విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా అంతటా భక్తజన తరంగం ఉప్పొంగింది. దుర్గమ్మ పూజలో తరించేందుకు ఉదయం నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు.
	 కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా అంతటా భక్తజన తరంగం ఉప్పొంగింది. దుర్గమ్మ పూజలో తరించేందుకు ఉదయం నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. ఇక గుమ్మాలకు మావిడాకులతో తోరణాలు కట్టి, చెండుపూల మాలలతో అలంకరించారు. వ్యాపార సంస్థల్లో ఆయుధ పూజ నిర్వహించి సంవత్సరమంతా తమను విజయపథంలో నడిపించమని దుర్గామాతను వేడుకున్నారు. ఇళ్లలోనూ వాహనాలకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండగను పురస్కరించుకొని పిండి వంటకాలు చేసుకొని బంధుమిత్రులతో కలిసి పంక్తి భోజనాలు చేశారు. నూతన వస్త్రాలు ధరించి ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
	 
	  సాయంత్రం కుటుంబ సమేతంగా దంపతులు ఆలయాలను సందర్శించారు. ఊరి శివారులోని జమ్మిచెట్ల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. జమ్మి పత్రాలను తీసుకొచ్చి పెద్దలకు అందజేసి ఆశీస్సులు పొందారు. ఇక జిల్లాలోని శ్రీశైలం, మహానంది, అహోబిలం, మంత్రాలయం ఆలయాల్లో ఉదయం నుంచి విజయదశమి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. పంచామృతాభిషేకం, అష్టోత్తర శతనామావళి కుంకుమార్చనలతో ఆలయాలలో విజయదశమి శోభ ద్విగుణీకృతమైంది. సాయంత్రం మహానందిలో పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీశైలంలో భ్రమరాంబికా దేవిని నూతన అలంకరణలతో అత్యంత ఆకర్షణీయంగా ఊరేగించగా పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. మంత్రాలయం మూల బృందావనం నుంచి రాఘవేంద్రస్వామిని పురవీధుల్లో ఊరేగించగా దర్శించుకున్న భక్తులు తరించారు. అహోబిళంలో ప్రహ్లాదవరదుడికి జనం బ్రహ్మరథం పట్టారు. ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లె తదితర ప్రాంతాల్లో సాయంత్రం వేళ అన్ని ఆలయాలు భక్తజనుల సందర్శనతో, ప్రత్యేక పూజలతో కిటకిటలాడాయి.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
