ఉగాది వేడుకలకు సర్వం సిద్ధం | Ugadi celebrations to prepare everything | Sakshi
Sakshi News home page

ఉగాది వేడుకలకు సర్వం సిద్ధం

Mar 21 2015 1:25 AM | Updated on Sep 2 2017 11:09 PM

నూతన రాష్ట్రంలో తొలి ఉగాది వేడుకలకు తుళ్లూరు మండలం అనంతవరం గ్రామం ముస్తాబైంది. రాజధాని ప్రాంతంలో తొలిసారిగా అనంతవరంలో అధికారికంగా....

అరండల్‌పేట(గుంటూరు)/తాడికొండ: నూతన రాష్ట్రంలో తొలి ఉగాది వేడుకలకు తుళ్లూరు మండలం అనంతవరం గ్రామం ముస్తాబైంది. రాజధాని ప్రాంతంలో తొలిసారిగా అనంతవరంలో అధికారికంగా ఉగాది పండుగను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు తగిన విధంగా తెలుగు సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా పండుగ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

రాష్ట్ర రాజధాని నిర్మాణంలో తొలి ప్రధాన ఘట్టమైన భూ సమీకరణ ప్రభుత్వం ఆశించిన రీతిలో జరగడంతో అధికారులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ ఏర్పాట్లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలోని నాలుగు ఎకరాల స్థలంలో సీఎం, ప్రముఖుల వేదిక, పంచాంగ శ్రవణం వేదిక, సంప్రదాయనృత్యాలకు ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేశారు.  వేలాది మంది ప్రజల సమక్షంలో ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఇదే ప్రథమం. ఉమ్మడి రాష్ట్రంలో ఇలా ప్రజల మధ్యలో ఉగాది వేడుకలను నిర్వహించిన దాఖలాలు లేవు.
 
ముఖ్యమంత్రి రాక ...
అనంతవరం గ్రామంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఆయన రాక కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ నిర్మించారు. సభాస్థలి చుట్టుపక్కల పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు  చేసి తనిఖీలు చేస్తున్నారు. గ్రామంలో ఉగాది వేడుకలను తెలిపే ఫ్లెక్సీలు, రోడ్లవెంట బ్లీచింగ్ చల్లారు. అడుగడుగునా పోలీసులను ఏర్పాటు చేయటంతో గ్రామం పోలీసు వలయంగా మారింది.

కొండపైకి రెండు బస్సులను ఏర్పాటు చేసి అందులో సీఎంతోపాటు కొందరు ప్రముఖలను వేంకటేశ్వరస్వామి దర్శనానికి తీసుకువెళ్లే ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 8 గంటలకు అనంతవరం చేరుకుని, కొండపై కొలువైన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఆ తరువాత ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. నాలుగుచోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మూడుచోట్ల ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు.
 
ఉగాది పురస్కారాలు... రైతులకు సన్మానం ....
ఉగాది వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట వ్యక్తులను సత్కరించనుంది. ఇప్పటికే కొంతమందికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. అదే విధంగా ఉత్తమ రైతులతో పాటు, భూసమీకరణకు భూములు ఇచ్చిన రైతులను ముఖ్యమంత్రి సన్మానించనున్నట్లు అధికారులు ప్రకటించారు. సీఎంను రైతులు అభినందించే కార్యక్రమాన్నీ ఏర్పాటు చేశారు.  ఈ వేడుకల బందోబస్తు విధుల్లో సుమారు 2500 మంది పోలీసులు పాల్గొంటున్నారు.

ఏడుగురు ఏఎస్సీలు, 20 మంది డిఎస్పీలను నియమించారు. వేదిక సమీపంలో కూర్చునే ప్రజలు సెల్‌ఫోన్‌లు, అగ్గిపెట్టెలు లేకుండా రావాలని పోలీసులు ప్రకటించారు. సుమారు 50 వేల మంది ప్రజలు ఈ వేడుకలకు రానున్నట్టు అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. అందరికి మంచినీరు, ప్రసాదాలను అందించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకట పూర్ణచంద్రప్రసాద్ పంచాంగ పఠనం చేస్తారు.
 
గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా వేదిక ...
 గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఉగాది వేడుకల వేదికను అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. 20 జానపద కళాబృందాలు ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement