ్వలు ఎగసిపడటంతో ప్రమాదం జరిగిందా.. లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అన్నది తెలియరాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement