అధ్వాన భోజనం

అధ్వాన భోజనం


జిల్లాలో మధ్యాహ్న భోజనం పథకం అమలుతీరు ఘోరం

బిల్లులు రాకపోవడంతో నాణ్యత పాటించలేకపోతున్న ఏజెన్సీలు

కొన్నిచోట్ల గుడ్డు లేదు... మరికొన్నిచోట్ల ముద్దన్నం

అధికారుల పర్యవేక్షణ కరువు


 

నెల్లూరు (అర్బన్): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం.. విద్యార్థులకు రోజూ ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడతాం.. పాఠ్యపుస్తకాలిస్తాం.. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.. ఇవి బడి పిలుస్తోంది కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం చెప్పిన గొప్పలు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. అందుకు ఉదాహరణే జిల్లాలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం. ప్రధానంగా మెనూ పాటించడం లేదు. పురుగుల బియ్యం... నాణ్యతలేమి..అలాగే ఏజెన్సీలకు సకాలంలో బిల్లు లు చెల్లించడం లేదు. దీంతో పథకం అస్తవ్యస్తంగా నడుస్తోంది. మంగళవారం సాక్షి నిర్వహించిన విజిట్‌లో పథకం అమలులో చోటుచేసుకున్న అనేక లోటుపాట్లు వెలుగుచూశాయి.



సకాలంలో అందని బిల్లులు : జిల్లావ్యాప్తంగా 3,551 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఇస్కాన్ సిటీ వాళ్లు 315 పాఠశాలకు భోజనం సరఫరా చేస్తుండగా, 336 పాఠశాలల్లో పొదుపు మహిళలు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇస్కాన్ టెంపుల్ కింద నెల్లూరు సిటీ, రూరల్ ప్రాంతాల్లో 223 పాఠశాలలు, కోవూరు మండలంలో 72, వెంకటాచలం మండలంలో 20 పాఠశాలలున్నాయి. జిల్లావ్యాప్తంగా 2,11,772 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. కాగా భోజనం తయారు చేస్తున్నందుకు ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు అందడంలేదు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించి సుమారు రూ.కోటి వరకు బిల్లులు రావాల్సి ఉంది. అలాగే జిల్లాలో 6,472 మంది నిర్వాహకులుండగా, ఇందులో 3,236 మంది వంటవాళ్లు, 3,236 మంది హెల్పర్లున్నారు. వీరికి మూడు నెలలకు గాను రూ.1,94,16,000 చెల్లించాల్సి ఉంది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. అలాగే బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఏజెన్సీలు విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నాయనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.



పర్యవేక్షణ కరువు : జిల్లాస్థాయిలో మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా విద్యాశాఖాధికాారి కార్యాలయంలో సిబ్బంది ఉండాలి. ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్‌ను నియమించుకోవచ్చునని అప్పట్లో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇంతవరకు ఆ పోస్టుల భర్తీ జరగలేదు. దీంతో బిల్లుల చెల్లింపులు, బడ్జెట్ కేటాయింపులు, పర్యవేక్షణ, తనిఖీలు ఆశించిన స్థాయిలో జరగడంలేదు. ఆయా డివిజన్ల ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు రోజూ కనీసం రెండు పాఠశాలల్లో పథకాన్ని పరిశీలించాలి. అయితే పరిశీలిస్తున్న దాఖలాలు మాత్రం లేవు.



► వాకాడు మండలం తుపిలిపాళెం ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు ఒకే ప్లేటులో భోజనం చేయడం కనిపించింది.

► బుచ్చిరెడ్డిపాళెంలో బీఎల్‌ఎన్‌కే ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉడికీ ఉడకని భోజనం పెట్టారు.

► దగదర్తి జెడ్పీహెచ్‌ఎస్‌లో 20 రోజులుగా గుడ్డు పెట్టడంలేదు.

► జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి.  ప్రభుత్వం ఏజన్సీలకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి పథకాన్ని జరిపిస్తున్నట్లు ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top