రవాణా బంద్ | Transport strike | Sakshi
Sakshi News home page

రవాణా బంద్

Oct 1 2015 12:43 AM | Updated on Sep 3 2017 10:15 AM

రవాణా బంద్

రవాణా బంద్

రవాణా రంగం స్తంభించనుంది. ప్రైవేటురవాణారంగంలో కీలకమైన లారీలు, ట్రక్కులు, ట్యాంకర్లు ఎక్కడికక్కడ ....

నేటి నుంచి నిరవధిక సమ్మె
బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు
సమ్మెకు జిల్లాలోని పెట్రోల్ బంకులు దూరం!
{పత్యామ్నాయ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

 
విశాఖపట్నం : రవాణా రంగం స్తంభించనుంది. ప్రైవేటురవాణారంగంలో కీలకమైన లారీలు, ట్రక్కులు, ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోనుండడంతో సామాన్యులపై పెనుభారం చూపనుంది. ఈ ప్రభావంతో ఇప్పటికే ఆకాశానికి ఎగబాకిన నిత్యాసరాలు రవాణా సమ్మెతో చుక్కలనంటే అవకాశం ఉంది. అఖిల భారత మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు గురువారం నుంచి లారీ యజమానులు నిరవధిక సమ్మె చేపడుతున్నారు.ఆల్ గూడ్స్ వెహికల్స్  యూనియన్స్‌తో ఏర్పాటైన జేఏసీ ఇప్పటికే పలుదఫాలు సమావేశమై ఏర్పాట్లను పర్యవేక్షించింది. జిల్లాలో గూడ్స్ రవాణా చేసే వాహనాలు 25,617 ఉన్నాయి. వీటిలో   లారీలు, ట్రక్కులు, ట్యాంకర్లు, టిప్పర్లు, వ్యాన్లు ప్రధానమైనవి. ఇప్పటికే చాలా వాహనాలు నిలిచిపోగా..మిగిలిన వాహనాలు గురువారం తెల్లవారుజామున ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి.  రవాణా సమ్మె వల్ల ఒక్క విశాఖ జిల్లాలోనే ప్రతీ రోజూ ప్రభుత్వానికి పన్నుల రూపం లో రావాల్సిన రూ.8 కోట్లకు పైగా ఆదాయానికి గండిపడనుంది. ఇకవాహనాలు రోడ్డెక్కే పరిస్థితి లేకపోవడం వలన ఎగుమతి.. దిగుమతుల లావాదేవీలు స్తంభించి పోనున్నాయి.

వీటివిలువ మరో రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రవాణా సమ్మె వల్ల మన జిల్లా పరిధిలోనే మోటారు కార్మికులతో పాటు రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షమందికి పైగా కార్మికులకు ఉపాధి కరువయ్యే పరిస్థితి ఏర్పడనుంది. రాష్ర్టవ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి నుంచే పెట్రోల్ బంకు యజమానులు లారీ యజమానులతో కలిసి సమ్మెబాట పడుతున్నప్పటికీ విశాఖ జిల్లా పరిధిలోని బంక్ యజమానుల్లో మాత్రం బంద్‌లో పాల్గొనే విషయంపై స్పష్టత లేదు. జిల్లా పరిధిలో సుమారు 210 బంకులుండగా, వాటిలో 20 బంకులు నేరుగా హెచ్‌పీసీఎల్ నిర్విహ స్తోంది. హెచ్‌పీసీఎల్ బంకులు మినహా మిగిలిన ప్రైవేటు బంకులన్నీ సమ్మెబాట పట్టనున్నాయన్న వార్తల నేపథ్యంలో విశాఖ నగరంతో పాటు రూరల్ ప్రాంతంలోని బంకుల్లో వాహనదారులు బుధవారం మధ్యాహ్నం నుంచి బారులు తీరారు. ప్రతీ బంకు వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. ముందు జాగ్రత్తగా   క్యాన్లలో భారీగా పెట్రోల్, డీజిల్ నిల్వచేసుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు బంకుల వద్ద కన్పించాయి. కాగా, జిల్లా పరిధిలో పెట్రోల్ బంకు యజమానులు  లారీలు, ట్యాంకర్ల సమ్మెలో పాల్గొనడం లేదని విశాఖ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి నారాయణరెడ్డి సాక్షికి తెలిపారు. మరొక పక్క నిత్యావసరాలు, కూర గాయల రవాణాకు ఆటంకం కలుగకుండా  ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.

నిత్యావసరాలకు ఆటంకం రానివ్వకండి: కలెక్టర్ లారీలు, ట్యాంకర్ల నిరవధిక సమ్మె నేపథ్యంలో జిల్లాలో నిత్యావసరాల సరఫరాకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. సమ్మెకాలంలో పాలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలు, కూరగాయల రవాణాకు ఆటంకం కగలకుండా లారీ యజమానులు సహకరించేందుకు అంగీకరించాయని చెప్పారు. సమ్మె కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కలెక్టర్ యువరాజ్ బుధవారం రాత్రి రవాణాశాఖాధికారులు, లారీయజమానలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. పెట్రోల్ బంకులన్నింటిలోనూ కనీసం నాలుగైదు రోజులకు సరిపడేలా ఆయిల్ నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో కూరగాయలు రవాణా చేసేందుకు అనుమతించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. నిత్యావసరాలు రవాణా చేసే వాహనాలను ఎవరైనా అడ్డగిస్తే పోలీసులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జేసీ జె.నివాస్, డీటీసీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement