సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె విషయంలో హైకోర్టు వెలువరించనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్ : సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె విషయంలో హైకోర్టు వెలువరించనున్నతీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేడు హైకోర్టులో జరుగుతున్న విచారణ తుది అంకమేనని న్యాయనిపుణులు భావిస్తున్నారు. హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణ జరుగుతోంది. పిల్ దాఖలు చేసిన పిటిషనర్లతో పాటు, ప్రతివాదులుగా ఉన్న సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తమ వాదనలు ధర్మాసనం ముందు వినిపించాయి.
అందరినీ తమ వాదనలను శుక్రవారం రాతపూర్వకంగా ఇవ్వాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కళ్యాణజ్యోతిసేన్ గుప్తా, కె.చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. శుక్రవారం వాదనలను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. వీటిని పరిశీలించే ధర్మాసనం వెంటనే తీర్పు వెల్లడిస్తుందా? మళ్లీ వాయిదా వేస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఆతృత కనిపిస్తోంది. మరోవైపు సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడుతున్న విషయం తెలిసిందే.