అమ్మపై అలిగి.. సన్యాసినులుగా మారదామని

Twins Try To Fled Away To Kashmir To Become Monk In Chittoor - Sakshi

సాక్షి, పలమనేరు(చిత్తూరు) : తల్లి మందలించిందని అలిగిన కవల బాలికలు.. కశ్మీర్‌ వెళ్లి అక్కడ ఆశ్రమంలో సన్యాసినులుగా బతకాలని భావించి, అక్కడకు వెళ్లే ప్రయత్నంలో పోలీసులకు చిక్కారు. సీఐ శ్రీధర్‌ వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన విశ్వనాథ్‌కు కవల పిల్లలున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నారు. సంక్రాంతి సెలవులకు ఇంటికొచ్చిన పిల్లలను తల్లి మందలించడంతో వారు తల్లిపై అలిగారు. దీంతో తండ్రి వారిని తమిళనాడులోని కాట్పాడిలో ఉంటున్న బంధువుల ఇంటికి మూడు రోజుల కిందట తీసుకెళ్లాడు. వారిని అక్కడి వదిలి పనిమీద బయటకెళ్లాడు.

ఇదే అదునుగా భావించిన కవల పిల్లలు అక్కడి రైల్వేస్టేషన్‌కెళ్లి రైలెక్కి కర్నూలు వైపునకు వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న తండ్రి.. పిల్లలు కనిపించకపోవడంతో భార్యకు సమాచారమిచ్చాడు. ఆపై ఎక్కడ వెదికినా వారి ఆచూకీ లభించలేదు. వారి వద్దనున్న సెల్‌ఫోన్‌ సైతం స్విచాఫ్‌లో ఉంది. దీంతో తల్లిదండ్రులు మంగళవారం పలమనేరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పిల్లలు అదృశ్యమైంది తమిళనాడులోని కాట్పాడి కావడంతో సీఐ శ్రీధర్‌ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి కేసును కాట్పాడికి బదిలీచేశారు. కవలలు బుధవారం సాయంత్రం సెల్‌ ఆన్‌చేయడంతో.. టవర్‌ లొకేషన్‌ ఆధారంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలో వారున్నట్టు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకుని గురువారం వారిని పలమనేరుకు తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. స్నేహితురాలి సలహాపై దేశముదురు సినిమాలో హీరోయిన్‌లా సన్యాసినులుగా మారదామనుకున్నామని కవలలు పోలీసులతో చెప్పారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top