పదో తరగతి విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా జరుగుమల్లి బీసీ కాలనీలో సోమవారం జరిగింది.
ప్రకాశం(జరుగుమల్లి): పదో తరగతి విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా జరుగుమల్లి బీసీ కాలనీలో సోమవారం జరిగింది. వివరాలు కాలనీకి చెందిన ఘడియపూడి సుధాకర్, వెంకాయమ్మ దంపతుల కుమార్తె కావ్య జరుగుమల్లిలో తాత వద్ద ఉంటూ పదో తరగతి చదువుతోంది. కావ్య చదువులో ఎప్పుడూ ముందుంటూ తెలివిగల విద్యార్థినిగా పేరు తెచ్చుకుంది. సోమవారం ఒంటిపూట బడి కావడంతో మధ్యాహ్నం ఇంటికి వచ్చింది.
పనికి వెళ్లి వచ్చిన తాత ఇంటి తీసి చూడగా ఎదురుగా మనుమరాలు కావ్య(15) చున్నీతో దూలానికి వేలాడుతూ కనిపించింది. దీంతో భయపడి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి వెంటనే కిందికి దించారు. అప్పటికే విద్యార్థిని మృతిచెందింది. కావ్య ఆత్మహత్య చేసుకోడానికి కారణాలు తెలియలేదు. సమాచారం అందుకున్న సింగరాయకొండ సీఐ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.