ప్రభుత్వ సేవలో ప్రగతి చక్రం

TRC Bus Services to Cbandrababu Naidu Meetings - Sakshi

అవస్థల్లో ప్రయాణికులు

ఆర్టీసీకి పేరుకు పోతున్న బకాయిలు

ప్రభుత్వ శాఖల చుట్టూ ఆర్టీసీ అధికారుల ప్రదక్షిణలు

ముందస్తు సమాచారం లేకుండా బస్సుల మళ్లింపు

చిత్తూరు రూరల్‌: సీఎం సభల పేరుతో ప్రయాణికులకు ఆర్టీసీ చుక్కలు చూపిస్తోంది. ప్రయాణికుల సౌకర్యాలను పక్కకు నెట్టేసి తమ ప్రచారం కోసం ఆర్టీసీ బస్సులను చంద్రబాబు ప్రభుత్వం దుర్వి నియోగం చేస్తోంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆర్టీసీ సర్వీసులను తరచుగా మళ్లిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు వస్తాయో రావో తెలియక బస్టాపుల వద్ద జనం పడిగాపులు కాస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. సీఎం సభలకు తరలిస్తున్న బస్సుల బకాయులు లక్షల్లో పేరుకుపోయాయని కార్మికవర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. చిత్తూరు 1,2 డిపోలో 182 సర్వీసులు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి చిత్తూరు మీదుగా 65 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రెండు డిపోలకు రోజుకు రూ. 15 నుంచి రూ.17లక్షల  ఆదాయం వస్తోంది.  గ్రామీణలు ఆర్టీసీ ప్రయాణాన్ని సురక్షిత ప్రయాణంగా భావిస్తున్నారు. చాలా గ్రామాలకు బస్సులే దిక్కుగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. 

ఎంతకీ బస్సులు రాకపోవడంతో బస్టాపుల వద్ద ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. చివరికి బస్సులు రాకపోవడంతో ప్రైవేటు సర్వీసులను ఆశ్రయించాల్సి వస్తోంది. సర్వీసులను రద్దు చేస్తున్నామని కనీస సమాచారం కూడా ఇవ్వడంలేదు. ఈ నెల 27న రాజమహేంద్రవరంలో జరగనున్న బీసీ సభకు పెద్దఎత్తున ఆర్టీసీ బస్సులను రిజర్వు చేస్తున్నారు. శుక్రవారం  విశాఖపట్నంలో జరిగే డీఆర్‌డీఏ స మావేశానికి 240 బస్సులు సిద్ధంగా ఉంచాలని ముందుగానే ఇండెంట్‌æ కూడా ఇచ్చారు. బస్సులను పబ్లిసిటీ కోసం వాడుకోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడడమే కాకుండా వాటికయ్యే ఖర్చుకు వివిధ శాఖల బకాయిలు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వ శాఖల చుట్టూ బకాయిల కోసం ఆర్టీసీ అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు.

రాజమండ్రిలో శనివారం జరిగే సీఎం సభకు ఆర్టీసీ అధికారులు బస్సులు సిద్ధం చేశారు. డిపో–1 నుంచి 7 సర్వీసులు, డిపో–2 నుంచి 10 సర్వీసులు  పంపనున్నారు. దీనికి సం బంధించి ప్రణాళికను అధికారులు పూర్తి చేసి బస్సులను గేటు దాటించారు.

జిల్లాలోని పెద్దతిప్పసముద్రంలో జరిగిన జలహారతి కార్యక్రమానికి డిపో–1 నుంచి 24, డిపో–2లో 30  సర్వీసులు పంపారు. చిత్తూరు– పరిసర ప్రాంతాల ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు.

చిత్తూరు జిల్లాలో జరిగే సభలతో పాటు ఇతర జిల్లాల్లో జరిగే సభలకు కూడా ఆర్టీసీ సేవలు అందిస్తోంది. ఈ నెల12వ తేదీన  నెల్లూరుకు డిపో–1లో 20, డిపో–2లో 26 సర్వీసులు మళ్లించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పోయే ప్రయాణికులకు ప్రైవేటు వాహనాలే దిక్కుగా మారాయి.

డిసెంబర్‌లో అనంతపురం జిల్లాకు కూడా ఇక్కడ నుంచి బస్సులను మళ్లించారు. డిపో–1 నుంచి 35 సర్వీసులు, డిపో–2 నుంచి 37 సర్వీసులు వెళ్లాయి. దీంతో చిత్తూరులోని ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు.

ప్రభుత్వ నిధుల దుబారా
పరిపాలనలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు తమ గొప్పతనమేనని నమ్మించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ వర్గాలను రాజధానికి తీసుకు వెళ్లి సన్మానాలు చేయించుకుంటున్నారు. కృతజ్ఞతా సభల పేరుతో దాదాపు అన్ని జిల్లాల నుంచి అమరావతికి తరలిస్తున్నారు. ఇక్కడితో ఆగకుండా ధర్మపోరాట దీక్షల పేరుతో రాష్ట్రం నలుమూలల నుంచి సభా వేదికల వద్దకు జనాల్ని రప్పిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన అని, అమరావతి సందర్శన అని పెద్ద ఎత్తున జిల్లాల నుంచి టీడీపీ అనుయాయులను తీసుకు వెళ్లి, అక్కడ అభి వృద్ధి జరిగిందనే భ్రమలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం సభలు సొం త జిల్లాలోనే కాకుండా ఏ ఇతర జిల్లాలో జరిగినా కూడా బస్సుల తిప్పేస్తున్నారు. కొన్ని నెలలుగా జరుగుతున్నతంతు ఇదే. ఎన్ని బస్సులు తరలిస్తున్నారో వాటికయ్యే వ్యయాన్ని సంబంధిత శాఖల నిధుల నుంచి వెచ్చిస్తున్నారు. సత్కారాలు, ప్రచారం కోసం ప్రభుత్వ నిధుల్ని దుబారా చేస్తున్న తీరుపై జనం మండిపడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top