కల్తీ భోజనంబు..! 

There Is No minimum Standard Of Hotels In Nellore District - Sakshi

నాణ్యతకు పాతరేస్తున్న హోటళ్లు, ప్రజల ప్రాణాలతో చెలగాటం

నిల్వ ఉంచిన మాంసం, కల్తీ పదార్థాలతో ఆహారం తయారీ

జిల్లాలో 1100 హోటల్స్‌ ఉండగా కేవలం 50కి మాత్రమే లైసెన్స్‌

వరుస దాడులు నిర్వహిస్తామంటున్న ఫుడ్‌ కంట్రోల్‌ శాఖ

నోరూరించే రుచికరమైన ఆహారం తిందామని హోటల్‌కి వెళుతున్న వారు అనారోగ్యం పాలవుతున్నారు. రోడ్డుపక్కన ఉన్న బండ్లే కాదు.. చిన్న చిన్న హోటళ్ల నుంచి రెస్టారెంట్లలో సైతం అంతా కల్తీనే. రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం, నాసిరకం, కల్తీ, రసాయన వస్తువులతో ఆహార పదార్థాలను కలర్‌ ఫుల్‌గా తయారు చేస్తూ నాణ్యతకు పాతరేస్తున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు . శుభ్రతను గాలికొదిలేశారు. హోటళ్లలోని వంటశాలల్లో పారిశుద్ధ్యం సైతం అధ్వానంగా ఉంటోంది. నెల్లూరు నగరంలో నాలుగు రోజులుగా ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు పలు హోటళ్లపై దాడులు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. 

సాక్షి, నెల్లూరు(సెంట్రల్‌) : జిల్లావ్యాప్తంగా స్టార్‌ రెస్టారెంట్ల నుంచి చిన్న చిన్న హోటళ్లు సుమారు 1100 వరకూ ఉన్నాయి. నెల్లూరు నగరంలో 450 వరకు ఉన్నాయి. హైవేపై దాబాలు 70 వరకూ ఉన్నాయి. జిల్లాలో పెద్ద హోటళ్లు పదికి పైగా ఉన్నాయి. ప్రధానంగా నెల్లూరు, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో హోటళ్లు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో కేవలం 50 లోపు మాత్రమే లైసెన్సులు ఉన్నట్లు గుర్తించారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న హోటళ్లపై ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు, హెల్త్‌ అధికారులు నాలుగు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల కనీస నాణ్యత కూడా పాటించడం లేదు. మాం సాహారాలు ఎక్కువగా ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన వాటిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వాటితో బిర్యా నీ, కర్రీస్‌ తయారు చేస్తున్నారు. అలాగే తయారు చేసే చోట నాణ్యత లేకుండా అపరిశుభ్రంగా ఉన్నాయి.

దాబా ల్లో కూడా ఆహార పదార్థాల తయారీలో ఎక్కువగా నాణ్యత లేకుండా మోతాదుకు మించి రసాయనాలు వాడుతున్నట్టు తెలు స్తోంది. అంతేకాకుండా నగరంలోని పలు ఐస్‌ క్రీం షాపుల్లో సైతం మోతాదుకు మిం చి రసాయనాలు వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కల్తీలతో వినియోగదారులను మోసం చేస్తున్న వారి పై అధికారులు వరుస దాడులు చేస్తున్నా రు. అధికారుల దాడుల వివరాలను ముం దుగానే తెలుసుకుని కొందరు జాగ్రత్త పడుతున్నారు. అంతేకాకుండా పండ్లపై సైతం రసాయనాలు వినియోగిస్తున్నారు. ఫ్రూట్‌ జ్యూస్‌లలో కూడా అంతా కల్తీనే. స్వీట్‌ దుకాణాల్లో సైతం కల్తీ జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. నాలుగు రోజులు గా దాడులు నిర్వహిస్తున్న అధికారులు 120 వరకు కేసులు నమోదు చేశారు.
 
లైసెన్సులు పొందాలి ఇలా..
ఆహార పదార్థాల విక్రయాలు చేసే ప్రతి సంస్థ, దుకాణం, మాల్స్‌ తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాల చట్టానికి సంబంధించి లైసెన్సును పొందాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.12 లక్షల లోపు టర్నోవర్‌ చేస్తున్న చిన్న బడ్డీకొట్టులు, బండిపై విక్రయాలు చేసే వారు ఏడాదికి రూ.100, అలాగే రూ.12 లక్షలపైన, రూ.20 కోట్ల వరకు టర్నోవర్‌ ఉన్న వారు ఏడాదికి రూ.2 వేలు కట్టి లైసెన్సులు తీసుకోవాలి. ప్యాకెట్‌ చేసి బ్రాండ్‌ నేమ్‌ వేసుకునే వారు ఏడాదికి రూ.3 వేలు, వివిధ రకాల తయారీ యూనిట్‌లు రూ.5 వేలు చెల్లించి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది.

హోటళ్లలో అధికారుల తనిఖీలు
నెల్లూరు(సెంట్రల్‌): నగరంలోని హోటళ్లలో ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు, మున్సిపల్‌ హెల్త్‌ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నగరంలోని బాబు ఐస్‌క్రీమ్స్, మద్రాస్‌ బస్టాండు సెంటర్‌లోని బిరియాని హౌస్, సింహపురి రుచులు, హోటల్‌ ప్రిన్స్‌లో అధికారులు తనిఖీలు జరిపారు. బాబు ఐస్‌క్రీమ్స్‌లో తయారీ ప్రాంతం అపరిశుభ్రంగా ఉండడాన్ని గుర్తించారు. బిరియాని హౌస్‌లో, సింహపురి రుచుల్లో నాణ్యత లేని రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. ఒక్కరోజు దాడుల్లో సుమారు రూ.1.50 లక్షల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ మూర్తి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలు, ప్లాస్టిక్‌ కవర్లను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కఠిన చర్యలు తీసుకుంటాం
ప్రజలకు హాని కలిగించే ఏ విధమైన ఆహారాన్ని విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిల్వ లేని ఆహారాన్ని విక్రయాలు చేయాలే తప్ప రోజుల తరబడి నిల్వ చేస్తే ఊరుకునేది లేదు. మా సంతకం లేకుండా ఎక్కడా లైసెన్సులు ఇవ్వడం జరగదు.
– బి.శ్రీనివాస్, ఫుడ్‌ కంట్రోల్‌ జిల్లా అధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top