ఈఆర్‌సీ అనుమతి ఉన్న ఒప్పందాలనే గౌరవిస్తాం | we only respect contracts of erc agreements, says TDP | Sakshi
Sakshi News home page

ఈఆర్‌సీ అనుమతి ఉన్న ఒప్పందాలనే గౌరవిస్తాం

Jun 20 2014 2:06 AM | Updated on Aug 18 2018 5:15 PM

ద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) అనుమతి లేని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది.

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ నియంత్రణ  మండలి (ఈఆర్‌సీ) అనుమతి లేని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని, అవసరమైతే ఆ విషయంలో న్యాయపోరాటం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని అభిప్రాయపడింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం రాత్రి లేక్‌వ్యూ అతిథి గృహంలో జరిగింది.  పీపీఏల రద్దుకు దారితీసిన పరిస్థితులను చంద్రబాబు మంత్రివర్గానికి వివరించారు. విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను యథావిధిగా ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. ఈఆర్‌సీ అనుమతి లేని ఒప్పందాలను రద్దుచేయాలని తీసుకున్న నిర్ణయం న్యాయబద్ధమైనదేనని తెలిపారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో మిగులు విద్యుత్తు ఉంటే తెలంగాణకు ఇద్దామన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం రాద్ధాంతం చేయటం సరికాదని విమర్శించారు. సమావేశంలో చర్చించిన అంశాలను సహచర మంత్రి పి. నారాయణతో కలిసి సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.
 
  కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రస్తుతం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దాన్ని  ఈ ఏడాది ఆఖరుకు 1100 మెగావాట్లకు పెంచాలని నిర్ణయం.  ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బిల్లును త్వరలోనే సభలో ప్రవేశపెడతాం. వయస్సు పెంపు నిబంధన ఈ నెల నుంచే అమల్లోకి వస్తుంది.  రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంతోపాటు పలు హామీలిచ్చిన కేంద్రం తక్షణం వాటిని అమలు చేసేలా ఒత్తిడి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది.
 
 ప్యాకేజీలు వెంటనే విడుదల చేయాలని, పరిశ్రమలకు రాయితీలను అమలు చేయాలని కూడా ఒత్తిడి చేయనున్నారు.  పాలనాపరమైన అవాంతరాలు లేకుండా ఉండేందుకు వీలుగా అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు వెంటనే పూర్తి చేయాలి. ఉద్యోగుల కేటాయింపులూ వెంటనే చేపట్టాలి. వీటిలో జాప్యం వల్ల పరిపాలన కుంటుపడుతోంది.  పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ సక్రమంగానే ఉంది. నిజాం పాలననాటి తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. ప్రస్తుతం ముంపు గ్రామాలుగా పేర్కొన్నవి గతంలో ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వివాదం సృష్టించటం సరికాదు.  ఇరాక్‌లో చిక్కుకున్న తెలుగువారిని... ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. దీనిపై సమన్వయం చేసే బాధ్యత ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రి పల్లెకు అప్పగించారు.  
 
 సామాజిక ిపింఛన్లు అక్టోబర్ రెండు నుంచి అందచేస్తాం. ఆ రోజు నుంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెంచిన మొత్తాన్ని అమలు చేస్తాం.  బెల్టుషాపులను తొలగిం చాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోవటంతోపాటు ఉత్తర్వులు జారీ చేశాం. ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశాం. ఇంకా బెల్టుషాపులు కొనసాగితే సహించేది లేదు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు నామినే టెడ్ పదవులు పొందినవారు వెంటనే వాటికి రాజీనామా చేయాలి. అది వారి నైతిక ధర్మం. ఒకవేళ రాజీనామా చేయకపోతే ఆర్డినెన్స్ జారీ చేయటం ద్వారా తొలగించటం జరుగుతుంది.  శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదించటం జరిగింది.  ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా రుణ మాఫీ అమలు చేస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన  నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదిక ఇస్తుంది. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే తుది నివేదికను అందజేస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా ఈ విషయంలో వెనక్కువెళ్లే ప్రసక్తి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement