పాతాళంలో జలం..అయినా పంటలు పుష్కలం..!

Water in the undergroung on crops blossom - Sakshi

కోస్తాంధ్రలోనే అత్యంత లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు

60 రకాల పంటలు పండిస్తున్న రైతులు

ఒక్క మండలంలోనే 5,352 బోర్లు

ముసునూరు మండలం ప్రత్యేకత ఇది

సాక్షి, అమరావతి బ్యూరో: భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతే ఆ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడుతుంది. కానీ.. అందుకు భిన్నంగా కృష్ణా జిల్లా ముసునూరు మండలం మాత్రం పచ్చని పంటలతో కళకళలాడుతోంది. అలాగని ఆ మండలంలో సాగునీటి ప్రాజెక్టులు లేవు. కేవలం వర్షాలు బోరు బావులు మాత్రమే అక్కడి రైతులకు ఆధారం. ఆ మండలంలో 1990 వరకు భూగర్భ జలాలు అందుబాటులోనే ఉండేవి. ఆ తర్వాత బోర్లు వేయడంతో నీటి వినియోగం బాగా పెరిగింది.. 1999లో 21.67 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు 2019 నాటికి 110 మీటర్లు, కొన్నిచోట్ల 150 మీటర్ల లోతుకు కూడా వెళ్లిపోయాయి.

భూగర్భ జలాల రాష్ట్ర సగటు 12.82 మీటర్లు కాగా.. రాష్ట్ర సగటు కంటే 8 నుంచి 12 రెట్లు దిగువకు వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ మండలంలో 5,352 బోర్లున్నాయి. వీటిలో చాలా బోర్లు వెయ్యి అడుగుల లోతుకు తవ్వారు. ఒకప్పుడు గరిష్టంగా 5 హార్స్‌పవర్‌ (హెచ్‌పీ) మోటార్లను వాడేవారు. ఇప్పుడుగా 15, 20 హెచ్‌పీ మోటార్లను వాడుతున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ముసునూరు మండలంలోని 16 గ్రామాల్లో ఒక్క కొర్లకుంట మినహా మిగిలిన అన్ని గ్రామాల్లోనూ వాల్టా చట్టం అమలు చేస్తూ అధికారులు కొత్త బోర్ల ఏర్పాటుపై నియంత్రణ విధించారు. ప్రస్తుతం ఉన్న బోర్లు మరింత లోతుకు తవ్వకుండా ఆంక్షలు పెట్టారు. ఈ మండలాన్ని డార్క్‌ ఏరియాగా  ప్రకటించారు. అక్కడ ఇసుక తవ్వకాలపై కూడా నిషేధం అమలు చేస్తున్నారు.

60 రకాల పంటలతో..
ఈ మండలంలో 13,351 హెక్టార్లలో 60 రకాల పంటలు సాగవుతున్నాయి. బోర్లు వేయకముందు ఇక్కడ పది రకాల పంటలే పండించేవారు. ఏటా రెండు, మూడు పంటలు వేసి గణనీయమైన, నాణ్యమైన దిగుబడులనూ సాధిస్తున్నారు. వీటిలో మొక్కజొన్న, ఆయిల్‌పామ్, వరి, మామిడి, అరటి, పొగాకు, మిర్చి, కొబ్బరి, పత్తి, నిమ్మ, జామ, కూరగాయలు, చెరకు, వేరుశనగ, బొప్పాయి, మినుములు, పెసలు, జీడిమామిడి, బీర, ఉలవలు, టమాటా, కేప్సికం, సుబాబుల్, జొన్న, కంది, బీన్స్, పసుపు, మల్లె, చామంతి, రేగు, ములక్కాడ, పొద్దు తిరుగుడు, కాకర వంటివి ఉన్నాయి. వీటిలో ఏడాది పొడవునా నీరు అధికంగా అవసరమయ్యే ఆయిల్‌పామ్‌ 2,345 హెక్టార్లలోను, వరి 2,200 హెక్టార్లలోను సాగవుతున్నాయి.

నేల గొప్పదనమే ఇది
ముసునూరులో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నా నీటి లభ్యతతో పాటు పంటలు పండడానికి అక్కడ ఎర్ర ఇసుక నేలలే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేల కింద ఇసుక రాతి పొరలున్నాయి. ఇవి ఎక్కువ సేపు నీటిని నిల్వ ఉంచే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల భూమిలో లోతుకు వెళ్లినా సమృద్ధిగా నీళ్లు లభిస్తున్నాయి.

జలశక్తి అభియాన్‌లో ఎంపిక..
కేంద్ర జలశక్తి అభియాన్‌ పథకంలో ముసునూరు మండలాన్ని ఎంపిక చేశారు. అక్కడ భూగర్భ జలాలను పైకి తీసుకురావడానికి దోహదపడే నీటి పొదుపు చర్యలు పాటించడం, పొలంలో ఫారం పాండ్స్‌ ఏర్పాటు, నీటి వినియోగం తక్కువయ్యే ప్రత్యామ్నాయ పంటలు వేయడం వంటివి సిఫార్సు చేస్తూ అధికారులు రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. రైతులు క్రమంగా డ్రిప్‌ ఇరిగేషన్‌పై ఆసక్తి చూపుతుండటంతో సుమారు 7వేల హెక్టార్లలో నీటిని పొదుపు చేస్తున్నారు. మండలంలోని ముసునూరు, సూర్యపల్లి, వేల్పుచర్లల్లో పిజియో మీటర్లను ఏర్పాటు చేసి భూగర్భ జలాల స్థాయిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.  

చింతలపూడి ఎత్తిపోతలే శరణ్యం..
చింతలపూడి పథకం ద్వారా గోదావరి జలాలను సాగర్‌ ఎడమ కాలువలోకి మళ్లించి.. తమ్మిలేరు వాగు పరీవాహక ప్రాంతంలోని లోపూడి, గుళ్లపూడి, గుడిపాడు, వలసపల్లి, ఎల్లాపురం గ్రామాలకు కలిపితే చెరువులు నిండి భూగర్భ జలాల వృద్ధికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది సీఎం వైఎస్‌ జగన్‌ పుణ్యం కట్టుకోవడం వల్ల చెరువులు నిండి భూగర్భ జలాలు పెరిగాయి.
– రేగుల గోపాలకృష్ణ, అధ్యక్షుడు, ముసునూరు పీఏసీఎస్‌

రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం
భూగర్భ జలాల పెంపుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. డ్రిప్‌ ఇరిగేషన్‌ ఆవశ్యకతను వివరిస్తున్నాం. రెండు వేల మంది రైతులకు శాస్త్రవేత్తలతో కలిసి కిసాన్‌ మేళా నిర్వహించాం. ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలు వస్తున్నాయి.
– బి.శివశంకర్, మండల వ్యవసాయాధికారి, ముసునూరు

30 ఏళ్ల క్రితం 25 అడుగుల్లోనే నీరు
30 ఏళ్ల క్రితం మా ప్రాంతంలో 25 అడుగుల్లోనే నీరుండేది. అప్పట్లో బోర్లు వేయడానికి 100 అడుగులు తవ్వితే సరిపోయేది. ఇప్పుడు 600 అడుగుల తోతుకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల 15–20 హెచ్‌పీ మోటార్లు బిగించి నీరు తోడుతున్నారు. చెరువుల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలి.        
– ఎం.సుబ్బారావు, రైతు, గుడిపాడు,  ముసునూరు మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top