పండుగ రోజే ప్రమాదం

Three Injured in Bike Accident Guntur - Sakshi

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్‌

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి గాయాలు

యడ్లపాడు: నిలిపి ఉన్న లారీని బైక్‌ ఢీకొట్టడంతో ముగ్గురు గాయపడిన సంఘటన యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని చిన కోండ్రుపాడు గ్రామానికి చెందిన తమ్మలూరి నాగరాజు నాదెండ్ల మండలం గణపవరంలోని పశువుల ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఔట్‌ సోర్సింగ్‌ విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి యడ్లపాడులో చర్చికి వెళ్లాడు. అనంతరం భార్య యశోద, కుమారుడు రాణా, కుమార్తె దివ్యలను గణపవరంలోని అత్తగారింటి వద్ద దింపేందుకు బైక్‌పై బయలుదేరాడు. తిమ్మాపురం చేపలచెరువు సమీపంలో పంక్చర్‌ కావడంతో తమిళనాడుకు చెందిన లాంగ్‌ట్రాలీ లారీ హైవేపై నిలిపి ఉంది.

బైక్‌పై వస్తున్న నాగరాజుకు వెనుక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించడంతో వెనక్కి తిరిగాడు. అంతలో బైక్‌ ట్రాలీలారీని ఢీకొట్టింది. దీంతో బైక్‌ ట్రాలీ కిందకు దూరి ఇరుక్కుపోయింది. బైక్‌ ముందు ఆయిల్‌ ట్యాంక్‌పై కూర్చున్న నాగరాజు కుమారుడి ఎడమకన్నుకు తీవ్ర గాయమైంది. బైక్‌పై ఉన్న నలుగురు హైవేపై చెల్లాచెదురుగా పడిపోయారు. నాగరాజు తలకు, భార్య కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి బాలిక కన్నీరుమున్నీరుగా విలపించసాగింది. స్థానికులు పరుగున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూశారేఉ. ఎస్‌ఐ నాగేశ్వరరావు ప్రమాద వివరాలను సేకరిస్తున్నారు. 

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే విడదల రజని
ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లోనే చిలకలూరిపేట నియోజకవర్గంలో జరిగే క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనేందుకు గుంటూరు నుంచి వస్తున్న ఎమ్మెల్యే విడదల రజని హైవేపై జనాన్ని చూసి ప్రమాదం జరిగిందని గ్రహించి కారు దిగారు. బాధితులను పరామర్శించి అంబులెన్స్‌లో గుంటూరు జీజీహెచ్‌కు పంపించారు. అక్కడ నుంచే జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేసి సత్వర వైద్యం అందించాలని సూచించారు. కొద్దిసేపటి తర్వాత నాగరాజు మెడకు సర్జరీ చేస్తున్నామని, అతని భార్యకు స్వల్ప గాయాలయ్యాయని, బాబు కన్ను పరిస్థితి మాత్రం చెప్పలేమని వైద్యులు ఎమ్మెల్యేకు వివరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top