స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నేడు | The Standing Committee held today | Sakshi
Sakshi News home page

స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నేడు

May 21 2016 6:03 AM | Updated on Aug 10 2018 8:16 PM

స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నేడు - Sakshi

స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నేడు

నెల్లూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు శనివారం జరగనున్నాయి.

వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు, టీడీపీ నుంచి ఐదుగురు పోటీ
సీసీ కెమెరా నిఘాలో ఎన్నికల ప్రక్రియ

నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, టీడీపీ నుంచి ఐదుగురు బరిలో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొబ్బల శ్రీనివాసయాదవ్, ఊటుకూరు మాధవయ్య, టీడీపీ నుంచి కిన్నెర ప్రసాద్, దాసరి రాజేష్, దొడ్డపనేని రాజానాయుడు, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అంచూరు జానకి, షేక్ వహీద పోటీలో ఉన్నారు. శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్పొరేషన్ కార్యాలయంలో పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఎన్నికైన వారి జాబితాను సాయంత్రానికి ప్రకటించనున్నారు. ప్రిసైడింగ్ అధికారిగా అడిషనల్ కమిషనర్ గుర్రం రవి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారిగా డీఈ సుందరామిరెడ్డి, ఓపీఏలుగా ఆర్‌ఓ సమద్, ఆర్‌ఐ చినబాబు, సూపరింటెండెంట్‌గా శ్రీనివాసులును నియమించారు.

 స్వేచ్ఛకు సంకెళ్లు..

మేయర్ పాలనపై ఇప్పటికే టీడీపీ కార్పొరేటర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో మేయర్‌పై రోజురోజుకూ వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ వెనుక టీడీపీలోకి వెళ్లిన కార్పొరేటర్లు, అధికార పార్టీలోని కొందరు కార్పొరేటర్లు ఇటీవల బహిరంగ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. గతేడాది స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకపోగా, ఈ ఏడాది బరిలోకి దిగింది. మేయర్‌పై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓటేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టీడీపీ జిల్లా నాయకులు ఆ పార్టీ కార్పొరేటర్లతో పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కార్పొరేషన్లో టీడీపీకి 36 మంది కార్పొరేటర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 17 మంది కార్పొరేటర్ల బలం ఉంది. అధికార పార్టీకి గెలుపొందేందుకు కావాల్సిన సంఖ్యా బలం ఉన్నా, పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మేయర్‌పై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లను బుజ్జగించే పనిలో అధికార పార్టీ నాయకుల ఉన్నారు. ఎన్నికలు నిర్వహించే హాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా ఎన్నికలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అటు రాజకీయ వర్గాలు, ఇటు అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. స్వేచ్ఛగా ఓటేసే కార్పొరేటర్లకు సంకెళ్లు వేసినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement