నేడు, రేపు మహానాడు | today ,tomrrow tdp mahanadu | Sakshi
Sakshi News home page

నేడు, రేపు మహానాడు

May 27 2014 1:52 AM | Updated on Oct 8 2018 5:28 PM

తెలుగుదేశం పార్టీ మహానాడు మంగళవారం నుంచి రెండు రోజుల పాటు రంగారెడ్డి జిల్లా గండిపేటలోని తెలుగు విజయంలో జరగనుంది. మహానాడుకు సుమారు 20 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

గండిపేట తెలుగు విజయంలో ఏర్పాట్లు పూర్తి
హాజరు కానున్న 20 వేల మంది ప్రతినిధులు
పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో పార్టీ నేతల్లో ఉత్సాహం

 
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడు మంగళవారం నుంచి రెండు రోజుల పాటు రంగారెడ్డి జిల్లా గండిపేటలోని తెలుగువిజయంలో జరగనుంది. మహానాడుకు సుమారు 20 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. పదేళ్ల తర్వాత టీడీపీ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో అధికారాన్ని చేపట్టనున్న నేపథ్యంలో మహానాడు ఉత్సాహభరిత వాతావరణంలో జరగనుంది. మహానాడు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు 17 కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీల పర్యవేక్షణలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహానాడుకు వచ్చే ప్రతినిధులకు తెలుగు విజయంలోనే బస ఏర్పాటు చేయనున్నారు. రెండు రోజుల మహానాడులో తెలుగుదేశం విజయం-తెలుగుజాతి, కార్యకర్తలకు అంకితం.. 2014లో జరిగిన స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల సమీక్ష.. అవినీతి రహిత భారతదేశం-సంస్కరణలు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రణాళిక అమలు చేస్తాం, తెలంగాణ ఎన్నికల ప్రణాళికలోని అంశాల అమలుకు పోరాడతాం.. పేదరికం లేని సమాజం, తెలుగుదేశం ఆశయం.. రాజకీయ తీర్మానం..

భారతదేశ విదేశాంగ విధానం- తెలుగుదేశం పాత్రపై చేసే తీర్మానాలపై పార్టీ  ప్రతినిధులు చర్చిస్తారు. తొలి రోజు ప్రతినిధుల నమోదు ఉంటుంది. ఆ తరువాత చంద్రబాబు మహానాడులో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను ప్రారంభిస్తారు. పార్టీ జెండా ఆవిష్కరణ, మా తెలుగుతల్లికి గీతాలాపన, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు మొదలవుతాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదిక, గత మహానాడు నుంచి ఇప్పటి వరకూ మరణించిన నేతలు, కార్యకర్తలకు నివాళి అనంతరం పార్టీ జమా ఖర్చులు ప్రవేశపెడతారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మహానాడులో ప్రారంభోపన్యాసం చేస్తారు. రెండోరోజు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్ 91వ జయంతి సందర్భంగా నివాళులు, ఎన్‌టీఆర్ పురస్కారాల ప్రదానం ఉంటుంది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేయటం వంటి అంశాలపై చర్చిస్తారు. రెండో రోజు సాయంత్రం అయిదున్నర గంటలకు చంద్రబాబు ముగింపు ఉపన్యాసం ఉంటుందని మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement