నాలుగేళ్లుగా ఎదురుచూపులు..

Thotapalli irrigation canals Not completed in four years - Sakshi

 పూర్తికాని తోటపల్లి ప్రధాన కాలువ –  గజపతినగరం బ్రాంచి కెనాల్‌ పనులు ’ వైఎస్సార్‌సీపీ అధినేతకు సమస్య వివరించిన సన్న, చిన్నకారు రైతులు

ప్రజా సంకల్పయాత్ర బృందం: తోటపల్లి ప్రాజెక్ట్‌ నీటి కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నామని గజపతినగరం నియోజకవర్గ సన్న, చిన్నకారు రైతుల తరఫున  డి.దేముడు, ఎంసీ నాయుడు, తదితరులు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గజపతినగరం నియోజకవర్గంలో గజపతినగరం మండలం గుడివాడ క్రాస్‌ వద్ద పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తోటపల్లి ప్రధాన కాలువ నుంచి గజపతినగరం బ్రాంచి కెనాల్‌ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టర్, అధికారుల ఉదాసీన వైఖరి వల్లే పనులు పూర్తి కావడం లేదన్నారు. దీంతో గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో సుమారు 15 వేల ఎకరాలకు సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బాబూ జగజ్జీవన్‌రామ్‌ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేస్తే ఉత్తరాంధ్రలో సుమారు నాలుగు లక్షల ఎకరాల భూమికి సాగునీరందుతుందని చెప్పారు. సాగు నీటి పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు న్యాయంచేయాలని కోరారు. 

కార్మికుల పక్షాన నిలవాలి..
 పారిశుద్ధ్య కార్మికుల పక్షాన నిలబడి న్యాయం చేయాలని గజపతినగరం డివిజన్‌ పారిశుద్ధ్య కార్మికుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పి.నాగేశ్వరరావు, ఎస్‌.కృష్ణ, గౌరవాధ్యక్షుడు కె.అప్పలరాజు, తదితరులు కోరారు. సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి పురం అప్పారావు ఆధ్వర్యంలో మానాపురం వద్ద జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన కార్మికులకు కార్యదర్శులు, జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. జీఓ 151 ప్రకారం జీతాలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అమలు కావడం లేదని వాపోయారు.  

వివక్ష కనబరుస్తున్నారు..
అనంతపురం జిల్లాలో గల శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల విషయంలో ప్రభుత్వం వివక్ష కనబరుస్తోందని యూనివర్సీటీ టీచర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ చాగంటి రామిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూనివర్సీటీలో 29 మంది రెగ్యులర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి 2009లో నోటిఫికేషన్‌ ఇచ్చి 2010లో విధులు అప్పగించారన్నారు. అయితే డీఏ, ఇంక్రిమెంట్ల వంటి సౌకర్యాలు కల్పించడంలో యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. రెగ్యులర్‌ సిబ్బందితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలన్న  హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ  తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  తమకు న్యాయం చేయాలని జననేత దృష్టికి తీసుకువచ్చారు. 

టీడీపీ హయాంలో అన్యాయం.. 
చంద్రబాబు సర్కార్‌ గీత కార్మికులకు తీరని అన్యాయం చేసిందని ఏపీ గీతకార్మిక సంఘ జిల్లా కమిటీ అధ్యక్షుడు పురం ఫణీంద్రకుమార్‌ అన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కార్మికుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 80 వేల కుటుంబాలు.. 100కు పైగా సంఘాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయరన్నారు. జీఓ 560 ప్రకారం ప్రతి గీత కార్మిక సొసైటీకి ఐదెకరాల భూమి ఇస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదని వాపోయారు.  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక గీత కార్మికులను ఆదుకోవాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top