ఆ షార్ట్‌ ఫిల్మ్‌ వైరల్‌ కావడంతో.. 

TV Comedy Actor Gouse Basha Special Story - Sakshi

బుల్లితెరపై రాణిస్తున్న గౌస్‌బాషా 

హర్షిత పేరుతో స్త్రీ పాత్రల్లో గుర్తింపు.. 

కామెడీ షోలతో నవ్విస్తూ అందరి మన్ననలు పొందుతున్న పసుమర్రు వాసి

సాక్షి, యడ్లపాడు/గుంటూరు: చిన్ననాటి నుంచే అతనికి సినిమాలంటే ఎంతో ఇష్టం.. ఆ ఇష్టమే అతని ఆశయసాధన దిశగా అడుగులు వేయించింది. ఎందరో కళాకారులను అక్కున చేర్చుకునే కళామతల్లి ఒడిలో ఒదిగేలా చేసింది. బుల్లితెర, వెండితెర నటుడిగా మారేలా చేసింది. అతడే హాస్యనటుడు హర్షిత. ఇది ఇండస్ట్రీలో పిలుచుకునే అతని ముద్దుపేరు. అసలు పేరు గౌస్‌బాష. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన గోనె సంచుల వ్యాపారి మాబుసుభాని, మహబ్బీ దంపతుల పెద్ద కుమారుడు. స్త్రీ, పురుష పాత్రల్లో వేషం ఏదైనా నటన అదరహో అనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

ఉద్యోగం కోసమంటూ హైదరాబాద్‌కు.. 
మొదటినుంచి గౌస్‌బాష సినిమాలను ఎక్కువగా చూసేవాడు. కళపై మక్కువో.. నటుడు కావాలన్న కోరిక తెలియదు కాని ఇంటర్‌తోనే విద్యకు ఫుల్‌స్టాప్‌ పడింది. తల్లిదండ్రులు చూపిన విద్యమార్గం కంటే తాను ఎంచుకున్న రంగంపైనే అభిలాష ఎక్కువగా పెంచుకున్నాడు. ఇంటర్, ఏసీ మెకానికల్‌ ఐటీఐను అతికష్టం మీద పూర్తి చేశాడు. ఆరో తరగతి నుంచే కళారంగం అంటే ఇష్టత ఏర్పడిందని తాను కళాకారుడిగానే జీవితంలో గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నానని కుటుంబసభ్యులకు చెప్పాడు. పగటి కలలు కనకు అంటూ కుటుంబసభ్యులు తోసిపుచ్చారు. ఊళ్లో ఇది విన్నవారు కామెడీ చేస్తున్నావా అంటూ ఎద్దేవా చేశారు. ఆ మాటలు విన్న అతనిలో తన ఆశయం సాధించాలన్న కసి మరింతగా పెరిగింది. జాబ్‌ నిమిత్తమంటూ ఊరు విడిచి హైదరాబాద్‌ చేరుకున్నాడు.

నిరాశ ఎదురైనా పట్టు వీడలేదు  
తనకు ఎంతటి పట్టుదల ఉన్నా, తనలో ఎంతటి ప్రతిభ ఉన్నా గుర్తించే వ్యక్తి అవకాశం కోసం విశ్వప్రయత్నాలు చేశాడు. మూడేళ్లు గడిచాయి. ఒక్క అవకాశమూ తలుపు తట్టలేదు. జరిగిందేదో జరిగింది. ఇంటికి వచ్చేయమంటూ కుటుంబసభ్యులు, మిత్రులు సలహా ఇచ్చారు. అయినా లక్ష్యం సాధించే వరకు ఊరికి తన ముఖం చూపించకూడదనుకున్నాడు. 2018లో చివరిలో ఇండిపెండెంట్‌ పేరుతో రూపొందించే ఓ షార్ట్‌ఫిల్మ్‌లో అవకాశం లభించింది.  అందులో తన నటనా కౌసల్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. అది బాగా వైరల్‌ కావడంతో ఆ ఫొటోలు చూసి బుల్లితెరలో నటించే అవకాశం లభించింది.

ఇప్పుడు ఎన్నో అవకాశాలు... 
జెమినీలో జూలకటక, స్టూడియోవన్‌లో లాఫింగ్‌ అడ్డా, ఈటీవీ జబర్దస్త్, 108 తెలంగాణ చానల్‌లో గబ్బర్‌సింగ్‌ టెలీ కామెడీ షోలలో నటిస్తున్నాడు. దర్శకుడు మూర్తి.. బాషాను పిలిచి ముత్యాలముగ్గులో నటించే అవకాశం ఇచ్చి సీరియల్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత కాలేజీ పోరగాళ్లు, మళ్లీమళ్లీ చూశా, పుణ్యదంపతులు సినిమాల్లోనూ నటించాడు. వీటితోపాటు తనకు నటుడిగా గుర్తింపు తెచ్చిన షార్ట్‌ఫిల్మ్స్‌లో 20కు పైగా నటించాడు. వీటితో పాటు ప్రైవేట్‌ ఆల్బమ్‌ కవర్‌సాంగ్స్‌లోనూ నటిస్తున్నాడు. యూట్యూబ్‌ చానెల్స్‌ వారం వారం ప్రసారం చేసే యాదయ్య, యాదమ్మ ముచ్చట్లు, వారం వారం నీ కవితతో వంటి ప్రత్యేక ప్రోగ్రామ్స్‌లోనూ రాణిస్తున్నారు.

స్త్రీ వేషధారణకు మంచి గుర్తింపు  
స్త్రీ వేషధారణలో హర్షిత పేరుతో చేస్తున్న కామెడీ పోగ్రామ్స్‌ గౌస్‌బాషాకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ఆడవారి హావభావాలు ప్రదర్శించడం ఆషామాషీ విషయం కాదు. అందుకు ఆహార్యం ఒక్కటే సరిపోదు. అందుకు తగ్గ అభినయం ఉండాలి. మాటాల్లో మృధుత్వం పలకాలి. సిగ్గు, బిడియం తొణికిసలాడాలి. అన్నింటికి మించి నడకలో వయ్యారాలు పోవాలి. వీటన్నింటి ఓ మగాడు చేయాలంటే కత్తిమీద సామువంటిదే. అదికూడా టెలీషోలో చేయడమంటే చాలా కష్టం. కళల పట్ల ఆసక్తి..కళాకారుడిగా నిరూపించుకోవాలన్న కసి ఉన్నప్పుడే అవి సాధ్యపడతాయని గౌస్‌బాషా నిరూపించాడు. పలు చానల్లో కామెడీ షోలలో హర్షిత పేరుతో స్త్రీ పాత్రలు పోషిస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top