వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ(ఎన్‌డీ)తో తమ పార్టీకి పొత్తులు ఉండే అవకాశముందని సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు తెలిపారు.
భద్రాచలం, న్యూస్‌లైన్: వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ(ఎన్‌డీ)తో తమ పార్టీకి పొత్తులు ఉండే అవకాశముందని సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు తెలిపారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... మతోన్మాదానికి వ్యతిరేకంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. బీజేపీతో పొత్తుకు ఉవ్విళ్లూరుతున్న టీడీపీతో కలిసి పనిచేసేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని తమ పార్టీ భావిస్తోందన్నారు.
సిట్టింగ్ స్థానాలైన కొత్తగూడెం, వైరాతోపాటు పినపాక, భద్రాచలం స్థానాల్లో కచ్చితంగా పోటీ చేస్తామన్నారు. ఇప్పటివరకూ మిత్రులుగా ఉన్న సోదర కామ్రేడ్లతో పోటీ రసవత్తరంగా ఉండబోతుందని వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్ సీపీతో పొత్తుకు సీపీఎం సిద్ధమవుతున్నట్టుగా తమకు సంకేతాలు ఉన్నాయన్నారు. పొత్తులపై పార్టీ రాష్ట్ర కమిటీ చర్చలు ప్రారంభించిందని, మరో పది రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితులకు భద్రాచలం కేంద్రంగా పునరావాసం కల్పించాల్సిన అవసరముందని అన్నారు. ఇందుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు.
ముంపు భూనిర్వాసితులకు మార్కెట్ రేటు కంటే నాలుగు రెట్లు అదనంగా పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంపు ప్రాంత వాసుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో సీపీఐ పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిద్ది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు రావులపల్లి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.