ఎన్డీ అజ్ఞాత దళం నుంచి ముగ్గురు పరార్ | Three ultras come out of New Democracy | Sakshi
Sakshi News home page

ఎన్డీ అజ్ఞాత దళం నుంచి ముగ్గురు పరార్

Oct 27 2013 7:12 AM | Updated on Oct 17 2018 3:43 PM

న్యూడెమోక్రసీ(ఎన్‌డీ)కి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ అజ్ఞాత నేత మధు ఆధ్వర్యంలో గుండాల ఏరియాలో పనిచేస్తున్న దళంలోని ప్రసాద్ (కమాండర్), మరో ఇద్దరు సభ్యులు ఆయుధాలతో శుక్రవారం రాత్రి పరారయ్యారు.

ఇల్లెందు, న్యూస్‌లైన్: న్యూడెమోక్రసీ(ఎన్‌డీ)కి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ అజ్ఞాత నేత మధు ఆధ్వర్యంలో గుండాల ఏరియాలో పనిచేస్తున్న దళంలోని ప్రసాద్ (కమాండర్), మరో ఇద్దరు సభ్యులు ఆయుధాలతో శుక్రవారం రాత్రి పరారయ్యారు. వీరు మూడు నెలల కిందటే దళంలో చేరారు. వీరు పరారైనట్టుగా గుర్తించిన మిగతా సభ్యులు శనివారం ఉదయం పరిసర ప్రాంతాల్లో గాలిస్తుండగా... ఒకచోట (ఆ ముగ్గురికి చెందిన) ఆయుధాలు, యూనిఫాం కనిపించాయి. గుండాల మండలంలో శనివారం కేంద్ర మంత్రి బలరాం నాయక్ పర్యటన ఉండడంతో పోలీసులు అడవుల్లో గాలింపు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో, అడవి నుంచి తేలిగ్గా తప్పించుకునేందుకే ఆ ముగ్గురు దళ సభ్యులు తమ ఆయుధాలను, యూనిఫామ్‌ను వదిలేసి ఉంటారని ఎన్‌డీ వర్గాలు భావిస్తున్నాయి.
 
ఎక్కడి నుంచి వచ్చారు.. ఎందుకు పరారయ్యారు...?!
వరంగల్ జిల్లాకు చెందిన ఎనిమిదిమంది కలిసి మూడు నెలల క్రితం ఎన్‌డీ దళాలలో చేరారు. కొద్ది రోజులకే వీరిలో ముగ్గురు ఇంటిబాట పట్టారు. ఆ తరువాత కొన్ని రోజులకు మరో సభ్యుడు కూడా మళ్లీ వస్తానంటూ ఇంటికి వెళ్లిపోయాడు. వరంగల్ నుంచి వచ్చిన ఎనిమిది మందిలో నలుగురు మాత్రమే మిగిలారు. వీరిలో ప్రసాద్ దళంలో ఆయనతోపాటు మరో ఇద్దరు, ఆజాద్ దళంలో ఒక్కరు ఉన్నారు. వరంగల్ నుంచి వచ్చిన ఎనిమిదిమందిలో మిగిలిన ఒకే ఒక వ్యక్తి ప్రస్తుతం ఆజాద్ దళంలో ఉన్నాడు. ప్రసాద్ సహా ఇద్దరు సభ్యుల పరారీపై అతడిని పార్టీ నాయకత్వం ప్రశ్నించినట్టు తెలిసింది.
 
‘మేమంతా కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనుకున్నాం. అందుకే ఆయుధాల కోసం దళంలో చేరాం. కొద్ది రోజుల తరువాత అందరం కలిసి ఆయుధాలతో పారిపోవాలని నిర్ణయించుకున్నాం’ అని ఆ సభ్యుడు వెల్లడించినట్టు తెలిసింది. వీరంతా గతంలో వరంగల్ జిల్లాలో జనశక్తి, సీపీయూఎస్‌ఐ దళాల్లో పనిచేసినట్టు సమాచారం. గతంలో సీపీయూఎస్‌ఐలో పనిచేసి ఎన్డీలోకి వచ్చిన దళ నేత గణేష్ ద్వారానే వీరంతా ఎన్డీ దళాల్లోకి వచ్చినట్టు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement