‘కుక్కకాటు’కు మందు లేదు! | Vaccine was unavailable In Anantapur Hospital When Patient Went To Hospital | Sakshi
Sakshi News home page

‘కుక్కకాటు’కు మందు లేదు!

Sep 25 2019 8:20 AM | Updated on Sep 25 2019 8:20 AM

Vaccine was unavailable In Anantapur Hospital When Patient Went To Hospital - Sakshi

వ్యాక్సిన్‌ లేదని చెబుతున్న సర్వజనాస్పత్రి హెడ్‌నర్సు

సాక్షి, అనంతపురం : జిల్లాలో కుక్కకాటుకు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ అందుబాటులో లేకుండా పోయింది. ప్రధానంగా పీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ లేదనే సమాధానాలు వినవస్తున్నాయి. దీంతో కుక్కకాటు బాధితులు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి వస్తున్నారు. ఇక్కడి ఏపీఎంఎస్‌ఐడీసీ డ్రగ్‌ స్టోర్లోనూ సూది మందులు అందుబాటులో లేవంటూ అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్‌గా ఈ మందు కొనుగోలు చేయాలంటూ ఒక్కొ వెయిల్‌ రూ.350 ధర పలుకుతోంది.
 
నెలకు 10 వేల వెయిల్స్‌ 
జిల్లాలో సర్వజనాస్పత్రితో పాటు 88 పీహెచ్‌సీలు, 15 సీహెచ్‌సీలు, రెండు ఏరియా ఆస్పత్రులు, అనంతపురం సీడీ ఆస్పత్రి, హిందూపురం జిల్లా కేంద్రం ఆస్పత్రులున్నాయి. ఈ ఆస్పత్రులకు నెలకు సగటున 10వేల ఏఆర్‌వీ వెయిల్స్‌ అవసరమని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే ఆరు నెలలుగా వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా పోయింది. ఈ ఏడాది జూన్‌ 20న కర్నూలు సీడీ ఆస్పత్రి నుంచి ఒక వెయ్యి వెయిల్స్, జూలై 29న భరత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ నుంచి 4,160 వెయిల్స్‌ తెప్పించారు. ఈ నెల 19న 3,700, 21న మరో 3,700 వెయిల్స్‌ కోసం కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చారు. అయితే ఇవి ఆస్పత్రులకు చేరేందుకు మరింత సమయం పడుతుందని ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు చెబుతున్నారు.
   
రెండు వెయిల్స్‌తో ఐదుగురికి 
కుక్కకాటుకు గురైన వారికి ఐదు డోసుల్లో ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెండు వెయిల్స్‌ ద్వారా ఐదుగురికి ఒక్కసారిగా వ్యాక్సిన్‌ వేయవచ్చు. ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో 20 వెయిల్స్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బుధవారం (నేడు)తో అవి కూడా అయిపోతాయి. గతంలో రోజుకు 20 నుంచి 30 మందికి మాత్రమే ఈ వ్యాక్సిన్‌ను వేసేవారు. అయితే ఇటీవల కుక్కకాటు బాధితుల సంఖ్య పెరగడంతో రోజూ 80 మందికి వేయాల్సి వస్తోంది. అనంతపురం రూరల్, ధర్మవరం, తాడిపత్రి, బత్తలపల్లి, పామిడి, మామిళ్లపల్లి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కుక్కకాటు బాధితులు సర్వజనాస్పత్రికి వస్తున్నారు.   

సంగీత అనె మహిళ కళ్యాణదుర్గం మండలం నర్సాపురం గ్రామం. కొన్ని రోజుల క్రితం కుక్కకాటుకు గురైన తన కుమారుడు వేదవ్యాస్‌ నాయక్‌కు రెండు డోస్‌ల యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌(ఏఆర్‌వీ)ను బెళుగుప్పలోని పీహెచ్‌సీలో వేయించారు. మంగళవారం మూడో డోస్‌ వేయించేందుకు అక్కడకు వెళితే.. వ్యాక్సిన్‌ లేదని చెప్పారు. దీంతో కుమారుడిని తీసుకుని సర్వజనాస్పత్రికి మధ్యాహ్నం 1.09 గంటలకు చేరుకున్నారు. డ్యూటీలో ఉన్న హెడ్‌నర్స్‌ను కలిసి విషయం చెబితే.. వ్యాక్సిన్‌ అయిపోయిందని చేతులెత్తేశారు. కళ్యాణదుర్గం నుంచి ఇక్కడకు రానుపోనూ రూ.200కు పైగా ఖర్చు అవుతుందని, ఇక్కడకు వచ్చాక లేదని చెబితే పిల్లాడి పరిస్థితి ఏమిటంటూ ఆవేదనతో ఆమె వెనుదిరిగారు. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లోనూ ఉంది. కుక్కకాటుకు గురైన వారు సూది మందు దొరక్క అవస్థలు పడుతున్నారు. ధర్మవరం నుంచి 12 మంది కుక్కకాటుకు గురై సర్వజనాస్పత్రికి రాగా అందులో 8 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు. మిగిలిన వారిని వెనక్కు పంపారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

100 వెయిల్స్‌ కొనుగోలు చేస్తున్నాం  
ఆస్పత్రిలో ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ కొరత ఉండేది వాస్తవమే. ఆస్పత్రి బడ్జెట్‌ నుంచి గుంటూరులోని ఓ ఫార్మసీ ద్వారా వంద వెయిల్స్‌ కొనుగోలు చేయబోతున్నాం. వ్యాక్సిన్‌ కొరతను ఇప్పటికే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాం.  
– డాక్టర్‌ రామస్వామి నాయక్, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌
 
రెండు నెలలుగా ఇదే పరిస్థితి 
రెండు నెలలుగా ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ కొరత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య. దేశంలో కేవలం మూడు కంపెనీలు మాత్రమే ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నాయి. వ్యాక్సిన్ల కొరతను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో వ్యాక్సిన్‌ రావచ్చు.  
– ఐవీఎస్‌ రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement