వాట్సాప్‌ ఆప్తుల సాహితీ దీప్తి

Whatsapp Group Friends Get toGether in Visakhapatnam - Sakshi

మూడున్నరేళ్లుగా ప్రియమైన రచయితలు గ్రూప్‌ పేరున స్నేహ సంబంధాలు

కవితలు, కథల ద్వారా వ్యాపించిన సాహితీ పరిమళాలు

ఇన్నాళ్లకు సింహాచలంలో సమావేశం

ప్రత్యక్ష పరిచయాలతో ఉరకలేసిన సంతోషం

ఒకే రకం పక్షులు ఒకే కొమ్మ మీదకు చేరుతాయన్న లోకోక్తి ఉండనే ఉంది. జీవితాన్ని గమనిస్తే ఈ సత్యం మనకు అర్థమవుతుంది. కళల కోణంలో చూస్తే.. ఒకే దృక్పథం ఉన్న కవులు, సాహితీవేత్తలు, రచయితలు ఒకే గూటికి చేరడం అనేక సందర్భాలలో అగుపిస్తుంది. సోషల్‌ మీడియా ప్రభావం విస్తరిస్తున్న ఈ రోజుల్లో.. సాహిత్యంపై ఉన్న అభిరుచి, అనురక్తి ఒకే వాట్సాప్‌ గ్రూప్‌ గూటికి చేరుస్తోంది. అలా పరిచయమయ్యారు వారంతా.. ‘ప్రియమైన రచయితలు’గా సాహితీ బంధాన్ని కలుపుకొన్నారు. ఒకరినొకరు చూడకుండానే ప్రగాఢ అనుబంధాన్ని ప(పె)ంచుకున్నారు. మూడున్నరేళ్లు ఇలా సాహితీ సంబంధ బాంధవ్యాలు పెనవేసుకున్నాక.. వారంతా సింహాచలం వేదికగా శని, ఆదివారాల్లో సమావేశమయ్యారు. ఒకరినొకరు చూసి, ప్రత్యక్ష పరిచయం చేసుకుని, కవితలు, కథలు, కబుర్లు చెప్పుకుని.. ఆనందభరితులయ్యారు.

విశాఖపట్నం , సింహాచలం(పెందుర్తి): మూడున్నరేళ్లుగా పెరిగిన సాహితీ లత విరబూసి, పరిమళాలు విరజిమ్మిన సుగంధ సందర్భమది. ఆ శుభ తరుణం అందరినీ పరవశింపజేసింది. ఇన్నాళ్లూ ముఖ పరిచయం లేకున్నా.. ఒకరికొకరు సాహిత్యం ద్వారా ఎంతో ఆప్తులైతే.. ఇప్పుడు ప్రత్యక్ష పరిచయం కలగడంతో ఆనందం అవధులు మీరింది. సింహాచలంలో రెండు రోజులుగా జరిగిన ‘ప్రియమైన రచయితలు’ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా పెరిగిన పరిచయం మరింత ప్రగాఢం కావడానికి ఈ సమావేశం దోహదపడింది. గ్రూప్‌లో కొందరు ఇప్పటికే కవులు, కథకులుగా లబ్ధ ప్రతిష్టులైతే.. కొందరు రచనా ప్రక్రియలో తప్పటడుగులు వేస్తున్న వారు కావడంతో గ్రూప్‌ ద్వారా తప్పులు సరిదిద్దుకోవడానికి, రచనా సామర్థ్యానికి మెరుగులు దిద్దుకోవడానికి ఇన్నాళ్లుగా ఆస్కారం ఏర్పడింది.  సాహిత్యంపై పట్టు పెంచుకునేందుకు కావాల్సిన సలహాలు, సూచనలను పెద్దల నుంలచి అందుతూ ఉండడంతో వారికి ఈ వేదిక ఎంతో ప్రియమైనదైంది. ఇలా మూడున్నరేళ్లుగా సాగిన అనుబంధం.. ఒకే వేదికపై కలుసుకోవడంతో కొత్త చివుళ్లు తొడిగింది.

శని, ఆదివారాల్లో సింహాచలంలో జరిగిన సమావేశం సాన్నిహిత్యాన్ని పెంచడమే కాదు.. ఒకరి అనుభూతులను, అనుభవాలను, రచనలను, కవితలను నేరుగా ఒకరితో ఒకరు పంచుకోవడానికి వీలు కల్పించింది. సాహిత్యంపై పట్టు సాధించేందుకు కావాల్సిన సూచనలను పెద్దల నుంచి పొందడానికి ఆస్కారమిచ్చింది. భవిష్యత్తులో సాహితీ ప్రక్రియలో మరింత ముందడుగు వేయడానికి దోహదపడింది.. సాహిత్య సమ్మేళనం పేరిట సింహాచలంలోని బృందావనం కల్యాణ మండపం అక్షరాలా సాహితీ సుగంధాలను వ్యాపింపజేసింది.

మెయిన్‌ అడ్మిన్‌ కృషి ఫలితం
ఎక్కడెక్కడో ఉంటున్న ఇంతమంది కవులు, కథకులు ఒకే వేదికపై కలుసుకోవడానికి ముఖ్యకారణం వాట్సాప్‌ గ్రూప్‌ల మెయిన్‌ అడ్మిన్, సింహాచలం ప్రాంతానికి చెందిన ప్రముఖ రచయిత ఇందూరమణ. రచయిత, కవిగా పేరుగాంచిన ఇందూరమణ దేశ, విదేశాల్లో ఉన్న కవులు, కథకులను కలిపి సాహిత్య సమ్మేళనం ఏర్పాటు చేయాలని భావించారు. మూడున్నరేళ్ల క్రిందట కవులు, కథకుల పేరిట రెండు వాట్సాప్‌ గ్రూప్‌లను వేర్వేరుగా ఏర్పాటు చేసిన ఆయన ఆగ్రూపుల్లో తనకు తెలిసిన కవులను, కథకులను సభ్యులుగా చేర్చారు. వారికి ఎవరెవరు తెలుసో వారందరినీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పించారు. ఇలా దేశంలో పలు రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటున్న సాహితీప్రియులు కవులు, కథకుల గ్రూపుల్లో చేరారు. ఇలా రెండు గ్రూపుల్లో కలిసి 500మంది వరకు పెరిగారు. వీరందరినీ ఒకేవేదికపై తీసుకొచ్చి సాహిత్య సమ్మేళనం నిర్వహించాలని ఇందూ రమణ భావించారు. గడిచిన మూడునెలలుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దీంతో ఈనెల 27, 28 తేదీల్లో ప్రియమైన రచయితలు (కవులు–కథకుల సమూహం) పేరిట సాహిత్య సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. హాజరైన సాహితీ ప్రియులంతా ఒకరినొకరు పలకరించుకుంటూ తమ అనుభవాలను పంచుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top