బియ్యం మాయా జాలం | Thin polished rice under the ration market | Sakshi
Sakshi News home page

బియ్యం మాయా జాలం

Apr 19 2016 4:10 AM | Updated on Sep 3 2017 10:11 PM

బియ్యం మాయా జాలం

బియ్యం మాయా జాలం

వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపంలోని బాయిల్డ్ రైస్‌మిల్లుపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ....

రేషన్ బియ్యానికి పాలిష్ సన్నాల పేరుతో మార్కెట్‌లోకి
సీఎంఆర్ బియ్యం కూడా రేషన్‌వే తమిళనాడు రేషన్
బియ్యానికి సోకులు కర్ణాటక, తమిళనాడు,ఆంధ్రలో విక్రయాలు

రేషన్ బియ్యానికి సోకులు చేసి సన్నాలు పేరుతో మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. విషయం తెలియని జనం వ్యాపారులపై నమ్మకంతో కొనుగోలు చేసి మోసపోతున్నారు. బియ్యం మాయాజాలంలో కొందరు మిల్లర్లు, మరి కొందరు రేషన్ డీలర్ల పాత్ర ఉందని అధికారులు చెబుతున్నారు. వెంకటాచలం మండల పరిధిలో ఆదివారం పట్టుబడిన బియ్యం ఈ కోవకు చెందినవేనని తెలిసింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:   వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపంలోని బాయిల్డ్ రైస్‌మిల్లుపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదివారం దాడి చేసి సుమారు రూ.కోటి విలువచేసే బియ్యాన్ని  సీజ్ చేసిన విషయం తెలిసిందే. దాడుల్లో పట్టుబడిన బియ్యంలో తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన రేషన్ బియ్యం ఉండటం గమనార్హం. తమిళనాడులో ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని జిల్లాకు చెందిన మిల్లర్లు కొందరు కొనుగోలు చేసుకుంటున్నారు. అక్కడి డీలర్ల నుంచి కిలో రూ.5 నుంచి రూ.7 మధ్యలో కొనుగోలు చేసి జిల్లాకు తీసుకొస్తున్నారు. మరి కొందరు రేషన్ లబ్ధిదారులు సైతం బియ్యాన్ని డీలర్‌కే ఇచ్చి డబ్బులు తీసుకెళ్తున్నట్లు సమాచారం. అదేవిధంగా జిల్లాలోనూ రేషన్ బియ్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా లక్షకుపైగా బోగస్ కార్డులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటికి కేటాయించిన బియ్యాన్ని డీలర్లు మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. మరి కొందరు లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని డీలర్లకే అప్పగించి కిలో రూ.7 చొప్పున తీసుకుంటున్నారు. రేషన్ డీలర్లు అదే బియ్యాన్ని మిల్లర్లకు కిలో రూ.12 నుంచి రూ.15 మధ్యలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

 రేషన్ బియ్యానికి సన్నబియ్యంగా పాలిష్

 తమిళనాడు, మన రాష్ట్రంలో రేషన్ డీలర్ల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని మిల్లర్లు పాలిష్ చేస్తున్నారు. ఒకటి రెండు పర్యాయాలు పాలిష్‌చేసి సన్నబియ్యంగా సోకులు అద్దుతారు. ఆ బియ్యాన్ని కొత్త సంచుల్లో నింపి నెల్లూరు సోనా పేరుతో మార్కెట్‌లో కిలో రూ.30కి విక్రయిస్తున్నారు. అదే బియ్యాన్ని తిరిగి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు లారీల ద్వారా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. సీఎంఆర్ కింద ఇచ్చే బియ్యం కూడా రేషన్‌వేనని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం 100కుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వ 1.25 లక్షల మెట్రికుటన్నుల ధాన్యాన్ని సేకరించింది. అలా సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించి నిల్వచేశారు. మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని బియ్యంగా చేసి (సీఎంఆర్) ఇవ్వమని ఆదేశాలు ఇచ్చింది. ధాన్యాన్ని బియ్యంగా మార్చి గత ఏడాది నవంబర్ నెలలోపు ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంది. అందులో 79 వేల మెట్రికుటన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పారు. అయితే ఆ బియ్యం ఎక్కువశాతం రేషన్ బియ్యమేనని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంకటాచలంలో తాజాగా పట్టుబడ్డ బియ్యమే ఇందకు నిదర్శనమని విజిలెన్స్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. రేషన్ బియ్యాన్ని పాలిష్‌చేసి సన్నాల రూపంలో విక్రయిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవటంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 వ్యవసాయశాఖలో విజిలెన్స్ విచారణ

 నెల్లూరు(అగ్రికల్చర్) : వ్యవసాయ శాఖలో విజిలెన్స్ అధికారులు భూసార పరీక్షల ల్యాబ్‌లో చోటుచేసుకున్న అంశాలపై సోమవారం విచారణ చేపట్టినట్లు సమాచారం. నగరంలోని మినీబైపాస్ రోడ్డులో ఉన్న జేడీఏ కార్యలయంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేయడంతో ఒక్కసారిగా ఆ శాఖలో కలకలం రేగింది. ఈ ఏడాది జనవరి 23వ తేదీన మహిళా ఏఓను ఏడీఏ గయాజ్ అహ్మద్ లైంగికంగా వేధిస్తున్నాడని ఆశాఖ జేడీఏకు ఫిర్యాదు చేసింది. అనంతరం కలెక్టర్ జానకి, ఎస్పీకి బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఏడీఏపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ, లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఏడీఏ కీచకపర్వంపై సాక్షిలో వరుస కథనాలు ప్రచురించడంతో స్పందించిన  కలెక్టర్ ఏడీఏను ఆశాఖ కమిషనరేట్‌కు మార్చి 17వతేదీన సరెండర్ చేశారు. భూసార పరీక్షల కేంద్రం ఏడీఏగా బాధ్యతలు తప్పించిన విషయం విదితమే. అట్రాసిటీ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి తోడు విజిలెన్స్ అధికారులు ల్యాబ్‌లో విచారణ చేపట్టం చర్చనీయాంశంగా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement