వెలుగు ఉద్యోగుల సమ్మె

Velugu Employees Protest in Visakhapatnam - Sakshi

పీవోకు నోటీసు ఇచ్చిన సిబ్బంది

ఆందోళనకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులు

10నుంచి రిలే దీక్షలకు సన్నాహం

విశాఖపట్నం, పాడేరు: డిమాండ్ల సాధన కోసం ఒక వైపు వెలుగు ఉద్యోగులు సమ్మె బాట పట్టగా, మరో వైపు 132 జీవో రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు.
ఏపీ వెలుగు ఉద్యోగుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు   గురువారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డి.కె బాలాజీకి సమ్మె నోటీసు అందజేసి, సమ్మెలోకి వెళ్లారు.  ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం సెర్ఫ్‌లో పనిచేస్తున్న వెలుగు హెచ్‌ఆర్‌ సిబ్బందికి టైమ్‌స్కేల్‌ నిర్ణయిస్తూ తక్షణమే వర్తింప చేయాలనే డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కోసం కష్టపడి పనిచేస్తున్నామని, తమ సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వెలుగు ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా వెలుగు హెచ్‌ఆర్‌ సిబ్బంది అందరికీ టైమ్‌స్కేల్‌ వర్తింప చేయాలని, 5.11.2018న ఈసీ అప్రూవల్‌ చేసిన అంశాలను డిసెంబర్‌ 1నుంచి అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

132 జీవోను రద్దు చేయాలని  డిమాండ్‌ చేస్తూ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం, ప్రధానోపాధ్యాయుల సంఘం ఈ నెల 10 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు  సిద్ధమవుతున్నాయి. గిరిజన సంక్షేమశాఖలోని ప్రధానోపాధ్యాయుల డ్రాయింగ్‌ అండ్‌ డిస్పార్స్‌మెంట్‌ అధికారాలను ఏటీడబ్ల్యూవోలకు బదలాయిస్తూ ప్రభుత్వం గత ఆగస్టులో ఇచ్చిన 132 జీవోపై ఆది నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు, ఇతర ఉద్యోగ సంఘాలన్నీ   ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి స్పందన కానరాకపోవడంతో ఆందోళన ఉధృతం చేసేందుకు ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ మేరకు అన్ని ఐటీడీఏ ప్రధాన కేంద్రాల్లో నిరవధిక రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని, భాగంగా విశాఖ ఏజెన్సీలోని 11 మండల కేంద్రాల్లో ఈ నెల 10 నుంచి 21వరకు రోజుకొక చోట రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని, ర్యాలీలు నిర్వహించాలని  ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top